Napier Bridge: ఈ దృశ్యాలు చూసి ‘చెస్ బోర్డ్’ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎక్కడుందో చూడండి..!

ABN , First Publish Date - 2022-07-17T03:51:33+05:30 IST

ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో ఈ నెల 28న 44వ అంతర్జాతీయ స్థాయి చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని..

Napier Bridge: ఈ దృశ్యాలు చూసి ‘చెస్ బోర్డ్’ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎక్కడుందో చూడండి..!

చెన్నై: ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో ఈ నెల 28న 44వ అంతర్జాతీయ స్థాయి చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని నేపియర్ వంతెనపై చెస్ బోర్డ్ ఆకారంలో పెయిటింగ్‌ వేశారు. ఈ పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఆ వంతెనపై కారులో వెళుతూ వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out’’ అని సుప్రియా సాహు ట్వీట్ చేశారు.



ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఇలా వంతెనను ముస్తాబు చేయడాన్ని ప్రశంసిస్తే.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పెయింటింగ్ వేసిన బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసే వారు రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, డ్రైవర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని.. అసలు ఇలా పెయింటింగ్ చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ పెయింటింగ్ డ్రైవ్ చేసేవారిని భ్రాంతికి గురిచేసే అవకాశం ఉందని.. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఒక ‘యానిమేటెడ్ వరల్డ్’లోకి వెళ్లిన అనుభూతి కలిగిందని ట్వీట్ చేశారు.



ఇదిలా ఉండగా.. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 44వ చెస్‌ ఒలింపియాడ్‌ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్‌లో కూడా నేపియర్‌ వంతెన చెస్‌ బోర్డు రంగులను పులుముకున్న దృశ్యాలు కనువిందు చేశాయి. ఇప్పటికే ‘‘44వ చెస్ ఒలంపియాడ్’’ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. జులై 28 నుంచి ఆగస్ట్ 10 వరకూ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను స్వయంగా తిలకించాలని భావించే వారి కోసం ఆన్‌లైన్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఆసక్తి కలిగిన వారు https://tickets.aicf.in/ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు రూ.200, రూ.300, ఇతరులకు రూ.2 వేలు, రూ.5 వేలు, విదేశీయులకు రూ.6 వేలు, రూ.8 వేలుగా టిక్కెట్ల ధరను నిర్ణయించారు.

Updated Date - 2022-07-17T03:51:33+05:30 IST