పురస్కారాలు–తిరస్కారాలు

ABN , First Publish Date - 2022-01-28T06:15:59+05:30 IST

ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులూ రివార్డులూ ప్రజల ప్రశంసలతోపాటు విమర్శలకూ గురికాక తప్పదు. మరీ ముఖ్యంగా ఎన్నికల కాలంలో అయితే పాలకుల ఔదార్యాన్ని వేయికళ్ళు గమనిస్తుంటాయి. ఇటీవల ప్రకటించిన....

పురస్కారాలు–తిరస్కారాలు

ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులూ రివార్డులూ ప్రజల ప్రశంసలతోపాటు విమర్శలకూ గురికాక తప్పదు. మరీ ముఖ్యంగా ఎన్నికల కాలంలో అయితే పాలకుల ఔదార్యాన్ని వేయికళ్ళు గమనిస్తుంటాయి. ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాలమీద ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది. గతంలో మాదిరిగా కాకుండా, నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత పురస్కార గ్రహీతల విస్తృతిలోనూ ఎంపికలోనూ విస్పష్టమైన మార్పువచ్చిందనీ, మట్టిలో మాణిక్యాలను గౌరవించడం జరుగుతోందనీ అంటారు. నిజం ఉండవచ్చును కానీ, పద్మాల ఎంపికలో రాజకీయవాసనలు పూర్తిగా చెరిగిపోయాయని మాత్రం అనలేం.


గత ఏడాది పురస్కారాల్లో దాదాపు మూడోవంతు ఎన్నికలకు పోబోతున్న తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలకు తరలిపోయాయనీ, మరీముఖ్యంగా తమిళనాడుకు పెద్ద సంఖ్యలో దక్కడం వెనుక బీజేపీ రాజకీయ లక్ష్యాలున్నాయని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఈ విమర్శలూ, విశ్లేషణలూ తప్పవు. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం వీటిలో ఒకటి. రామమందిర నిర్మాణానికి మూడుదశాబ్దాల క్రితమే దారులు పరిచిన నాయకుడిగా బీజేపీ నాయకులు ఆయనను ఇప్పుడు కీర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ పోలీసుల చేతులు కట్టేసి కరసేవకులు మసీదును కూల్చేట్టుగా చేసిన కల్యాణ్ సింగ్‌కు  ఇంతటి ఉన్నత పురస్కారం ఇవ్వడమేమిటని విపక్షనేతలు విమర్శిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ దివంగత నేతను ఘనంగా సన్మానించుకోవడం రాజకీయంగా ఉపకరిస్తుంది.


కల్యాణ్ సింగ్ కరడుగట్టిన హిందూత్వకు ప్రతీక కావడంతోపాటు, వెనుకబడిన లోథ్ కులానికి చెందినవారు కూడా. యాదవులు, కుర్మీల తరువాతి స్థానంలో నాలుగుశాతంగా ఉన్న లోధ్ కులస్థులు నలభై నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించగలరట. కీలకమైన ఓబీసీ నాయకులు సమాజ్ వాదీ పార్టీవైపు తరలిపోతున్న తరుణంలో, మొన్న ఆగస్టులో కన్నుమూసిన కల్యాణ్ సింగ్‌ను ఇలా గౌరవించడం ద్వారా ఓబీసీలనూ, హిందూత్వశక్తులను ఒకేమారు ఆకర్షించవచ్చునని బీజేపీ ఉద్దేశం కావచ్చు. ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఒక్కటే పదమూడు పద్మాలు అందుకుంది.


ప్రతీదీ రాజకీయకోణంలో చూడటం సరికాదని బీజేపీ పెద్దలు ఎంత హితవుచెబుతున్నా, గులామ్ నబీ అజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆజాద్‌ను అభినందిస్తూ రాజ్యసభలో మోదీ కన్నీళ్ళు తుడుచుకున్నప్పటినుంచీ కశ్మీర్ వ్యవహారాన్ని కొలిక్కితేవడానికీ, కమలం ప్రయోజనాలకు దారులు పరవడానికీ ఆజాద్‌ను ప్రయోగించబోతున్నారన్న వాదన వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సోనియా అవిధేయ గ్రూప్ 23 నాయకుడు పద్మ పురస్కారానికి తలవంచడం, బెంగాల్ బుద్ధదేవుడిలాగా వద్దనకపోవడం కొంతమందికి నచ్చలేదు.


బెంగాల్ మాజీ సీంఎ మంచిపనిచేశారు, ఆయన గులామ్ (బానిస)గా కాదు, ఆజాద్ (స్వతంత్రం)గా ఉండాలనుకున్నారు అంటూ గులామ్ నబీని గురిపెడుతూ జై రామ్ రమేష్ చేసిన ట్వీట్, దానిపై మిగతావారి విమర్శలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరోమారు తెరమీదకు తెచ్చాయి. ఇక, పార్టీ విధానమంటూ బుద్ధదేవ్ అవార్డు వద్దంటే, మరో ఇద్దరు బెంగాలీ కళాకారులు తాము దశాబ్దాల క్రితమే పద్మశ్రీ దశ దాటేశామంటూ దానిని సున్నితంగా తిరస్కరించారు. దశాబ్దాలక్రితమే పద్మశ్రీ దక్కాల్సిన అర్హతలు సాధించినవారికి ఇప్పుడు దానిని ఇవ్వజూపడం కంటే పైస్థాయి పురస్కారంతో గౌరవించుకోవడం సముచితంగా ఉంటుంది. సీనియర్ నటి షావుకారు జానకి విషయంలో కూడా చాలామందికి ఇదే భావన కలిగింది.


ఇతరపార్టీ నేతలకు అవార్డులు ప్రకటించడం ఇదే ప్రథమం కాదనీ, పౌరపురస్కారాల స్ఫూర్తిని గౌరవించాలని తెలిసినప్పటికీ, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారికి పురస్కారాలు ఇవ్వజూపితే విమర్శలూ, విపరీత వ్యాఖ్యలు తప్పవు. కొంత రాజకీయవాసన పక్కనబెడితే, అనేకమంది మట్టిలో మాణిక్యాలను వెలికితీసినందుకు, పలువురు ప్రజాకళాకారులకు గౌరవించినందుకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే.

Updated Date - 2022-01-28T06:15:59+05:30 IST