చైనా దూకుడుకు అడ్డుకట్ట ఎలా?

ABN , First Publish Date - 2022-07-30T08:00:38+05:30 IST

మొన్న26వ తేదీన, దేశం కార్గిల్ దివస్ జరుపుకుంది. యుద్ధవీరులను, దేశంకోసం పోరాడి ప్రాణాలు అర్పించినవారినీ స్మరించుకోవడం, వారికి ఘననివాళులు అర్పించడం ధర్మం.

చైనా దూకుడుకు అడ్డుకట్ట ఎలా?

మొన్న26వ తేదీన, దేశం కార్గిల్ దివస్ జరుపుకుంది. యుద్ధవీరులను, దేశంకోసం పోరాడి ప్రాణాలు అర్పించినవారినీ స్మరించుకోవడం, వారికి ఘననివాళులు అర్పించడం ధర్మం. మూడునెలలు సాగిన ఈ యుద్ధంలో, 527మంది సైనికులు మరణించారు, 1363మంది గాయపడ్డారు. దేశ సరిహద్దులను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఈ రూపంలో కోల్పోయింది తక్కువేమీ కాదు. భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది.


యాభైయేళ్ళక్రితం బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కూడా మనం ఘనవిజయం సాధించాం. భారత రక్షణదళాలు ఒకేమారు దేశం రెండువైపులా ఉండి యుద్ధం చేయవలసివచ్చింది. ముక్తిబాహినికి సాయపడుతూ, తూర్పుపాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌గా అవతరించేట్టు చేయడంలో మన సైనికులు తూర్పుదిక్కున నిమగ్నమైనారు. అదేసమయంలో, పశ్చిమాన భారత వైమానికస్థావరాలమీద పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టే పనిలో ఉన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు భారతదేశం పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో మూడువేలమంది సైనికులు మరణించారనీ, పన్నెండువేలమంది గాయపడ్డారనీ ప్రకటించింది. భారతదేశానికి పాకిస్థాన్ బేషరతుగా లొంగిపోతూ సంతకం చేసింది. మనదేశం సాధించిన మహాన్నత విజయం అది.


ఈ రెండు యుద్ధాలు కూడా పాకిస్థాన్ తోనే. వీటికి ముందు రెండుసార్లు, అంటే 1947లోనూ, 1965లోనూ కూడా ఆ దేశం మనతో దెబ్బలు తిన్నది. 1971లో అయితే దానిది చావుతప్పి జీవచ్ఛవంలాగా మిగిలిన స్థితి. అయినప్పటికీ, 1999లో కార్గిల్‌లో చొరబడటానికి ప్రయత్నించింది. ఇలా పలుమార్లు దెబ్బతింటున్నప్పటికీ, దాని చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు దేశాలూ స్వాతంత్ర్యం సాధించుకొని డెబ్బై ఐదేళ్ళయింది. పాకిస్థాన్ ఇప్పటికీ మనతో సయోధ్యకు సిద్ధంగా లేదు. యుద్ధాల్లో భారతదేశాన్ని గెలవలేమన్న నిజం దానికి తెలుసు. అది ఎప్పటికీ అలాగే వ్యవహరిస్తూ ఉంటుందనీ, అటువంటి పొరుగుదేశంతో మనం కొనసాగక తప్పదనీ భారతీయులకు తెలుసు.


మనకు అసలు సమస్య చైనా. పాకిస్థాన్ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ, తమది చప్పన్నారు ఇంచీల ఛాతి అని చెప్పుంటూ, జబ్బలు చరుచుకొనే బీజేపీ ప్రభుత్వం చైనా చొరబాట్లను, ఆక్రమణలను ఎలా అడ్డుకోవాలో, ఎలా నిలువరించాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.


తమిళనాడు మహాబలిపురంలో 2019 అక్టోబరులో చైనా అధ్యక్షుడితో కలసి ఉయ్యాలలూగినప్పుడు ఆయన మనసులో ఉన్నదేమిటో మోదీ సరిగా పసిగట్టలేకపోయారు. చైనా అధ్యక్షుడితో ఈ ముచ్చట్లు సాగుతున్నప్పుడే, మరొకవైపు చైనా సైనికులు మనదేశంలోకి చొరబడ్డారు. భారత్ అధీనంలో ఉన్న భూభాగాలను ఎలా వశం చేసుకోవాలన్న వ్యూహాలు సిద్ధమైనాయి. చైనా అధినేత మనదేశం నుంచి తిరిగి వెళ్ళిన నాలుగునెలల్లోనే, అంటే 2020 జనవరిలో సైనిక చొరబాటుకు ఆదేశించారు. తదనుగుణంగా, పీఎల్ఏ దళాలు మార్చి, ఏప్రిల్ మాసాల్లో మన భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. భారతదేశం మే తొలివారంలో కానీ జరిగినదేమిటో తెలుసుకోలేకపోయింది. జూన్ 15న చొరబాటుదారులను తిప్పి పంపించేందుకు,  ఆ ప్రాంతాలను ఖాళీచేయించేందుకు చేసిన ప్రయత్నంలో 20 మంది యోధులను మనదేశం కోల్పోవలసి వచ్చింది. సైనికులు కన్నుమూసి, దేశం యావత్తూ ఉడికిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ జూన్ 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన ‘భారత భూభాగంలోకి బయటివ్యక్తులు ఎవరూ చొరబడలేదు. ఒక్క విదేశీవ్యక్తి కూడా మన భూభాగంలో లేడు’ అంటూ ఓ వ్యాఖ్య చేశారు. నిజమేనా? మన మిలటరీ నిపుణుల, అధికారుల అంచనాల ప్రకారం మనదేశం కనీసం వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగం ఈ దురాక్రమణలో కోల్పోయింది. అప్పటివరకూ మన నియంత్రణలో, మన గస్తీలో ఉన్న ప్రాంతమిది. ఆ తరువాత ఉభయదేశాల మధ్యా పదహారు విడతల చర్చలు జరిగాయి. ఒక్క విదేశీ శక్తి కూడా మన భూభాగంలోకి చొరబడనప్పుడు మన సైనికులు 20మంది ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది? అసలు భూభాగమే దురాక్రమణకు గురికాకపోతే ఉభయదేశాల మిలటరీ కమాండర్లూ ఇన్ని విడతల చర్చల్లో ఏ విషయం ముచ్చటించుకున్నట్టు? ఉపసంహరణ, చర్చల కొనసాగింపు ఇత్యాది పదాలు మన విదేశాంగమంత్రిత్వశాఖ నోటినుంచి తరచుగా ఎందుకు వినబడుతున్నట్టు? యథాతథస్థితిని పునరుద్ధరించాలన్న డిమాండ్ మన విదేశాంగమంత్రి నోట అన్నిసార్లు ఎందుకు వచ్చింది?


కఠినమైన నిజాలు కొన్ని ఒప్పుకోక తప్పదు. మొత్తం గాల్వాన్ లోయ అంతా తనదేనని చైనా అంటున్నది. ఫింగర్ నాలుగు, ఫింగర్ ఎనిమిది మధ్యభాగం 2020 మే నెల వరకూ మన అధీనంలో, మన పర్యవేక్షణలోనే ఉంది. వాస్తవాధీనరేఖ ఫింగర్ ఎనిమిది కాక, ఫింగర్ నాలుగునుంచి పోతున్నదని చైనా ఇప్పుడు దబాయిస్తోంది. దెమ్చోక్, డెప్సాంగ్ వంటి ప్రాంతాలమీద మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. ఆక్సాయ్ చిన్‌లోనూ, మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దుగుండా చైనా సైనికపరమైన భారీనిర్మాణాలు చేస్తున్నది. కొత్త బ్రిడ్జీలు కడుతోంది, కొత్తగా గ్రామాలు నిర్మించి తన ప్రజలను స్థిరపరుస్తోంది, సరిహద్దుల్లోకి మిలటరీ సామగ్రిని, సైనికులను తరలిస్తోంది.


చైనా విషయంలో మోదీ ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధానం లేదు. మాజీ విదేశాంగశాఖ కార్యదర్శి శ్యామ్ సరన్ ఇటీవల భారతదేశాన్ని, మిగతా ప్రపంచాన్ని చైనా ఏ విధంగా చూస్తోందన్న అంశంపై ఓ పుస్తకం రాశారు. ‘యావత్తు ఆసియా తన ఆధిపత్యంలో, తన గుప్పిట్లో ఉండగా, అందులో భారతదేశం తన అడుగులకు మడుగులొత్తుతూ విధేయతతో జీవించాలని చైనా కోరుకుంటోంది. తనమీదా, మిగతా ప్రపంచం మీద చైనా పెత్తనానికి వీల్లేకుండా దానిని నిలువరించాలని భారతదేశం ప్రయత్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు ఆయన. ఇది ముమ్మాటికీ నిజం. అయితే, చైనా ఎందుకు ఇంతటి దాష్టీకాన్ని ప్రదర్శించగలుగుతున్నదో కూడా ఆయన చెప్పారు. భారత్, చైనాల మధ్య సైనికపరంగా, ఆర్థికంగా ఉన్న తేడా వల్ల బలం చైనావైపే ఉన్నదని సారాంశం. 2021లో చైనా జీడీపీ 16,863 బిలియన్ డాలర్లు కాగా, భారత్ జీడీపీ 2,946 బిలియన్ డాలర్లు.


దేశరక్షణకు సంబంధించిన అంశంలో భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, విపక్షాలు ప్రభుత్వం వైపే నిలుస్తూ వచ్చాయి. సంక్షోభస్థితిలో ప్రజలూ, పార్టీలూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. కానీ, నిర్దిష్టమైన విధానమంటూ లేనప్పుడు ఈ మద్దతు వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. మోదీ ప్రభుత్వం విపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకొని, చర్చోపచర్చలతో చైనా విషయంలో ఒక సమగ్రవిధానాన్ని రూపొందించినప్పుడే ఫలితం ఉంటుంది. లేనిపక్షంలో చైనాతో చర్చలు ఎన్ని విడతలు జరిగాయో లెక్కచూసుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-07-30T08:00:38+05:30 IST