కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై కేసులు : లోకేష్

ABN , First Publish Date - 2020-08-08T02:30:01+05:30 IST

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై కేసులు : లోకేష్

అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై కరోనా, అట్రాసిటీ కేసులు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నేర స్వభావం ఉన్న జగన్ లాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు. ప్రజలను గాలికొదిలేసి కరోనాను కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని లోకేష్ ఆరోపించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలుండేవి కావని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-08T02:30:01+05:30 IST