చెరో ప్రతిపాదన

ABN , First Publish Date - 2021-07-31T05:26:47+05:30 IST

వైసీపీలో రెండు వర్గాల మధ్య కొంత కాలంగా చాప కింద నీరులా సాగుతున్న విభేదాలు మునిసిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నికల సందర్భంగా భగ్గుమన్నాయి.

చెరో ప్రతిపాదన
నరసాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌

నరసాపురం మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికలో ముదునూరి వర్సెస్‌ కొత్తపల్లి

కౌన్సిల్‌లో రెండు గంటల పాటు హైడ్రామా

ఎన్నిక వాయిదా వేయాలన్న అధిష్ఠానం 

సమావేశం వాయిదాపై విపక్షాల ఫైర్‌

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు


నరసాపురం, జూలై 30 : వైసీపీలో రెండు వర్గాల మధ్య కొంత కాలంగా చాప కింద నీరులా సాగుతున్న విభేదాలు మునిసిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నికల సందర్భంగా భగ్గుమన్నాయి. కోఆప్షన్‌ ఎన్నికలో కొత్తపల్లి వర్గం ఒక్కరిని ప్రతిపాదిస్తే..  ఎమ్మెల్యే ముదునూరి వర్గం మరొకరి పేరును ప్రతిపాదించడంతో వివాదం బయట పడింది. ఇద్దరు పట్టు వీడకుండా పైచేయి కోసం పోటీ పడ్డారు. దీంతో కౌన్సిల్‌ హాల్‌లో రెండు గంటల హైడ్రామా నడిచింది. చివరికీ అఽధినేతల సలహాతో ఎన్నికను వాయిదా వేశారు. శుక్రవా రం చైర్‌పర్సన్‌ వెంకటరమణ అధ్యక్షతన ప్రత్యేక కౌన్సిల్‌ సమావే శాన్ని ఏర్పాటుచేసి కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. అంతకుముందే ఎమ్మెల్యే ప్రసాదరాజు వైసీపీ కౌన్సిలర్లతో షాడో సమావేశాన్ని నిర్వహించారు. అందులో పార్టీ తరపున ముగ్గురిని కో ఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేసినట్లు సభ్యులకు తెలిపారు. కౌన్సిలర్లు ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమని భావించారు. అయితే కౌన్సిల్‌లో అబీదా సుల్తానా, చింతా మాలతీల పేర్లు ప్రతిపాదించినప్పుడు మరోపేరు ప్రస్తా వనకు రాలేదు. చివరికీ ఏడిదకోట సత్యనారాయణ పేరును ప్రతిపాదించగానే.. దానికి ప్రతిగా కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గానికి చెందిన కౌన్సిలర్‌ వన్నెంరెడ్డి శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ బళ్ల వెంకటేశ్వరావు పేరును ప్రతిపాదించారు. దీన్ని వీసీ కొత్తపల్లి నాని బలపర్చారు. ఈ హఠాత్పరిణామానికి కౌన్సిల్‌కు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా హాజరైన ఎమ్మెల్యే ముదునూరి అవా క్కయ్యారు. అధికార పార్టీ నుంచే మరో ప్రతిపాదన రావడంతో ఏం చేయాలో తెలియక అధికారులు డైలమాలో పడ్డారు. ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేతోపాటు కమిషనర్‌ సత్యవేణి బయటకు వెళ్లారు. రెండు గంటలపాటు హైడ్రామా నడవడంతో సభ్యులం తా కౌన్సిల్‌ హాల్‌లోనే కూర్చొన్నారు. ఎన్నిక జరుగుతుందని భావించారు. అయితే పార్టీ అధినేతల దృష్టికి వెళ్లడంతో సమస్య రాజీకి ప్రయత్నించారు. చివరికి కమిషనర్‌ సత్యవేణి కౌన్సిల్‌ హాల్‌లోకి వచ్చి కో–ఆప్షన్‌ ఎన్నికను తాత్కా లికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. కొత్తపల్లి వర్గం ప్రతిపాదించిన వెంకటేశ్వ రావుకు కేబినెట్‌ మంత్రితోపాటు సీఎం కార్యాలయ కీలక నేత సిఫారసు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వరావును కోఆప్షన్‌కు ప్రతిపాదించినట్లు కొత్తపల్లి వర్గీయులు చెబుతున్నారు. 


 వాయిదాపై విపక్షాల ఫైర్‌


ఎన్నికను వాయిదా వేయడాన్ని టీడీపీ, జనసేన, స్వతంత్ర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పాలని పట్టుబట్టారు. 31 మంది సభ్యులతో కోరం ఉండగా... ఎన్నిక వాయిదా వేయడం పాలకపక్ష అసమర్థతకు నిదర్శనమని టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జి, స్వతంత్ర అభ్యర్థి కోటిపల్లి సురేష్‌, జనసేన కౌన్సిలర్‌ తోట అరుణ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-07-31T05:26:47+05:30 IST