NASA James Webb Telescope : ఉల్కాపాతంతో శాశ్వతంగా దెబ్బతిన్న అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌

ABN , First Publish Date - 2022-07-20T01:56:15+05:30 IST

అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ (NASA) ఏర్పాటు చేసిన, ప్రపంచంలో

NASA James Webb Telescope : ఉల్కాపాతంతో శాశ్వతంగా దెబ్బతిన్న అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌

వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ (NASA) ఏర్పాటు చేసిన, ప్రపంచంలో అత్యంత భారీ, అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ (James Webb)కు శాశ్వత నష్టం జరిగింది. మే నెలలో అనేక గ్రహ శకలాలు (Asteroids) ఢీకొనడం వల్ల ఈ అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టెలిస్కోప్ పంపించిన తొలి చిత్రాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 


కొందరు శాస్త్రవేత్తలు ప్రచురించిన తాజా నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James Webb Telescope) పనితీరును దాని ప్రారంభ దశలో పరిశీలించినపుడు సరిదిద్దడానికి వీలుకానటువంటి సమస్యలు కనిపించాయి. మొత్తం మీద చూసినపుడు తక్కువ స్థాయి ప్రభావమే అయినప్పటికీ, దానిని ఇంకా కచ్చితంగా నిర్థరించలేదు. ప్రస్తుతం సూక్మ్మమైన ఉల్కలు (micrometeoroid) ఢీకొనడం వల్ల  దీర్ఘకాలిక ప్రభావం పడుతోంది, ఇది అనిశ్చితికి అతి పెద్ద కారణం. దీనివల్ల ప్రధాన దర్పణం (Primary Mirror)  నెమ్మదిగా క్షీణిస్తోంది. 


జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రధాన దర్పణాన్ని మే 22న ఆరు సూక్ష్మ ఉల్కలు ఢీకొట్టాయి. వీటిలో ఆరో ఉల్క వల్ల జరిగిన నష్టం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ప్రారంభంలో ఇది అంత పెద్ద నష్టం కాదని అనుకున్నారు. కానీ ఈ తాజా నివేదిక ప్రకారం ఇది అనుకున్నదాని కన్నా ఎక్కువ తీవ్రతగల నష్టం అని తెలుస్తోంది. ఈ టెలిస్కోప్‌ను ప్రారంభించినపుడు ఒక సూక్ష్మ ఉల్కవల్ల జరిగే నష్టాన్ని ఊహించారు. ఆ అంచనాకు మించి ఇప్పుడు నష్టం జరగడంతో మరింత పరిశోధన, మోడలింగ్ జరగాలని స్పష్టమవుతోందని తాజా నివేదిక వెల్లడించింది. అయితే ఈ నష్టం వల్ల ప్రైమరీ మిర్రర్ రిజల్యూషన్‌ దెబ్బతినలేదని, సూక్ష్మ ఉల్కలు ఢీకొనడం వల్ల మిర్రర్స్, సన్‌షీల్డ్ నెమ్మదిగా క్షీణిస్తాయని ఈ వెబ్‌ను డిజైన్ చేసిన ఇంజినీర్లు భావిస్తున్నారని తెలిపింది. 


James Webb Space Telescopeను నిర్మించడానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చయింది. దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA)  సహకారంతో నాసా నిర్మించింది. స్పేస్ టెలిస్కోప్‌లో అత్యంత భారీ మిర్రర్స్‌లో ఒకటి దీనిలో ఉంది. దీనిని 2021 డిసెంబరు 25న ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి నుంచి భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంది. సెకండ్ లగ్రాంగ్ పాయింట్ అనే ప్రాంతంలో ఉంది.



తొలి చిత్రం చారిత్రక ఘట్టం : జో బైడెన్

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపించిన తొలి చిత్రాల్లో ఒకదానిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూలై 11న వైట్ హౌస్‌లో ఆవిష్కరించారు. ఈ తొలి చిత్రం సైన్స్, టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, రోదసీ పరిశోధనలకు, అమెరికాకు అదేవిధంగా యావత్తు మానవాళికి ఓ చారిత్రక ఘట్టమని తెలిపారు. 


ఈ చిత్రాన్ని ఈ టెలిస్కోప్ ఫస్ట్ డీప్ ఫీల్డ్ అని పేర్కొంటున్నారు. గెలాక్సీ క్లస్టర్ SMACS 0723ని ఇది చూపిస్తోంది. 

Updated Date - 2022-07-20T01:56:15+05:30 IST