ఇదీ, మోదీ నోట మనం వినాల్సిన మాట!

ABN , First Publish Date - 2022-08-20T06:08:58+05:30 IST

డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన మాతృభూమి స్వేచ్ఛా జగత్తులో మేల్కొంది. నవ జీవనంలోకి ప్రవేశించింది.

ఇదీ, మోదీ నోట మనం వినాల్సిన మాట!

సోదరులారా, సోదరీ మణులారా!

డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన మాతృభూమి స్వేచ్ఛా జగత్తులో మేల్కొంది. నవ జీవనంలోకి ప్రవేశించింది. ఆ శుభ వేళ భారత్ ‘భవిష్యత్తును ఆవాహన’ చేసుకున్నదని మన ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. మన రాజ్యాంగాన్ని సంరక్షించి, సమున్నతం చేసేందుకు, మన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, మన ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథాన సుస్థిరంగా ముందుకు సాగేందుకు, మన ప్రజలకు ఆరోగ్య భద్రత, విద్యా సదుపాయాలు, ఉద్యోగాలు, జీవన భద్రత సమకూర్చేందుకు స్వతంత్ర భారతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ తమ శాయశక్తులా కృషి చేశాయి. ఈ విధ్యుక్త ధర్మనిర్వహణలో దారితప్పక పోలేదు, వైఫల్యాలు సంభవించాయి. అయినా తప్పులు చేసి పడిపోయినప్పుడు మనకు మనమే లేచి మన ప్రస్థానాన్ని ఉత్సాహంగా, ఉత్తేజపూరితంగా కొనసాగించాము.


ప్రజాస్వామ్యం మన తప్పులు, పొరపాట్లను సరిదిద్దింది. వైఫల్యాలను అధిగమించేందుకు సహాయపడింది. ఆ కారణంగానే ప్రజాస్వామ్య పథంలో స్థిరంగా ఉంటామనే వాగ్దానాన్ని ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం పునరుద్ఘాటిస్తున్నాం.


ఈ చరిత్రాత్మక ఎర్రకోట బురుజు నుంచి నేను మీతో ఎనిమిదిసార్లు మాట్లాడాను. దేశ ప్రధానమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా మీతో మాట్లాడాను. నేడు ఒక భిన్న వైఖరి, విభిన్న స్వరంతో మాట్లాడదలుచుకున్నాను ఒక ప్రభుత్వాధినేతగా మాట్లాడుతూ, అదే సమయంలో మీ బాధలు, ఆందోళనలు, ఆశలు, ఆకాంక్షలను పంచుకుంటున్న, అర్థం చేసుకున్న ఒక సహ పౌరుడుగా కూడా మీతో సంభాషించాలని కోరుకొంటున్నాను. కొన్ని సత్యాలు వెల్లడించదలిచాను. అవి బాధాకరమైనవి. కనుక ఓర్పుతో వినాలి. సహనం చూపాలి.


గత ఎనిమిది సంవత్సరాలలో నా ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అవి ఆటంకాలుగా పరిణమించాయి. మొదటి తప్పు పెద్ద నోట్ల రద్దు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తే నల్ల ధనం సమస్య సమసిపోతుందని, అవినీతి తగ్గుతుందని, ఉగ్రవాద భూతానికి మంగళం పాడవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారులు నాకు సలహా ఇచ్చారు. అది సరికాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన హెచ్చరికను నేను ఉపేక్షించాను. నోట్ల రద్దు లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. అందుకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుదలకు తీరని దెబ్బ తగిలింది; లక్షలాది ఉద్యోగాలను కోల్పోయాము; అన్నిటికంటే ముఖ్యంగా వేలాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి.


వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా నా ప్రభుత్వం మరో ఘోర తప్పిదం చేసింది. వాటి రూపకల్పన సవ్యంగా జరగలేదు. పైగా ఆ చట్టాలను పార్లమెంటులో హడావిడిగా ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. జీఎస్టీ విషయంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ప్రతిపక్ష నాయకుల సలహాలను అంగీకరించి ఉండవల్సింది. ఒకే రేటు జీఎస్టీని విధించి ఉండవల్సింది. అయితే అలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో జీఎస్టీని నిర్దేశించాము. ఇది, కేంద్రం–రాష్ట్రాల మధ్య అపనమ్మకాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిరసన తెలిపాయి. కొత్త పన్ను అమలులోకి రాకుండా ప్రతిఘటించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం ఆవరించింది. పులి మీద స్వారీ చేస్తున్నాననే వాస్తవాన్ని గుర్తించాను. దిగలేకపోయాను. ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రతిపక్ష నాయకులను సంప్రదించి ప్రస్తుత జీఎస్టీ స్థానంలో కొత్త జీఎస్టీని ప్రవేశపెట్టాలని సంకల్పించుకున్నాను.


ఇంకా కొన్ని ఇతర తప్పులూ చేశాను. అయితే ప్రజల ప్రతిఘటనతో వెనక్కి తగ్గాను. ఆ పొరపాట్లను సరిదిద్దుకున్నాను. కొత్త భూ సేకరణ చట్టాన్ని అస్పష్టం చేసి, దారి మళ్లించేందుకు ప్రయత్నించాము. అయితే అలా చేయడం సహేతుకం కాదని సకాలంలో గుర్తించి ఆ ప్రయత్నాలను త్యజించాం. అదే విధంగా మూడు కొత్త సాగు చట్టాలు ప్రాథమికంగా లోపభూయిష్టమైనవని గుర్తించాము. అంతిమంగా వాటిని రద్దు చేశాం. ఇందుకు నేను సంతోషిస్తున్నాను. మరి కొన్ని ఇతర తప్పులు ఉన్నాయి. అవి మందు పాతరల వంటివి. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్), పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. దేశ ప్రజలలో చీలికలకు, సంఘర్షణలకు కారణమైన ఈ తప్పులను సత్వరమే సరిదిద్దుకుంటామని మీకు నేను హామీ ఇస్తున్నాను.


నా సహచర పౌరులారా! ఆరాధనా స్థలాల చట్టం పరిధిని పరిమితం చేసేందుకు, ఉమ్మడి పౌర స్మృతి ప్రవేశపెట్టేందుకు కొన్ని వర్గాల నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గనని హామీ ఇస్తున్నాను. పార్లమెంటు, శాసనసభలలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటులో పునః ప్రవేశపెడతానని వాగ్దానం చేస్తున్నాను. అలాగే జీఎస్టీ రేట్లు, పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు, వంట గ్యాస్ ధర తగ్గింపునకు ఆదేశాలు జారీ చేస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను.


గతంలో నేనూ, నా మంత్రులు వివిధ సందర్భాలలో వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించాము. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని పలు చర్యలు చేపట్టనున్నట్టు కూడా వెల్లడించాం. ప్రతి పౌరుని బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని నేను వాగ్దానం చేశాను. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కూడా నేను హామీ ఇచ్చాను. ఇవన్నీ జుమ్లాలు. అవును ఎన్నికల సందర్భంలో చేసిన తప్పుడు హామీలు. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా 2017లో ఇదే చోటు నుంచి ప్రసంగిస్తూ హామీ ఇచ్చాను. అలాగే ప్రతి కుటుంబానికి గృహ వసతి సమకూరుస్తామని కూడా చెప్పాను. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల (1 ట్రిలియన్ = లక్ష కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి పరుస్తామని కూడా మీకు భరోసా ఇచ్చాను.


ఈ హామీలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు మా కృషి ఇప్పటికీ కొనసాగుతోంది. బహిరంగ మల విసర్జన జరగని ప్రదేశంగా భారత్‌ను రూపొందిస్తామని, ప్రతి గృహానికీ విద్యుత్ సదుపాయం సమకూరుస్తామని కూడా నేను చెప్పాను. అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం గ్రామీణ కుటుంబాలలో 25.9 శాతానికి, పట్టణ ప్రాంతాల కుటుంబాలలో 6 శాతానికి సొంత టాయ్‌లెట్ సదుపాయం లేదని వెల్లడయింది. అన్ని రాష్ట్రాలలోనూ బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉందని ఆ సర్వే నిర్ధారించింది. 2020 సంవత్సరంలో స్మార్ట్ పవర్ ఇండియా, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దేశ జనాభాలో 13 శాతం మంది విద్యుత్ గ్రిడ్‌కు సంధానమై లేకపోవడమో లేక అసలు విద్యుత్‌ను వినియోగించుకోక పోవడమో జరుగుతుందని వెల్లడయింది. ముఖ్యమంత్రులను సంప్రదించి ప్రతి కుటుంబానికి విద్యుత్ సదుపాయం సమకూర్చేందుకు నిర్దిష్ట గడువు తేదీలను ప్రకటిస్తామని వాగ్దానం చేస్తున్నాను.


దేశ ప్రజలలో మతపరమైన విభేదాలు, చీలికలు అంతకంతకూ పెరిగిపోవడం పట్ల నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. సకల ప్రజలు సమైక్యంగా ఉండని పక్షంలో ఏ దేశమైనా ఎలా పురోగమిస్తుంది? ముఖ్యంగా మన సమాజంలో మహిళలు, దళితులు, ముస్లింలు, గిరిజనులు భద్రతా భావంతో మనుగడ సాగిస్తూ అభివృద్ధి ఫలాలను అందుకున్నప్పుడు మాత్రమే మన దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించగలదు. మన సమాజంలోని వివిధ వర్గాల పట్ల మా పార్టీ తన దురభిప్రాయాలను త్యజించవలసి ఉందనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టేందుకు నా ప్రభుత్వం మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అలాగే విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులను శిక్షించి, భారతీయ సమాజ వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని సంరక్షించేందుకు, సకల సామాజిక వర్గాల వారికి మరింత ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వ, రాజ్యాంగ సంస్థలను సమ్మిళితంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన చర్యలను నా ప్రభుత్వం చేపట్టవలసి ఉందని కూడా అంగీకరిస్తున్నాను.


సోదరులారా, సోదరీ మణులారా! మన ప్రస్థానం చాలా సుదీర్ఝమైనది. ఈ మహోన్నత దేశానికి, సమస్త భారతీయులకూ సేవ చేసేందుకు అంకితమవుతానని వాగ్దానం చేస్తున్నాను. ఈ చరిత్రాత్మక ప్రస్థానంలో మీరు నా సహ యాత్రికులు కావాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జైహింద్!



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-08-20T06:08:58+05:30 IST