నేనేం చేయాలో అది చేస్తా : నారాయణ్ రాణే

ABN , First Publish Date - 2021-08-25T00:16:38+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ‘చెంప దెబ్బ’ అంటూ

నేనేం చేయాలో అది చేస్తా : నారాయణ్ రాణే

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ‘చెంప దెబ్బ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఆయనను కొడతానని చెప్పలేదని, ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే కొట్టి ఉండేవాడినని మాత్రమే అన్నానని చెప్పారు. ఉద్ధవ్ కోరుకున్నది ఆయన చేస్తారని, తనకు కావలసినది తాను చేస్తానని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయనను రత్నగిరి పోలీసులు అరెస్టు చేసి, సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన మహద్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. 


నారాయణ్ రాణే అరెస్టయిన తర్వాత తొలిసారి ఓ జాతీయ మీడియా విలేకరితో మాట్లాడారు. అరెస్టుకు సంబంధించిన ఆదేశాలేవీ తనకు ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారని చెప్పారు. తాను గోల్వాల్కర్ గురూజీ ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చారన్నారు. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో డీసీపీ వచ్చి తనను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారన్నారు. నోటీసు ఉందా? అని తాను ప్రశ్నించానన్నారు. తన వద్ద అటువంటిదేమీ లేదని డీసీపీ చెప్పారన్నారు. తనను సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారని చెప్పారు. డీసీపీ గదిలోకి వెళ్ళి, దాదాపు రెండు గంటలపాటు బయటికి రాలేదని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారు. 


ఉద్ధవ్ థాకరేను కొడతానని తాను చెప్పలేదని నారాయణ్ రాణే తెలిపారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్ళయిందో థాకరేకు తెలియకపోవడంపై వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తాను అక్కడ ఉండి ఉంటే, ఆయనను చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినని అన్నానని తెలిపారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ్ రాణే జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రసంగించినపుడు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందనే విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. ఎన్ని సంవత్సరాలైందో లెక్కపెట్టాలని తన సహచరులను ఉద్ధవ్ ప్రసంగం మధ్యలో కోరారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. వీథుల్లోకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. 


Updated Date - 2021-08-25T00:16:38+05:30 IST