నారాయణ.. ఎన్నాళ్లీ వేదన

ABN , First Publish Date - 2022-01-24T05:19:50+05:30 IST

నారాయణ.. ఎన్నాళ్లీ వేదన

నారాయణ.. ఎన్నాళ్లీ వేదన
దుప్పలవలస వద్ద బ్రిడ్జి దుస్థితి

- పూర్తికాని ఆధునికీకరణ

- గత ఏడాది జూన్‌ నుంచి ఆగిన పనులు  

- ఏటా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

(ఎచ్చెర్ల)

ప్రభుత్వాలు మారుతున్నా, నారాయణపురం ఆనకట్టకు పట్టిన గ్రహణం మాత్రం వీడడం లేదు. ఏడు మండలాలకు ప్రధాన సాగునీటి వనరు అయిన ఈ ప్రాజెక్టు ఆధునికీకరణలో జాప్యమవుతోంది. అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు మారుతున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో శివారు ప్రాంతాల రైతులకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనకట్ట ఆధునికీకరణకు రూ.112కోట్ల జైకా నిధులు మంజూరయ్యాయి.  వాస్తవానికి గత ఏడాది ఆగస్టు నాటికి అగ్రిమెంటు ప్రాప్తికి పనులు పూర్తి చేయాలి. కానీ, కొవిడ్‌ కారణంగా కొంత కాలం, నిధుల సమస్యతో మరికొంత కాలం.. పనులు మందకొడిగా సాగుతూ వచ్చాయి. చివరకు గత ఏడాది జూన్‌ నుంచి పూర్తిగా ఆగిపోయాయి. నారాయణపురం ఆనకట్ట కింద కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ కింద సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల పరిధిలో సుమారు 50.5 ఎకరాల పొడవునా కాలువ ఉంది. ఇప్పటి వరకు కుడి కాలువ కింద 25 శాతం లోపు పనులు మాత్రమే చేపట్టారు. సంతకవిటి మండలం వాల్తేరు నుంచి పొందూరు మండలం గోకర్ణపల్లి వరకు 3.2 కిలోమీటర్ల మేరకు కాలువ సిమెంటు లైనింగ్‌ జరిగింది. ఇంకా చాలా వరకు లైనింగ్‌ పనులు చేపట్టాల్సిఉంది. ఎచ్చెర్ల మండలంలోని భగీరఽథపురం వరకు ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ఎడమ కాలువ కింద శ్రీకాకుళం రూరల్‌, గార, బూర్జ, ఆమదాలవలస మండలాల్లోని పలు గ్రామాలకు ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ ఆధునికీకరణ కూడా సగంలోనే ఆగిపోయింది. తాజాగా మరోసారి పనుల పూర్తికి గడువు పెంచారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆధునికీకరణ పూర్తి చేసేందుకు అగ్రిమెంట్‌ కుదిరింది. కానీ ఇప్పటివరకు పనుల్లో కదలిక లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


పాడైన షట్టర్లు.. శిథిలమైన కల్వర్టులు

కుడి కాలువ కింద ఉన్న శివారు ప్రాంతాలకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాలకు  అతికష్టమ్మీద నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్‌లో మొక్కుబడిగా చేపడుతున్న మరమ్మతుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో అన్నదాతలు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కుడి కాలువ పొడవునా చిన్నా, పెద్దా షట్టర్లు కలిపి సుమారు 60 వరకు ఉన్నాయి. వీటిలో చాలా వరకు  పాడయ్యాయి. ఆనకట్ట ఏర్పాటు చేసిన కొత్తలో ఈ షట్టర్లను బిగించారు. ఆ తర్వాత వాటి నిర్వహణ బాధ్యతను గాలికొదిలేయడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల సాగునీరు వృథా అవుతోంది. కుడి కాలువ కింద వివిధ చోట్ల ఉన్న కల్వర్టులు శిథిలమయ్యాయి. ఇవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వాసుదేవపట్నం, చిన్నయ్యపేట, మంతెన సమీ పంలో, గోకర్ణపల్లి, బూరాడపేట, దుప్పలవలస సమీపంలో కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గురుకుల పాఠశాల సమీపంలో పూర్తిగా పాడైన కల్వర్టును పునర్నిర్మించాల్సి ఉంది. ఇదే మండలం మాలకుశాలపురం, పెయ్యలవానిపేట, పొందూరు మండలం కింతలి పరిధి లోని దోమగుండం చెరువు వద్ద  పాడైన రెగ్యులే టర్లను మార్చాల్సి ఉంది. కింతలి- కనిమెట్ట పరిధిలోని దోమ గుండం చెరువు వద్ద శిథిలమైన మదుము స్థానంలో కొత్తది నిర్మించాలి. లేదంటే సాగునీరు వృథా తప్పదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌ను, ఇతర అధికారులను, ప్రజాప్రతినిధులను మరోసారి కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. 


పనులు త్వరగా పూర్తిచేయాలి

జైకా నిధులతో చేపడుతున్న నారాయణపురం ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి. ఏటా ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడంలేదు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఖరీఫ్‌ నాటికైనా పనులను పూర్తిచేసి ఆదుకోవాలి.

- నక్క లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌, కొంగరాం 


త్వరలో ప్రారంభిస్తాం

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం ముందు వరకూ ఆధునికీకరణ పనులు చేపట్టాం. ఖరీఫ్‌లో సాగునీరు విడుదల చేసేందుకు పనులను నిలుపుదల చేశాం. త్వరలో మళ్లీ ప్రారంభిస్తాం. నిర్దేశించిన గడువులోగా ప్రణాళికా బద్ధంగా పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

- డి.వేణుగోపాల్‌, డీఈఈ, జలవనరుల శాఖ

Updated Date - 2022-01-24T05:19:50+05:30 IST