అధైర్యపడొద్దు అండగా ఉంటా!

ABN , First Publish Date - 2020-10-20T07:03:04+05:30 IST

భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో పంట నష్టపోయిన అన్నదాతలను అండగా నిలబడి పోరాడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. ఈమేరకు వారిలో ధైర్యం నూరిపోశారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో మునిగిన పంట పొలాలు, కాలనీలను పార్టీ నేతలతో కలిసి లోకేష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీకల్లోతు మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి బాధిత రైతుల గోడు విన్నారు. వరద ఎలా పంటలను ముంచేసింది?

అధైర్యపడొద్దు అండగా ఉంటా!
యర్రవరంలో మునిగిన పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడుతున్న లోకేష్‌

 పంట నష్టపోయిన అన్నదాతలు, ముంపు గ్రామాల బాధితులకు లోకేష్‌ భరోసా
 అయిదు నియోజకవర్గాల పరిధిలో వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో రోజంతా పర్యటన
 కిర్లంపూడి, ఏలేశ్వరం, పిఠాపురం మండలాల్లో మునిగిన వరి చేలల్లోకి దిగిన లోకేష్‌
పంట నష్టంపై లోకేష్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్న రైతులు.. సర్కార్‌ ఆదుకోలేదని ఆవేదన
ఉప్పాడలో దెబ్బతిన్న ఇళ్లు, ఇంద్రపాలెంలో మునిగిన కాలనీల బాధితులతో ముఖాముఖి
దోమాడలో మునిగిన ఇళ్లస్థలాల వద్దకు వెళ్తున్న లోకేష్‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం
గోబ్యాక్‌ అంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన.. దీటుగా స్పందించిన టీడీపీ కేడర్‌
భారీగా మోహరించిన రిజర్వు పోలీసులు.. ఆందోళన విరమించిన వైసీపీ నేతలు



భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో పంట నష్టపోయిన అన్నదాతలను అండగా  నిలబడి పోరాడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. ఈమేరకు వారిలో ధైర్యం నూరిపోశారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో మునిగిన పంట పొలాలు, కాలనీలను పార్టీ నేతలతో కలిసి లోకేష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీకల్లోతు మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి బాధిత రైతుల గోడు విన్నారు. వరద ఎలా పంటలను ముంచేసింది? ఎన్ని ఎకరాల్లో పంట పోయింది? పెట్టుబడి నష్టం ఎంత? తదితర వివరాలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. సర్కార్‌ నుంచి న్యాయం జరిగేలా పోరాడతామని వారిలో ధైర్యం నింపారు. కాగా పెదపూడి మండలంలో వైసీపీ బరితెగించి లోకేష్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. మునిగిన ఇళ్ల స్థలాలు చూడ్డానికి రావొద్దని హెచ్చరించింది. దీనికి టీడీపీ నుంచి కూడా ధీటుగా సమాధానం ఎదురైంది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో సోమవారం ఉదయం పది గంటలకు లోకేష్‌ పర్యటన ప్రారంభం కాగా, తొలుత జగ్గంపేట మండలం రామవరం జాతీయరహదారి పక్కన ఏలేరు వరదకు కుప్పకూలిన ఇంటి పరిశీలనకు వెళ్లారు. నష్టపోయిన ఇంటి యజమానితో ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం వెళ్తే అధికారులు హేళనగా మాట్లాడారని ఈ సందర్భంగా ఇంటి యజమాని లోకేష్‌ వద్ద బోరుమన్నాడు. అనంతరం కిర్లంపూడి మండలం గోనేడలో పీకల్లోతు మునిగిన పంట పొలాలను పరిశీలించారు.నడుంలోతు వరకు చేలల్లోకి దిగి అన్నదాతలతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంట మునిగిందని ఆరా తీశారు. నష్టం ఎంత వచ్చింది? అధికారులు వచ్చి పరిశీలించారా?లేదా? అడిగి తెలుసుకున్నారు. అయితే ఇంతవరకు అధికారులు రాలేదని, పంట మొత్తం పోయి రోడ్డున పడ్డామని అన్నదాతలు కన్నీటిపర్యంతం అయ్యారు. సాయం అందుతుందా? లేదా? అనేది కూడా తెలియడం లేదని వాపోయారు. న్యాయం జరిగేలా పోరాడతానని లోకేష్‌ ఈ సందర్భంగా వీరికి అభయం అందించారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరంలో మునిగిన పంటపొలాలను పరిశీలించారు. అన్నదాతలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ,రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేరుకున్నారు. ఏలేరు వరదతో ఈబీసీ కాలనీ ముంపునకు గురవడంతో బాధితులతో మాట్లాడారు. వారు అందించిన వినతిపత్రాన్ని స్వీకరించారు. ఏలేరు ఆధునికీకరణ తమ ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ సర్కార్‌ రివర్స్‌టెండరింగ్‌ పేరుతో ఆపేసిందని, కీడు చేయడం తప్ప మేలు చేయడం తెలియని ప్రభుత్వమని ధ్వజమె త్తారు. అనంతరం పిఠాపురం పట్టణం దాటాక మార్గమధ్యంలో మునిగిన పంట చేలు పరిశీలించారు. అక్కడి నుంచి ఉప్పాడకొత్తపల్లిలోని అమీనాబాద్‌లో కెరటాల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని ఇంద్రపాలెంలో నీటమునిగిన కాలనీ ప్రజలను పరామర్శించారు. కష్టాల్లో ఉన్న తమకు అధి కారులు భోజనం కూడా పెట్టలేదని ఈ సందర్భంగా బాధితులు లోకేష్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడి నుంచి అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడలో మునిగిన పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించారు. కోట్లుపెట్టి కొనుగోలు చేసిన స్థలాలు మునిగిపోవడం చూస్తే ఇందులో ఎంత అవినీతి జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాత్రి ఏడు గంటలకు పర్యటన ముగించుకుని లోకేష్‌ తిరుగు పయనమయ్యారు. కాగా పర్యటించిన అయిదు నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ లోకేష్‌ పలుసందర్భాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏలేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్లే చిన్నపాటి వర్షాలకు గొల్లప్రోలు, పిఠాపురం పరిసర ప్రాంతాలు భారీగా నీటమునిగిపోయాయన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో 64 మంది రైతులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పర్యటనలో టీడీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజక వర్గ ఇంచార్జ్‌ జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల రాజా, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, రామకృష్ణారెడ్డి, కాకినాడ నగర్‌ మేయర్‌ సుంకర పావని తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ వీరంగం...
దోమాడలో మునిగిన ఇళ్ల స్థలాలను పరిశీలించేందుకు లోకేష్‌ వస్తుండడంతో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. పెద్దఎత్తున అచ్యుతాపురత్రయం ప్రాంతం వద్దకు చేరుకుని లోకేష్‌ గో బ్యాక్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జై జగన్‌.. టీడీపీ డౌన్‌డౌన్‌ అంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మాత్రం వీరిని నిలువరించలేదు. స్థానిక మండల పార్టీ నేతతో సహా పలువురు లోకేష్‌ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. అయితే టీడీపీ నుంచి అనూహ్యంగా ప్రతిఘటన రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గొడవలు జరిగే ప్రమాదం ఉందని పసిగట్టిన పోలీసులు అప్పటికప్పుడు రిజర్వు బలగాలను మోహరించారు. దీంతో ఏక్షణంలో ఏమవుతుందోననే ఆందోళన నెలకొంది. ఈలోపు పోలీసులు అధికార పార్టీ కీలక నేతకు విషయం వివరించారు. లోకేష్‌ పర్యటనకు అనుమతి ఉందని, ఈ సమయంలో వైసీపీ కేడర్‌ తగ్గకపోతే టీడీపీ నుంచి ప్రతిఘటన పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. దీంతో చేసేది లేక వైసీపీ నేతలకు అక్కడి నుంచి ఆందోళన విరమించాల్సి వచ్చింది. వెళ్తూవెళ్తూ లోకేష్‌ కాన్వాయ్‌ మధ్యలోకి వచ్చి జైజగన్‌ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు.
సెల్ఫీలు.. కొవిడ్‌ షేక్‌హ్యాండ్‌లు..
పర్యటనలో ఆసాంతం బిజీగా గడిపిన లోకేష్‌ మధ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం కేటాయిస్తూ వచ్చారు. అందులోభాగంగా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, అనపర్తి నియోజకవర్గాల్లో తన వెంట వచ్చిన కేడర్‌, నాయకులతో ఆప్యాయంగా మాటలు కలిపి నియోజకవర్గాల్లో సమస్యలపై చర్చించారు. ఎక్కడికక్కడ కేడర్‌తో సెల్ఫీలు దిగారు. కొవిడ్‌ నేపథ్యంలో షేక్‌హ్యాండ్‌లు ఇచ్చు కునే పరిస్థితి లేకపోవడంతో కీలక నేతలతో మోచేయి కరచాలనం చేశారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తనయుడితో లోకేష్‌ ఇలా మోచేయి కరచాలనం చేయడంతో కేడర్‌ ఆసక్తిగా చూశారు. అటు ఉప్పాడ బీచ్‌ రోడ్డులో వెళ్తూ మధ్యలో కారు ఆపి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో బీచ్‌ వద్ద సెల్ఫీలు దిగారు. సెల్ఫీ కోసం వచ్చిన వారి నుంచి ఫోన్‌ తీసుకుని స్వయంగా లోకేష్‌ సెల్ఫీ ఫోటోలు తీయడం విశేషం.

Updated Date - 2020-10-20T07:03:04+05:30 IST