నర్సీపట్నం టూ చెన్నై

ABN , First Publish Date - 2021-06-23T07:44:33+05:30 IST

విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జాతీయ రహదారి నుంచే సరుకు తరలిపోతోంది.

నర్సీపట్నం టూ చెన్నై
వివరాలను వెల్లడిస్తున్న ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌

గంజాయి అక్రమ రవాణా

గుట్టురట్టు చేసిన పోలీసులు

రూ.40 లక్షల విలువైన సరుకు పట్టివేత

ఐదుగురు నిందితుల అరెస్టు

లారీ, కారు స్వాధీనం

సూత్రధారి ఎర్రేష్‌ కోసం వేట

వివరాలను  వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ 

ఒంగోలు (క్రైం), జూన్‌ 22 : విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జాతీయ రహదారి నుంచే సరుకు తరలిపోతోంది. అక్రమార్కులు వివిధ ఎత్తుగడలతో తతంగం నడుపుతున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. రూ.40లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక సూత్రధారి ఎర్రేష్‌ కోసం వేట ప్రారంభించారు. వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ మంగళవారం వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎర్ర ఉల్లిపాయల లోడుతో ఉన్న లారీని ఆపారు. డ్రైవర్‌, క్లీనర్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం తో తనిఖీ చేశారు. దీంతో ఉల్లిపాయల కింద 400 కిలోల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వీటి విలువ రూ.40లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. ఈ గంజాయిని తొలుత తిరుపతికి  ఆతర్వాత చెన్నైకు తరలిస్తున్నట్లు చెప్పారు.


తరలింపు ఇలా.. 

స్మగ్లర్ల ముఠా గంజాయి రవాణా చేస్తున్న వాహనానికి ప్రత్యేక కారులో పైలట్‌గా వ్యవహరిస్తారు. ఈ కారు సుమారు 10 కిలోమీటర్ల ముందు వెళుతుంటుంది. మార్గమధ్యంలో పోలీస్‌ తనిఖీలుంటే లారీని దూరంగా నిలిపివేస్తారు. పై లట్‌గా ఉన్న వారు ఎప్పటికప్పుడు లారీ డ్రైవర్‌కు సమాచారాన్ని అందిస్తూ గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. అలాగే సోమవారం పట్టుబడిన లారీ కి కూడా పైలట్‌ వాహనం ఉంది. ఈ విషయా న్ని లారీ డ్రైవర్‌, క్లీనర్‌ చెప్పడంతో పోలీసులు వెం బడించారు. నెల్లూరు జిల్లాలో టోల్‌ ప్లాజా వద్ద ఆ కారును పట్టుకున్నారు. అందులో ఉన్న ముగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 


అరెస్టయిన నిందితులు వీరే.. 

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడికి చెందిన బల్లిజోజి సాయికుమార్‌, దొడ్డవరానికి చెందిన మగపు గంగాధర్‌, గొలిగొండ మండలం కృష్ణదేవరపేటకు మాకిరరెడ్డి అప్పలనాయుడు, పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంనకు చెందిన షేక్‌ మైనుద్దీస్‌, ఉప్పలపాటి అంజి అలియాస్‌ నానిలను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. గంజాయిని తరలిస్తున్న మినీ లారీ, స్విఫ్ట్‌ డిజైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి విశాఖజిల్లా కొయ్యూరు మండలం సవరనపాలెంకు చెందిన దేవరకొండ ఎర్రేష్‌ సూత్రధారిగా గుర్తించామన్నారు. అతనిపై వివిధ ప్రాంతాల్లో ఐదారు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ ప్రత్యేక బృందాన్ని నియమించారని చెప్పారు. అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సింగరాయకొండ సీఐ యు. శ్రీనివాసులు, టంగుటూరు ఎస్సై నాయబ్‌రసూల్‌, కొండపి ఎస్సై రాంబాబు, ఏఎస్సై బివి. సుధాకర్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.వి. కృష్ణారావు, కానిస్టేబుళ్లు రవికుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, కృష్ణారెడ్డి, హోంగార్డు బాలకృష్ణలను అభినందించారు.


Updated Date - 2021-06-23T07:44:33+05:30 IST