నర్సింగాపురం అందరికీ ఆదర్శం

ABN , First Publish Date - 2020-07-03T11:27:56+05:30 IST

హరితహారం, పల్లెవెలుగు కార్యక్రమాల నిర్వహణలో నర్సింగాపురం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్‌ నిఖిల కొనియాడారు.

నర్సింగాపురం అందరికీ ఆదర్శం

కలెక్టర్‌ కె.నిఖిల


కొడకండ్ల జూలై 2 :  హరితహారం, పల్లెవెలుగు కార్యక్రమాల నిర్వహణలో నర్సింగాపురం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్‌ నిఖిల కొనియాడారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం, పాఖాల, రామవరం, మొండ్రాయిలలో గురువారం పర్యటించి, పనులను తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న పనుల ప్రగతి చూసి సంతృప్తి వ్యక్తం చేయటమేకాకుండా నర్సింగాపురం సర్పంచ్‌ శ్రీలతను శాలువాతో సత్కరించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 281 గ్రామాలలో నాటేందుకు 52 లక్షల మొక్కలు అవసరముండగా ఫారెస్ట్‌ నర్సరీలు, గ్రామాల్లోని జీపీ నర్సరీలలో కలిపి 65 లక్షల 92 మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. నర్సింగాపురంలో మొత్తం 8 ఎకరాలలో ఏర్పాటు చేసిన శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్‌యార్డు, అవెన్యూ ప్లాంటేషన్‌, విలేజ్‌ పార్కు, తడిపొడి చెత్తషెడ్‌లు ఏర్పాటు చేయటం, అక్కడి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయటం బాగుందని కలెక్టర్‌ మెచ్చుకున్నారు. 11 గ్రామాల్లో పల్లెవెలుగు పనులు పూర్తయ్యాయని, మిగతా గ్రామాల్లో 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలనీ, ఆరో హరితహారాన్ని జయప్రదం చేయాలని అధికారులను, సర్పంచ్‌లను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మ, డీఆర్డీఏ పీడీ రామిరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి ప్రేమ్‌ కరణ్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్‌, ఎంపీడీవో రమేశ్‌, తహసీల్దార్‌ భూక్యా యాకన్న, జీసీసీ మాజీ చైర్మన్‌ గాంధీనాయక్‌,  ఏఎంసీ చైర్మన్‌ పేరం రాము, ఏపీవో కుమారస్వామి, ఏపీఎం సోమయ్య, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-03T11:27:56+05:30 IST