టెన్త్ విద్యార్థులతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్.. సడన్‌గా వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రత్యక్షం.. సీన్ కట్ చేస్తే..

ABN , First Publish Date - 2022-06-09T18:53:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు...

టెన్త్ విద్యార్థులతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్.. సడన్‌గా వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రత్యక్షం.. సీన్ కట్ చేస్తే..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ (Nara lokesh) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోకి వచ్చి మాట్లాడుతుండగా.. సడెన్‌గా వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ప్రత్యక్షమయ్యారు. వీరి రాకపై విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. స్క్రీన్ పై వారిద్దరి విజువల్స్ కనిపించడంతో టీడీపీ నేతలు (TDP Leaders) కన్నెర్రజేస్తున్నారు. ఈ ఘటనతో జూమ్ లైవ్‌ను నిర్వహకులు కట్ చేశారు.


అసలేం జరిగింది..!

గురువారం మధ్యాహ్నం పదో తరగతి విద్యార్థులతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే సమయంలో ఇద్దరు విద్యార్థినుల ఐడీల లింక్‌తో జూమ్ కాన్ఫరెన్స్‌లోకి సడన్‌గా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. నవ్య తోట పేరుతో వంశీ, కార్తిక్ కృష్ణ పేరుతో కొడాలి నాని లాగిన్ అయినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఇద్దరూ వారి ఆఫీసుల్లో నుంచే ల్యాప్‌టాప్‌లతో లాగిన్ అయ్యారు. ఇద్దరూ కూడా లైవ్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు వెంటనే లైవ్‌ కట్ చేశారు. మరోవైపు.. వైసీపీ నేత దేవేందర్ రెడ్డి కూడా జూమ్‌లో ప్రత్యక్షమయ్యారు. లోకేష్‌తో మాట్లాడేందుకు దేవందర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వంశీ, కొడాలి నానిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా విద్యార్థినుల పేర్లతో ఎందుకు రావాల్సి వచ్చింది..?. దమ్ముంటే నేరుగా చర్చకు రావాలి’ అని ఆ ఇద్దరికీ లోకేష్ సవాల్ విసిరారు. ఈ ఘటన అనంతరం వంశీ, నాని ఇద్దరూ జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫొటోలను లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


సమాధానం చెప్పండి..!

అసలు రెండు లక్షల మంది ఎందుకు తప్పారు..? దీనికి జగన్ సమాధానం చెప్పాల్సిందే.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులకు సీఎం ఏమని సమాధానం చెబుతారు..?. ఇప్పుడైనా తీరు మార్చుకుని జగన్ సమీక్ష చేయాలి. పరీక్షల ప్యాటర్న్ మార్చమని మిమ్మల్ని ఎవరు అడిగారు..?. ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ నిలదీశారు.


విజనరీ బాబు.. ప్రిజనరీ జగన్..!

కాగా అంతకుముందు.. విజనరీ చంద్రబాబు, ప్రిజనరీ జగన్‌కు మధ్య ఉన్న తేడానే పదో తరగతి ఫలితాలని లోకేష్ వ్యాఖ్యానించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షల నిర్వహణ, ఉత్తీర్ణతపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని వెంటనే ప్రకటించాలని,  ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన ఆరోపించారు. మరోవైపు... మరణించిన విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని లోకేష్ అభయమిచ్చారు.

Updated Date - 2022-06-09T18:53:58+05:30 IST