షోకాజ్‌పై తదుపరి చర్యలను నిలిపివేయండి

ABN , First Publish Date - 2020-07-04T08:27:24+05:30 IST

‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’కి సంబంధించి తాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి అందజేసిన దరఖాస్తుకు ..

షోకాజ్‌పై తదుపరి   చర్యలను నిలిపివేయండి

నా దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని ఆదేశించండి

నాకు, నా కుటుంబానికి తీవ్ర బెదిరింపులు

హైకోర్టులో రఘురామరాజు పిటిషన్‌

ప్రతివాదులుగా పార్టీ, విజయసాయి, ఈసీ


అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’కి సంబంధించి తాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి అందజేసిన దరఖాస్తుకు తుది పరిష్కారం లభించేంతవరకూ తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై ఆ పార్టీ గానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గానీ తదుపరి చర్యలేవీ చేపట్టకుండా నిలుపుదల చేయాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ బైలా నిబంధనలను పాటించకుండా జారీ చేసిన షోకాజ్‌ నోటీసు వ్యవహారంలో సమాచారం కోరుతూ ఈసీకి పెట్టుకున్న దరఖాస్తుపై చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన ఆభ్యర్థించారు. అదేవిధంగా తాను అందజేసిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవలసిందిగా ఈసీని ఆదేశించాలని కూడా కోరారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, అన్న వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రఘురామరాజు తన పిటిషన్‌లో ఇంకా ఏమన్నారంటే..


అది వేరే పార్టీ లెటర్‌ హెడ్‌..

‘వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ లెటర్‌ హెడ్‌పై నాకు షోకాజ్‌ నోటీసు అందింది. నిజానికి మా పార్టీ పేరు ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’. ఈసీ వద్ద ‘అన్న వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌’ పార్టీ పేరుతో మరో పార్టీ రిజిస్టరై ఉంది. అందువల్ల చట్ట నిబంధనల మేరకు లెటర్‌ హెడ్‌పై ‘వైఎ్‌సఆర్‌’ ఉపయోగించవద్దని ఈసీ గతంలో పలుమార్లు సూచించింది. ఈసీ ఆమోదం పొందిన, పార్టీ బైలా ప్రకారం ఏర్పాటైన క్రమశిక్షణ సంఘం మాత్రమే పార్టీ సభ్యులకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అధికారం లేని విజయసాయిరెడ్డి నాకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం చట్టవిరుద్ధం. ఈ నోటీసులోని అతిక్రమణలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ, కొంత సమాచారం కావాలని గత నెల 29వ తేదీన దరఖాస్తు చేశాను.


ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29 ఏ ప్రకారం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ని ‘వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’గా మార్చాలని పార్టీ నుంచి ఏదైనా వినతి అందిందా? వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై నాకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం చెల్లుబాటవుతుందా? జూన్‌ 23వ తేదీన నాకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడానికి ముందు.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసు బేరర్లలో మార్పులకు సంబంధించి, లేక క్రమశిక్షణ సంఘం ఏర్పాటు గురించి ఏదైనా సమాచారం అందిందా? ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఉందా? షోకాజ్‌ నోటీసు జారీ చేయడానికి జాతీయ ప్రధాన కార్యదర్శికి పార్టీ క్రమశిక్షణ సంఘం గానీ, దాని చైర్‌పర్సన్‌ గానీ అధికారం ఇవ్వొచ్చా అనే అంశాలపై వెంటనే సమాధానమివ్వాలని అభ్యర్థించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షోకాజ్‌ నోటీసుపై తదుపరి చర్యలు చేపట్టేందుకు వైసీపీలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


ఈ ప్రయత్నాల్లో ప్రతివాదులు విజయవంతమైతే నేను కోలుకోలేనంతగా నష్టపోతాను. ఈసీ మార్గదర్శకాలను అతిక్రమించేందుకు వివిధ పార్టీలకు తలుపులు తెరిచినట్లు అవుతుంది. నేను పార్టీకి విశ్వసనీయ సైనికుడిగా ఉన్నప్పటికీ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులుగా భావిస్తున్న కొంతమంది నా దిష్టిబొమ్మలకు నిప్పంటించడంతో పాటు నన్ను, నా కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వెంటనే ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలి.’’ 


చట్టవిరుద్ధంగా ప్రకటించాలి..

‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం (1951), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ బైలా నిబంధనలు పాటించకుండా నాకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసు వ్యవహారంలో ఎన్నికల సంఘానికి నేను పెట్టుకున్న దరఖాస్తుపై చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలి. నా దరఖాస్తును పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలి. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. గత 29వ తేదీన నేనిచ్చిన ఇచ్చిన దరఖాస్తుకు ఈసీ వద్ద తుది పరిష్కారం లభించేంతవరకూ నాకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ గానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గానీ తదుపరి చర్యలేవీ తీసుకోకుండా కోర్టు నిలుపుదల చేయాలి.’’

Updated Date - 2020-07-04T08:27:24+05:30 IST