నర్సమ్మా... నీకు వందనం!

ABN , First Publish Date - 2021-05-12T05:59:50+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది.. ముసలీ ముతక అనే తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తోంది.

నర్సమ్మా... నీకు వందనం!

ఆసుపత్రుల్లో అన్నీ తామైౖ.. రోగులకు సేవలు

వైద్యరంగంలో కీలకమైన నర్సులు

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

 

కడప (సెవెన్‌రోడ్స్‌), మే 11: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది.. ముసలీ ముతక అనే తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  కరోనా వచ్చిన విషయం తెలిసిందంటే ఆ వ్యక్తి దరిదాపులకు కూడా ఎవ్వరూ పోవడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా.. మీకు అండగా మేమున్నాం అంటూ నిరంతరం రోగుల సేవలో తరలిస్తున్నారు. 

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు అంత ముఖ్యమైనవి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం పెదవులపై చిరునవ్వుతో వైద్య సేవలను అందించడం నర్సుకు మాత్రమే సొంతం. 1812 మే 12వ తేదీ ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ గౌరవార్థం ప్రపంచమంతా నర్సుల దినోత్సవాన్ని మే 12న జరుపుకుంటారు. ప్రతి ఇంటిలో తల్లి ఎంత ముఖ్యమో.. వైద్యరంగంలో నర్సులు అంతటి ప్రధాన భూమిక పోషిస్తారు. రోగికి సూదులు వేయడం మొదలుకుని వారికి దుస్తులు మార్చడం, మందులు సమయానికి ఇవ్వడం, ఎలా వాడాలి, ఆహార నియమావళి వివరించడం వరకూ అన్నీ తామే అయి చేస్తుంటారు. ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అలుపెరగక కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా... మీకు అండగా మేమున్నాం అంటూ నిరంతరం రోగుల సేవలో తరలిస్తున్నారు. రోగి ఆవేదనను, బాధను అర్థం చేసుకుంటూ వారికి అవసరమైన విధంగా స్వాంతన చేకూరుస్తూ జబ్బు నయం చేయడంలో నర్సుల పాత్ర అద్వితీయమనే చెప్పాలి. కరోనా సోకిన వారిని అందరూ భయంతో దూరం పెడుతున్న సమయంలో.. మేమున్నామంటూ వారికి చేరువగా ఉండి సేవలు అందిస్తున్న నర్సమ్మా.. నీకు వందనమమ్మా అంటున్నారు అందరూ.


మంచి మాటలతో జబ్బు నయం చేయొచ్చు

-  కేవీ తులశమ్మ (గ్రేడ్‌-2 నర్శింగ్‌ సూపరింటెండెంట్‌)

నర్సుగా నాకు 37 సంవత్సరాల అనుభవం. పేషెంట్లు మమ్మల్ని సొంత అక్కగానో, చెల్లిగానో భావిస్తారు. వారికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలను అందించేవాళ్లం. డిశ్చార్జి చేసి వెళ్లమంటే మా సిస్టర్‌ వస్తుంది, వచ్చాకే వెళ్తాం అనేవాళ్లు రోగులు. మేము వచ్చాక మాకు పండ్లు ఇచ్చి మరీ వెళ్లేవారు. ఉదయం 7గంటలకు వస్తే ఒక్కోసారి రాత్రి 7గంటల వరకు పనిచేసిన సందర్భాలున్నాయి. సూపరింటెండెంట్‌ కంటే నర్సుగానే ఎంతో తృప్తినిస్తుంది. రోగికి ప్రత్యక్షంగా సేవలను అందివ్వడంలో ఉండే తృప్తే వేరు. మందులతో పాటు మంచి మాటలతో రోగికి జబ్బు నయం చేయవచ్చు.


కుటుంబాలను పణంగా పెట్టి సేవలు

- ఏకే పద్మజ, (స్టాఫ్‌ నర్సు)

నర్సుగా 27 సంవత్సరాలుగా సేవలందించడం మనసుకు ఎంతో తృప్తినిస్తుంది. ప్రస్తుతం కొవిడ్‌ సమయంలో విధులను నిర్వహించాలంటే ఎంతో ఆందోళనగా ఉంది. కుటుంబ సభ్యులను కూడా మాతో పాటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఒక్కోసారి పీపీఈ కిట్‌లు చాలా సేపు వేసుకోవడం వల్ల విపరీతమైన చెమటతో నర్సులు డీ హైడ్రేట్‌ అవుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో అనేక మంది నర్శింగ్‌ సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. మేం భయపడితే రోగులకు సేవలందించలేం.


అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతుంటాం

- ఎం.స్వాతి (నర్సు)

నర్సుగా రోగులకు సేవలందించడంలో ఎలాంటి అవరోధాలు వచ్చినా ఇబ్బంది ఉండదు. ఇష్టంగా ఎంచుకున్న వృత్తి కాబట్టి కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. పీపీఈ కిట్‌ ఒకసారి వేసుకుంటే తీసే వరకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కిట్‌ ధరించి ఉంటాం కాబట్టి ఒక్కోసారి నీళ్లు కూడా తాగలేం. డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్దాం అంటే కర్ఫ్యూ కారణంగా ఆటోలు లేక నడవాల్సి వస్తోంది. రోగికి సేవలందించేటప్పుడు వారి ముఖంలో వచ్చే చిరునవ్వుతో ఎంత కష్టమైనా కనిపించదు. రోనికి జబ్బు నయం చేసి ఇంటికి పంపేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. ఒక వ్యక్తిని వారి కుటుంబాల్లోకి ఆరోగ్యంగా పంపుతుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది.



  

Updated Date - 2021-05-12T05:59:50+05:30 IST