‘రుషికొండ’పై హైకోర్టుకు నారాయణ

ABN , First Publish Date - 2022-08-11T09:05:59+05:30 IST

‘రుషికొండ’పై హైకోర్టుకు నారాయణ

‘రుషికొండ’పై హైకోర్టుకు నారాయణ

పనుల పరిశీలనకు వెళ్లిన తనను అడ్డుకోవడంపై సీపీఐ నేత వ్యాజ్యం

నిర్మాణాలపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అక్కడికెందుకు వెళ్లారు?

పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): విశాఖ రుషికొండపై పర్యాటకశాఖ చేపడుతున్న నిర్మాణాలు అనుమతులకు లోబడి జరుగుతున్నాయా?లేదా అనే వ్యవహారంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న ఈ దశలో ఆ ప్రాంతంలో పర్యటించాల్సిన అవసరం ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాలంటే ముందుగా కాంట్రాక్టర్‌ అనుమతి తీసుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీనిపై వివరాలు సమర్పించాలని ప్రతివాదులుగా ఉన్న పర్యాటకశాఖ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, విశాఖ పోలీస్‌ కమిషనర్‌, ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పోరేషన్‌ సీఎండీకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీ.హెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఆదేశాలిచ్చారు. రుషికొండపై పర్యాటకశాఖ చేపడుతున్న ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనకు వెళ్తున్న తనను అధికారులు అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జె.శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్‌ రాజకీయ పార్టీ నాయకుడని, అక్కడ జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయన పై ఉందని  తెలిపారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం చట్టవిరుద్ధమని, అది నిషేధిత ప్రదేశం కాదని తెలిపారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు పనులు పరిశీలించేందుకు వెళ్లిన సీనియర్‌ న్యాయవాదిపై అక్రమంగా ప్రవేశించారని కేసులు పెట్టారన్నారు. పర్యాటకశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆ ప్రాంతం కాంట్రాక్టర్‌ ఆధీనంలో ఉందని, ముందుగా అనుమతి తీసుకొని వెళ్తే ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. 


Updated Date - 2022-08-11T09:05:59+05:30 IST