Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాణ్యత లేని ట్రాన్స్‌ఫార్మర్లు..

పనిచేయని ఏబీ స్విచ్‌లు 

తరచూ మరమ్మతులు.. సరఫరాలో అంతరాయం

ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు 


మనుబోలు. డిసెంబరు 5: ప్రస్తుత జీవన విధానంలో ప్రతి పని కరెంటుతో ముడిపడి ఉంటుంది. ఈ తరుణంలో ప్రజలకు ప్రభుత్వాలు నాణ్యమైన విద్యుత్‌ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గ్రామాల్లో నిత్యం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో వినియోగదారులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఏళ్లనాటి ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురై సరఫరాకు ఆటంకాలు కలుగుతున్నాయి. వాటి స్థానంలో అమర్చుతున్న తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్లు నాణ్యత లేనివి కావడంతో వాటిని సరిచేయలేక విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బంది రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సరఫరా సక్రమంగా అందక వినియోగదారులు విసుగు చెందుతున్నారు. 

మండలంలోని 19 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గృహ, వ్యవసాయ, ఆక్వా కలిపి 16వేల సర్వీసులు ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు 1700 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే సర్వీసులకు సరిపడా విద్యుత్‌ సిబ్బంది మండలంలో లేరు. ముగ్గురు లైన్‌మెన్లు, ఇద్దరు ఎల్‌ఐలు, ఇద్దరు ఏఎల్‌ఎమ్‌లు మాత్రమే ఉన్నారు. ఈ ఏడుగురు శాశ్వత ఉద్యోగులలో ఇద్దరు ఎల్‌ఐలు విద్యుత్‌ సమస్యలు ఏర్పడిన ప్రదేశాలకు వచ్చిన దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం సచివాలయాల కింద కేటాయించిన ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రమే సమస్యలు వచ్చినచోట పనిచేస్తున్నారు. 

 

దెబ్బతిన్న తీగలు.. పనిచేయని ఏబీ స్విచ్‌లు

మండలంలో పలుచోట్ల విద్యుత్‌ తీగలు ఏళ్లతరబడి ఉన్నవే. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం తీగలు తెగి కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా రాత్రివేళల్లో తీగలు తెగిన ప్రదేశాన్ని అన్వేషించి వాటిని సరిచేసేందుకు గంటల సమయం పడుతోంది. దీంతో ప్రజలు విద్యుత్‌ సిబ్బందిపై మండిపడుతున్నారు. ఒక్క మనుబోలులోనే 16వరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ప్రతి దానికి ఏబీ స్విచ్‌ అమర్చాలి. దీనివల్ల ఏ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను నిలిపివేసి మిగతా గ్రామానికి సరఫరా  అందించవచ్చు. అయితే కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే ఏబీ  స్విచ్‌లు అమర్చారు. అయితే అవి సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో మూడువేల సర్వీసులు ఉన్న మనుబోలులో ఎక్కడోచోట మరమ్మతులు చేయాల్సి వస్తోంది. దీంతో మనుబోలు పట్టణమంతా సరఫరా నిలిపి వేస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఇదే సమస్య తీవ్రంగా ఉంది. ఇకనైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement