Abn logo
Oct 20 2020 @ 04:40AM

విజయదశమికి ‘నర్తనశాల’

Kaakateeya

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం ‘నర్తనశాల’. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత అనివార్య కారణాల వలన చిత్రాన్ని పక్కనపెట్టారు. 17 నిమిషాల గల ఆ సన్నివేశాలను విజయదశమి సందర్భంగా ఈ నెల 24న డిజిటల్‌ తెరలో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ‘‘నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్న (ఎన్టీఆర్‌)గారి ‘నర్తనశాల’. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో తీయాలని మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. విజయదశమి కానుకగా ఎన్‌బికే థియేటర్‌లో శ్రేయాస్‌ ఈటీ ద్వారా వాటిని విడుదల చేస్తున్నాం. వచ్చిన మొత్తంలో కొంత ఛారిటీకి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను’’ అని బాలకృష్ణ తెలిపారు. ఆయన అర్జునుడి పాత్ర పోషించిన ఈ చిత్రంలో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు నటించారు. వీళ్లలో సౌందర్య, శ్రీహరి కన్నుమూసిన సంగతి విదితమే.


ఆ ఆదాయం బసవతారకం ట్రస్ట్‌కు

‘‘ఎన్‌బీకే థియేటర్‌లో ‘నర్తనశాల’ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. శ్రేయాస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని- దానిలో ఉన్న ఎన్‌బీకే థియేటర్‌లో దీనిని చూడవచ్చు. టిక్కెట్టు ఎంత పెట్టాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. మినిమమ్‌ రూ. 50 పెట్టాలనుకుంటున్నాం. టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలకృష్ణ- నందమూరి బసవతారకం ట్రస్ట్‌కు ఇస్తామన్నారు. ఇప్పటికే మా యాప్‌లో ఆర్‌జీవీ, వినాయక్‌, మారుతి, చంద్రసిదార్థలకు థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే శ్రేయాస్‌ యాప్‌లో గోదావరి కథలు, శివనాగేశ్వరావు దర్శకత్వంలోని క్రేజీ అంకుల్స్‌, సంపూర్ణేష్‌ బాబు నటించిన సినిమా విడుదల కాబోతున్నాయి’’ 

శ్రీనివాస్‌, ఛైర్మన్‌, శ్రేయాస్‌ మీడియా



ఏటీటీ ఎలా పనిచేస్తుంది?

ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్‌ మోడల్‌లో పనిచేస్తే- ఏటీటీలో టిక్కెట్టు కొనుక్కొని చూడాల్సి ఉంటుంది. ఏటీటీ ప్లాట్‌ఫాంలో ఒకో దర్శకుడికి.. లేదా సంస్థకు థియేటర్లు ఉంటాయి. ప్రేక్షకులు ఈ థియేటర్‌లో టిక్కెట్టు కొనుక్కొని సినిమాను చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రామ్‌గోపాల్‌వర్మ ఏటీటీ ద్వారా కొన్ని సినిమాలు విడుదల చేశారు.  

Advertisement
Advertisement