ఆ asteroid కోసం NASA వేట.... ఎందుకంటే?

ABN , First Publish Date - 2021-10-06T23:53:20+05:30 IST

ధూళి, మంచు కాకుండా అత్యంత అరుదైన, విలువైన లోహాలు అధికంగాగల

ఆ asteroid కోసం NASA వేట.... ఎందుకంటే?

న్యూఢిల్లీ : ధూళి, మంచు కాకుండా అత్యంత అరుదైన, విలువైన లోహాలు అధికంగాగల గ్రహ శకలం (ఆస్టరాయిడ్)ను అధ్యయనం చేసేందుకు సైక్ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రయోగించబోతున్నారు. జూలెస్ వెర్నే రాసిన నవల ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ స్ఫూర్తితో అమెరికాకు చెందిన నాసా ఈ ప్రయోగం చేస్తోంది. ప్రాచీన ప్రపంచానికి చెందిన ద్రవ రూపంలో గడ్డకట్టిన భారీ గ్రహ శకలాన్ని ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది. 


అంగారక, గురు గ్రహాల మధ్య ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సూర్యుని చుట్టూ తిరిగే సైక్ ఆస్టరాయిడ్ లక్ష్యంగా ఈ సైక్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ప్రాచీన భూ గ్రహ నిర్మాణంలో ఇనుము అధికంగా గల భాగంగా దీనిని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో వెలుపలి శిలా భాగం విడిపోయి సైక్ ఆస్టరాయిడ్‌గా ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. 


భూమిపై ఏర్పాటు చేసిన రాడార్లు, టెలిస్కోపుల ద్వారా పరిశీలించినపుడు ఈ సైక్ (Psyche) ఆస్టరాయిడ్ వెడల్పు 280 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిలో అధికంగా లోహాలు ఉన్నట్లు గమనించారు. సౌర వ్యవస్థలో ఏదో ఒక చోట లోహాలు అధికంగాగల మెటీరియల్‌తో రూపొందిన, ఇనుముతో కూడిన ప్రత్యేక రకానికి చెందిన భాగం విడిపోయి ఈ గ్రహ శకలంగా ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. 


మెయిన్ ఆస్టరాయిడ్ బెల్ట్‌ లోపల ఈ సైక్ ఆస్టరాయిడ్ ఆవిర్భవించి ఉండవచ్చునని అమెరికాకు చెందిన నాసా చెప్తోంది. భూమి వంటి అంతర్గత గ్రహాల మాదిరిగా అదే ప్రాంతంలో ఇది ఆవిర్భవించి ఉండవచ్చునని, లేదా, సౌర వ్యవస్థ బయటి ప్రాంతంలో అయినా ప్రస్తుత గురు గ్రహం మాదిరిగా ఇది ఏర్పడి ఉండవచ్చునని కూడా చెప్తోంది. సైక్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉపయోగిస్తున్న గామా-రే, న్యూట్రాన్స్ స్పెక్ట్రోమీటర్ ఇన్‌స్ట్రుమెంట్ వల్ల శాస్త్రవేత్తలు ఈ ఆస్టరాయిడ్‌లోని కెమికల్ ఎలిమెంట్స్‌ను నిర్థరించడానికి వీలవుతుందని తెలిపింది. 


వచ్చే ఏడాది ప్రయోగించబోతున్న సైక్ స్పేస్‌క్రాఫ్ట్ ఈ సైక్ ఆస్టరాయిడ్‌లో ఐరన్ ఆక్సైడ్స్ ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయనే విషయంపై అధ్యయనం చేస్తుంది. ఐరన్, ఆక్సిజన్‌లతో కలిసి ఐరన్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. అంగారక, బుధ, శుక్ర, భూ గ్రహాల్లో ఐరన్ ఆక్పైడ్స్ ఉన్నాయి. భూమిపై నుంచి జరిపిన పరిశీలనలనుబట్టి ఈ ఆస్టరాయిడ్‌లో దాదాపు 90 శాతం మెటల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎల్కిన్స్-టాంటన్  నేతృత్వంలో జరిగిన పరిశోధనలో సైక్ ఆస్టరాయిడ్‌లో 30 శాతం నుంచి 60 శాతం మెటల్ ఉండవచ్చునని వెల్లడైంది. 


ఎల్కిన్స్-టాంటన్ మాట్లాడుతూ, సైక్ ఆస్టరాయిడ్ గురించి మౌలిక ప్రశ్నలకు సమాధానాలు రావలసి ఉందని చెప్పారు. ప్రస్తుతం భూమిపై నుంచి సేకరించిన సమాచారంతో అర్థవంతమైన వివరణను ఇవ్వడం కష్టమని చెప్పారు. ఈ ఆస్టరాయిడ్‌ను సందర్శించే వరకు మనం ఏమీ చెప్పలేమన్నారు. 


Updated Date - 2021-10-06T23:53:20+05:30 IST