Abn logo
Feb 24 2021 @ 18:03PM

నాని బ‌ర్త్‌డే స్పెషల్‌: ‘శ్యామ్ ‌సింగ రాయ్’ ఫ‌స్ట్ లుక్

నాని బర్త్‌డే స్పెషల్‌గా ఆయన చేస్తున్న చిత్రాల అప్‌డేట్స్‌ని మేకర్స్‌ విడుదల చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 23నే ఆయన నటిస్తున్న 'టక్‌ జగదీష్‌' చిత్రం టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇక నాని పుట్టినరోజైన ఫిబ్రవరి 24న ఆయన చేస్తోన్న మరో చిత్ర ఫస్ట్‌ లుక్‌ని ఆ చిత్ర మేకర్స్‌ విడుదల చేశారు. నేచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న 'శ్యామ్ ‌సింగ రాయ్' చిత్ర ఫస్ట్‌ లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఒక విల‌క్ష‌ణ క‌థ‌తో తీస్తున్న ఈ మూవీలో ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని గెట‌ప్‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ లాంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ మూవీని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా విడుదలైన 'శ్యామ్ ‌సింగ రాయ్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఒక బెంగాలీ యువ‌కుని గెట‌ప్‌లో నాని స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆయ‌న మీస‌క‌ట్టు, హెయిర్ స్టైల్ విల‌క్ష‌ణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రెస్‌, ప‌క్క‌నే రిక్షా బండిని చూస్తుంటే ఈ మూవీ ఒక పీరియ‌డ్ డ్రామా అనే విష‌యం అర్థమవుతోంది. గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మేమంటే నానిని వెన‌క నుంచి ఒక యువ‌తి గ‌ట్టిగా కౌగ‌లించుకుంది కానీ, ఆమె ముఖం అస‌లు క‌నిపించ‌డం లేదు. ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రు ఆయ‌న‌ను కౌగ‌లించుకున్నార‌నే విష‌యాన్ని మ‌న ఊహ‌ల‌కి వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ పోస్ట‌ర్ ప్ర‌కారం 'శ్యామ్ ‌సింగ రాయ్' ఒక విల‌క్ష‌ణ‌ ల‌వ్ స్టోరీ అనేది మాత్రం అర్థమవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌క‌తాలో జ‌రుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు స‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. అక్క‌డ ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తీస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement