నాసా వ్యోమగాముల అద్భుత విజయం

ABN , First Publish Date - 2021-12-03T19:26:59+05:30 IST

అంతర్జాతీయ రోదసీ కేంద్రంలో దెబ్బతిన్న యాంటెన్నాను

నాసా వ్యోమగాముల అద్భుత విజయం

వాషింగ్టన్ : అంతర్జాతీయ రోదసీ కేంద్రంలో దెబ్బతిన్న యాంటెన్నాను ఇద్దరు నాసా వ్యోమగాములు విజయవంతంగా మార్చారు. ఆరున్నర గంటలపాటు ఈ స్పేస్‌వాక్ జరిగింది. కొద్ది వారాల క్రితం రష్యా క్షిపణి పరీక్ష వల్ల ఏర్పడిన కక్ష్య శిథిలాల కారణంగా కాస్త అధిక నష్టభయం కలగడంతో ఈ యాంటెన్నాను మార్చవలసి వచ్చింది. భూమిపై నుంచి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో థామస్ మార్ష్‌బర్న్, కయ్లా బేరన్ ఈ ప్రక్రియను పూర్తి చేశారని నాసా ప్రకటించింది. 


షెడ్యూలు కన్నా ఒక గంట ముందు ఈస్టర్న్ టైమ్ ప్రకారం ఉదయం 6.15 గంటలకు (1115 జీఎంటీకి) ఈ ప్రక్రియ ప్రారంభమైందని నాసా తెలిపింది. మానవులు రోదసిలోకి పంపిన వస్తువులు శిథిలాలుగా మారి తిరిగి భూమిపైకి వస్తున్నాయి. వీటిని ఆర్బిటాల్ డెబ్రిస్ అంటారు. ఇటువంటి ఆర్బిటాల్ డెబ్రిస్ మళ్ళీ రాబోతోందని హెచ్చరికలు రావడంతో 48 గంటలపాటు ఈ ఎక్స్‌ట్రా వెహికులార్ యాక్టివిటీ (ఈవీఏ) వాయిదా పడింది. రెండు దశాబ్దాలకుపైగా చరిత్రను పరిశీలించినపుడు ఈ విధంగా వాయిదా పడటం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఆర్బిటాల్ డెబ్రిస్‌ ప్రాధాన్యమివ్వదగినది కాదని నాసా తేల్చింది. 


కొత్తగా కనుగొన్న డెబ్రిస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాసా చెప్పలేకపోతోంది. నాసా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, రష్యా గత నెలలో మిసైల్‌తో తుత్తునియలు చేసిన ఉపగ్రహం నుంచి ఈ డెబ్రిస్ వచ్చిందా? అనే విషయంపై ఎటువంటి సంకేతాలు లేవని తెలిపారు. 


మార్ష్‌బర్న్ (61) ఓ మెడికల్ డాక్టర్. ఆయన గతంలో ఫ్లైట్ సర్జన్‌గా పని చేశారు. ఆయన స్పేస్‌వాక్ చేయడం ఇది ఐదోసారి. అమెరికా నావికా దళంలో జలాంతర్గామి అధికారి బారన్ (34) స్పేస్‌వాక్ చేయడం ఇదే మొదటిసారి. 


వీరిద్దరూ కలిసి 20 ఏళ్ళనాటి ఎస్-బ్యాండ్ రేడియో కమ్యూనికేషన్స్ యాంటెన్నా అసెంబ్లీని తొలగించి, మరొకదానిని అమర్చారు. ఈ స్పేస్ స్టేషన్‌లో ఇతర యాంటెన్నా కూడా ఉన్నప్పటికీ, మరొకదానిని అమర్చడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని నాసా తెలిపింది. 


యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జర్మన్ ఆస్ట్రనాట్ మత్తియాస్ మౌరెర్ లోపలి నుంచి అందించిన రోబోటిక్ ఆర్మ్ చివరిలో ఉంటూ మార్ష్‌బర్న్, బారన్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. వీరికి నాసా క్రూమేట్ రాజా చారి సహకరించారు. ఈ నలుగురూ నవంబరు 11న స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. 


Updated Date - 2021-12-03T19:26:59+05:30 IST