ధూళిపాళ్లకు ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-06T08:59:11+05:30 IST

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ఏసీబీ దర్యాప్తు అధికారిని, రాజమహేంద్రవరం సెంట్రల్‌

ధూళిపాళ్లకు ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు

కరోనా అని తేలితే అక్కడే ఉంచి చికిత్స

అధికారులకు హైకోర్టు ఆదేశం

తన ఆదేశాలను అమలుచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను  ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ఏసీబీ దర్యాప్తు అధికారిని, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. పరీక్షల్లో వారికి కొవిడ్‌ సోకిందని తేలితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పిటిషనర్ల బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరపడానికి హైకోర్టులో ఉన్న క్వాష్‌ పిటిషన్‌ అడ్డంకి కాదని స్పష్టంచేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.రఘునంధనరావు బుధవారం ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ 22న ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతిస్తూ....పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగా లబ్ధి పొందారో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇటీవల ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. 


ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. ఏసీబీ న్యాయవాది గాయత్రీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలి. విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేయాలి’’ అని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్‌ స్పందిస్తూ ‘‘రాజమహేంద్రవరం జైలులో ఉన్న గోపాలకృష్ణ ఇప్పటికే కరోనా బారినపడ్డారు. జైలులో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న నరేంద్ర, గురునాథం కరోనా బారినపడొచ్చు. తమకు ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలకు అనుమతివ్వాలన్న వారి అభ్యర్థనపై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలులో జాప్యం చేస్తున్నందున అనుబంధ పిటిషన్‌లో ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని  కోరారు. 


ధూళిపాళ్లకు కరోనా పాజిటివ్‌?

అమరావతి/రాజమహేంద్రవరం సిటీ, మే 5: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్య నివేదికలో తేలినట్టు సమాచారం. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 

Updated Date - 2021-05-06T08:59:11+05:30 IST