Jul 27 2021 @ 11:00AM

నాని గ్యాప్ తీసుకోవడం లేదు

నేచురల్ స్టార్ నాని గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కిన 'టక్ జగదీష్' అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్దంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమా చేస్తున్నాడు నాని. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. 

దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోల్ కత్తా నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే, తాజాగా ఈ సినిమాని కంప్లీట్ చేసేసి నాని ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా 'అంటే సుందరానికి' చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా నాని తెలియజేస్తూ..'శ్యామ్ సింగ రాయ్' నుంచి 'అంటే సుందరానికి' మేకోవర్‌లోకి సింపుల్‌గా మారిపోయినట్టు పోస్ట్ చేసాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా, నజ్రియా నజీమ్ నానికి జంటగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.