AP Assembly ఘటనపై నారా భువనేశ్వరి ఫస్ట్ రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2021-11-21T16:03:46+05:30 IST

AP Assembly ఘటనపై నారా భువనేశ్వరి ఫస్ట్ రియాక్షన్ ఇదీ..

AP Assembly ఘటనపై నారా భువనేశ్వరి ఫస్ట్ రియాక్షన్ ఇదీ..

  • వారివి దిగజారుడు మాటలు..
  • మనసులో పెట్టుకోవద్దు..!
  • చంద్రబాబును అనునయించిన భువనేశ్వరి!


అమరావతి : ‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి అనునయించినట్లు సమాచారం. అసెంబ్లీలో భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన చంద్రబాబు విలేకరుల సమావేశంలో విలపించిన ఆ దృశ్యాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి.. తాను కూడా విపరీతంగా విలపించారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు, లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. వారిని చూడగానే ఆమె మరోసారి రోదించారు. కానీ ఆ తర్వాత ఆమె త్వరగానే కోలుకున్నారు. జరిగిన ఘటనలపై బాధపడుతున్న చంద్రబాబును ఆమె అనునయించినట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


‘రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు(ఎన్టీ రామారావు) ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కినెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించుకోవద్దు’ అని ఆమె అన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అసెంబ్లీలో జరిగిన ఘటనలతో శుక్రవారం బాగా బాధపడిన చంద్రబాబు శనివారం నాటికి కొంత సాధారణ స్థితికి వచ్చారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి వరద పరిస్థితిపై చర్చించారు. 

Updated Date - 2021-11-21T16:03:46+05:30 IST