చిదంబరం ఆక్షేపణ అసంబద్ధం

ABN , First Publish Date - 2022-02-08T06:44:51+05:30 IST

మహాభారతంలో అర్జునుడి దృష్టి పూర్తిగా పక్షి కన్నుపై కేంద్రీకృతం అయినట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి పూర్తిగా అభివృద్ధిపై కేంద్రీకృతమయి ఉన్నది.

చిదంబరం ఆక్షేపణ అసంబద్ధం

మహాభారతంలో అర్జునుడి దృష్టి పూర్తిగా పక్షి కన్నుపై కేంద్రీకృతం అయినట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి పూర్తిగా అభివృద్ధిపై కేంద్రీకృతమయి ఉన్నది. 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను బట్టే ఆ విషయం స్పష్టమవుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాయిలాలు ప్రకటించడం, వివిధ వర్గాలకు ఇష్టారాజ్యంగా డబ్బుల్ని పంచిపెట్టడం ప్రధానమంత్రి తత్వం కాదని గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లను బట్టి అర్థమయి ఉండాలి. ఆయన ఎప్పుడు మాట్లాడినా భారత్ భవిష్యత్ గురించి మాట్లాడతారు. దీర్ఘకాలిక దృష్టితో పథకాలు రూపొందిస్తారు. మరో పాతిక సంవత్సరాల్లో భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ప్రపంచం నివ్వెరబోయే విధంగా అభివృద్ధి సాధించిందని అనుకోవడానికి ప్రాతిపదికగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు మోదీయే ప్రకటించారు. 


దేశ అభివృద్ధికి ప్రాతిపదిక ఏమిటి? దేశంలో మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయిలో ఏర్పడడం, అందరికీ చేతినిండా పని లభించడం, నిరంతరం నిర్మాణాత్మకమైన పనులు అమలు జరుగుతుండడం. ఈ ఆలోచనతోనే గత ఏడాదితో పోలిస్తే మౌలిక సదుపాయాల కల్పనకు 35 శాతం అదనంగా నిధులు కేటాయించి రూ. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. దీని వల్ల రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, రేవులు, భవంతులు, అనేక ప్రాజెక్టులు, రవాణా సౌకర్యాల కల్పన, నిర్మాణ కార్యక్రమాలు అమలు జరుగుతూనే ఉంటాయి. దేశంలో సరుకుల రవాణా అత్యంత వేగవంతంగా జరిగి వేల కోట్ల ధనం ఆదా అవుతుంది. సకాలంలో ముఖ్యమైన ప్రాజెక్టుల అమలుకు వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య సమన్వయం ఏర్పడుతుంది. డిజిటల్ టెక్నాలజీ, జిఐఎస్ ఈ–గతి శక్తికి వెన్నెముకగా పనిచేస్తాయి. రైలు అనుసంధానంలో భాగంగా 100 ప్రధానమంత్రి గతి శక్తి కార్గో టర్మినల్స్, 25వేల కి.మీ మేరకు జాతీయ రహదారులు నిర్మాణమవుతాయి. గత ఐదేళ్లలో సాధించినదానికంటే ఇది రెట్టింపు. రైల్వే, రహదారులకు 50 శాతం అదనంగా నిధులు కల్పించగా, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, గృహ నిర్మాణానికి, రేవులకు 20 శాతం అదనపు నిధులు కల్పించారు. 2020–25 వరకు జాతీయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.111 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఏడాదికి 20-.22 లక్షల మేరకు పెట్టుబడులు పెడుతున్నారన్న మాట. దేశంలో మొత్తం మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో 45 శాతం కేంద్రమే ఖర్చుపెడుతోంది. కేంద్రం తనకు తాను మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు, నీటిపారుదల ప్రాజెక్టులకు, ఆరోగ్యం, విద్యా రంగాలకు ఖర్చు పెట్టేందుకు ఈ బడ్జెట్‌లో రూ. లక్ష కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.85వేల కోట్లు పెరిగింది. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు, 50 సంవత్సరాల్లో చెల్లించే విధంగా వడ్డీ లేని రుణాల రూపంలో కేటాయిస్తారు.


ఇవన్నీ అమలు చేస్తామన్న ఆత్మవిశ్వాసం ఉన్నందుకే వృద్ధి రేటు 9.2 శాతానికి చేరుకోగలదని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే ఇది ఎంతో దూరదృష్టితో ఆలోచించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడానికై మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఖర్చుపెట్టడంపై మోదీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియీవా ప్రశంసించారు. భారతదేశంలో అభివృద్ధి ఉధృతంగా సాగుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఆమె అన్నారు.


దేశంలో బహుముఖంగా, బహు రంగాలలో, బహు వర్గాలకోసం అభివృద్ధి చేపట్టాలనే లక్ష్యంతోనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు. మహిళలు, యువతకు అవకాశాలు కల్పించడం కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న బడ్జెట్ ఇది. దేశంలో సేవల రంగానికి బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాముఖ్యతను చూస్తే అనేకమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయనడంలో సందేహం లేదు. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి కోసం, ఉత్పాదకతను పెంచేందుకు ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టారు. దీనివల్ల 14 రంగాల్లో 60 లక్షలమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. ఎంఎస్ఎం ఉపాధి కల్పనకు జాతీయ కెరీర్ సేవలు, అసంఘటిత వర్గాలకు ఈ–శ్రమ్, మెరుగైన ఉపాధి కల్పనకోసం నైపుణ్యం గల వారిని గుర్తించేందుకు యజమానులు-–ఉద్యోగులకోసం మ్యాపింగ్, స్టార్టప్‌ల కోసం పన్ను రాయితీలు, వ్యవసాయ రంగంలో ద్రోణుల వంటి వినూత్న ప్రయోగాలు, నాబార్డ్ ద్వారా వ్యవసాయ రంగంలో స్టార్ట్ అప్‌లకు ప్రోత్సాహం, మహిళా స్వయం సహాయ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మిషన్ శక్తి వంటి నిర్ణయాలు బడ్జెట్‌లో అనేకం ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు రూ. 2 లక్షల 37 వేల కోట్లు కేటాయించారు.


స్వాతంత్ర్య సాధన తర్వాత వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపు పేదరికం నుంచి పూర్తిగా విముక్తి అయి ప్రపంచంలో అగ్రదేశాల జాబితాలో చేరాలన్నదే మోదీ ప్రభుత్వ ఆశయం. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా కుదుపు కుదిపి గ్రామాల నుంచి రాజధానుల వరకు అభివృద్ధిని విస్తృతం చేసేందుకు రూపొందించిన ఈ బడ్జెట్‌ను పెట్టుబడిదారీ వర్గాల బడ్జెట్‌గా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. నిజానికి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే స్వదేశీ కంపెనీలకు ఆదాయపు పన్ను రేటు తగ్గించారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను నుంచి కంపెనీలకు అయిదేళ్ల పాటు ఊరట కల్పించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆయన కాలంలోనే తీవ్రస్థాయికి చేరుకుంది, విదేశీ పెట్టుబడుల పరిమితిని కూడా చిదంబరమే పెంచారు. కస్టమ్స్ డ్యూటీలను తగ్గించారు. ఆదాయపన్ను, సంపదపన్ను, ఫెరా చట్టాల నుంచి సంపన్న వర్గాలను కాపాడేందుకు స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. ఎవరిది పెట్టుబడిదారీ వర్గాల బడ్జెట్? చిదంబరందా, నిర్మలా సీతారామన్‌దా?


అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ద్వారా ఆధునిక భారత్‌ను నిర్మించడంతో పాటు పేదలు, మధ్యతరగతి వర్గాలు, యువకులకు అభివృద్ధి ఫలాలు చేరేందుకు, ప్రతి పేద కుటుంబానికీ పక్కా ఇల్లు, నల్లా నీరు, శౌచాలయం, గ్యాస్ సౌకర్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు, ఆర్థిక వ్యవస్థ ఆత్మనిర్భరంగా మారేందుకు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు, వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాలకు అది కార్పొరేట్ బడ్జెట్‌గా కనిపించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం. 7–8 సంవత్సరాల క్రితం భారతదేశంలో జీడీపీ రూ.110 లక్షల కోట్లు. ఇవాళ అది రూ. 230 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే నిరంతరం ఆర్థిక వ్యవస్థ విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లా కాదా? మిథ్యాప్రపంచంలో బతుకుతూ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలతో ప్రజలను మోసగించే అలవాటు ఉన్న రాజకీయ పార్టీల నుంచి అర్థవంతమైన విమర్శలను ఆశించలేము.



వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-02-08T06:44:51+05:30 IST