Jul 9 2021 @ 00:19AM

నరేష్‌, ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్ల యుద్ధం!

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రేపిన కాక ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ ఎన్నికల కోసం వర్గాలుగా చీలిపోయిన సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘‘మా’ ఎన్నికలు ఎప్పుడు?’ అంటూ తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌తో మళ్లీ విమర్శల తీవ్రత పెరిగింది. ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌కు ‘మా’ అధ్యక్షుడు వీకే నరేశ్‌ బదులిచ్చారు. ‘మా’ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది మీకు ఈ-మెయిల్‌ ద్వారా తెలిపాం. మీరు మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ‘నీళ్లు నింపని స్విమ్మింగ్‌పూల్‌లో దూకుతాను’ అన్నట్టు ఉంది మీ వ్యవహారం’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌కు ఇంతకు ముందు ‘మా’ పంపిన కాపీని ఈ ట్వీట్‌లో జత చేశారు. అయితే 2019లో జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌లో 2021 మార్చికి బదులుగా సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ చేసిన తీర్మానం చెల్లదని న్యాయనిపుణులు పేర్కొనడం గమనార్హం.