Amaravathi : పల్నాడు పర్యటనకు నారా లోకేష్(Nara Lokesh) బయలుదేరారు. రావలాపురం గ్రామానికి వెళ్లి ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించనున్నారు. గుంటూరు(Guntur) జిల్లా చుట్టుగుoట సెంటర్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి వెళ్లనున్నారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్ధిక సాయాన్ని నారా లోకేష్ అందించనున్నారు. లోకేష్ పల్నాడు పర్యటనలో పాల్గొంటే ప్రాణ నష్టం జరిగే సమాచారం ఉందంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం ముఖ్యనేతలందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి అల్లర్లు జరుగుతాయని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొని విధ్వంసకర ఘటనలకు బాధ్యులు కావొద్దంటూ తెలుగుదేశం నేతలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పల్నాడు నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లోకేష్‌కు భారీ స్థాయిలో స్వాగత సన్నాహాలు చేస్తున్నారు.