నంద్యాల గాంధీ

ABN , First Publish Date - 2022-08-14T05:37:13+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ కాలంలో కారాగారవాసం చేయని సమర యోధుడు కాదర్‌బాద్‌ నరసింగరావు.

నంద్యాల గాంధీ
స్వాతంత్ర సమర యోధులకు ఆతిథ్యమిచ్చిన నరసింగరావు గృహం

ఆయన ఇల్లే స్వాతంత్య్ర సమర యోధుల అతిథి గృహం
 గాంధీజీ  మార్గంలో నడిచిన కాదర్‌బాద్‌ నరసింగరావు
గాడిచర్ల హరి సర్వోత్తమరావుకు సన్నిహితుడు

స్వాతంత్ర్యోద్యమ కాలంలో కారాగారవాసం చేయని సమర యోధుడు  కాదర్‌బాద్‌ నరసింగరావు.  ఆయన్ను గాడిచర్ల హరిసర్వోత్తమరావు నంద్యాల గాంధీ అని గౌరవించారు. గాంధీ ఇచ్చిన పోరాట పిలుపులను నంద్యాల్లో అమలు చేసిన సత్యాగ్రాహి. గాంధీవాదానికి ప్రతినిధిగా జీవించి జిల్లా చరిత్రపై తనదైన ముద్ర వేశారు. నరసింగరావు  జీవన విధానం, విలువలు, ప్రభావం వల్లే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయడానికి వెనుకాడిందని అంటారు. ఆయన   కేవలం జాతీయోద్యమానికే పరిమితి కాలేదు.   అనేక సంక్షేమ, ప్రజా ఉపయోగ కార్యక్రమాలను అమలు చేశారు.  స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన గురించి కథనం...

నంద్యాల టౌన్‌, ఆగస్టు 13: నరసింగరావు 1888 లో జన్మించారు. 1920 నుంచి 1934 వరకు బ్రిటీష్‌ కాలంలోనే నంద్యాల పురపాలక సంఘానికి నామినేటెడ్‌ తొలి అధ్యక్ష పదవిలో కొనసాగారు. అప్పట్లో గాంధీజీ ఇచ్చిన ప్రతి పిలుపుకూ స్పందించి నంద్యాలలో ఉద్యమా లు నిర్వహించారు. నిష్కళంక ప్రజాసేవ, నిస్వార్థ జీవితం, దళితోద్ధరణ  కోసం ప్రత్యేక హాస్టళ్ళ ఏర్పాటు, రైతుల పక్షాన దృఢంగా నిలబడగల వ్యక్తిత్వం వల్లే బ్రిటీష్‌ పాలకులు ఆయన్ను అరెస్టు చేయడానికి సాహసించ లేకపోయారు. కాదర్‌బాద్‌ నరసింగరావును గ్రంథాలయోద్యమ నేత గాడిచర్ల హరి సర్వోత్తమరావు నంద్యాల గాంధీ అని గౌరవించారు.  

1923లో గాంధీజీ అనుచరుడిగా  జాతీయ పతాకాన్ని భుజాన మోస్తూ నంద్యాలకు వచ్చిన సయ్యద్‌ భియాబానీ(కడప, కంభం, ఆత్మకూరు ప్రాంతాల్లో నివసించేవారు) నరసింగరావు ఇంటి తొలి ఆతిథ్యం స్వీకరించిన ప్రముఖుడు. ఈయన  స్వాతంత్య్ర అనంతరం మూడు సార్లు శాసన మండలికి ఎన్నికయ్యారు.
కాదర్‌బాద్‌ నరసింగరావు ఇల్లు స్వాతంత్ర్యోద్యమానికి ముందు, ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుంచి వీడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళల్లో ఎందరో స్వాతంత్ర సమరయోధులకు అతిథి గృహంగా ఉండేది. ఉద్యమ పర్యటనలో భాగంగా నంద్యాలకు వచ్చిన ప్రముఖులందరూ కాదర్‌బాద్‌ ఇంట్లో  దిగి భోజనం, వసతి ఆతిథ్యాన్ని పొందేవారు.
డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌  1935లో నంద్యాలకు వచ్చి నరసింగరావు ఇంటికి వెళ్ళి ఆతిఽథ్యం స్వీకరించి ప్రస్తుతం బస్టాండ్‌ సమీపంలో ఉన్న విక్టోరియా రీడింగ్‌ రూమ్‌ ఆవరణంలో బహిరంగ సభలో పాల్గొని వెళ్ళారు. రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం 1952లో మరోసారి నరసింగరావు ఇంటికి బాబు రాజేంద్రప్రసాద్‌ వెళ్లారు.
1930లో   మహాత్మాగాంధీ స్వరాజ్య నిధి కోసం యాత్రలో భాగంగా   నంద్యాల రైల్వే స్టేషన్‌లో దిగి   మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో ప్రసంగించారు. అనంతరం నేరుగా నరసింగరావు ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు.
1930 నుంచి కొన్నేళ్ళ పాటు నంద్యాలలో  ఉన్న గాడిచర్ల హరి సర్వోత్తమరావు  కాదర్‌బాద్‌ నరసింగరావు ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించేవారు.
అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు తదితరులు శ్రీబాగ్‌ ఒడంబడికపై చర్చలు, ప్రచారం నిమిత్తం నంద్యాలకు వచ్చినప్పుడు కాదర్‌బాద్‌ ఇంట్లో ఆతిథ్యం తీసుకొనేవారు.  శ్రీబాగ్‌ ఒప్పందంలో కాదర్‌బాద్‌ నరసింగరావు కూడా  సంతకం చేశారు.
 

ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు తో కాదర్‌బాద్‌ నరసింగరావుకు దగ్గరి స్నేహం ఉంది. ఆయన 1952లో ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీకెనాల్‌ ఆయకట్టు రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రతి మూడు, నాలు గు నెలలకోసారి నేరుగా నరసింగరావు ఇంటికే వచ్చేవారు. అక్కడే భోజనం చేసేవారు.  
ఆచార్య ఎన్‌జీ రంగా కాదర్‌బాద్‌ నరసింగరావు ఇంటికి ఎన్నో సార్లు వచ్చి వ్యవసాయ సమస్యలపై చర్చించే వారు.
గాడిచర్లకు సన్నిహితులైన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ పండిట్‌, డాక్టర్‌ వీవీగిరి, మాడపాటి లాంటి ఎందరో ప్రముఖులు నరసింగరావు ఇంటికి వచ్చి భోజనం చేసి సమాలోచనలో, సమావేశాలు నిర్వహించుకొనేవారు. దత్తమండలలాలకు రాయలసీమగా నామకరణం జరిగింది నంద్యాల గాంధీ ఇంట్లోనే.

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు 1952లో పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నంద్యాలకు రావడం, ఆయనకు ఆహ్వానం, హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం నరసింగరావే చేశారు.  
భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక వర్గంలో ప్రముఖ సభ్యుడైన ఎస్‌కేడే (బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి) నంద్యాలకు వచ్చి పంచాయతీ రాజ్‌, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రాయలసీమ మేధావులకు విలువ నిచ్చే కార్యక్రమంలో కాదర్‌బాద్‌ ఇంటికి నిత్య అతిథిగా వచ్చేవారు.

ప్రముఖ నాస్తిక వాది, గోరా నంద్యాలకు వచ్చినప్పుడు నరసింగరావు పేద దళితులకు వసతి గృహం స్థాపించిన విషయం తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లారు.  కులాతీత సహపంక్తి భోజనం చేశారు.
1956లో విశాలాంధ్ర  ఆవిర్భవించాకచిన తొలి మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న తెన్నేటి విశ్వనాథం ఎన్నో సార్లు నంద్యాల గాంధీ ఇంటికి వచ్చారు.

పోరాట యోధుడు గులాం రసూల్‌ ఖాన్‌

కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 13: ఆంగ్లేయులంటే మొదటి నుంచీ గిట్టని రసూల్‌ఖాన్‌ ఉత్తరభారతదేశంలో సయ్యద్‌ బరేలీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘వహాబీ’ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. వహాబీ ఉద్యమం ఉద్దేశం మన ప్రాంతాలను మనమే పాలించుకోవాలి. మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. కర్నూలు శివారుకు చేరుకున్న ఎ.బి. డైస్‌ కర్నూలు కోటను ఖాళీ చేసి, తమకు లొంగిపోవాలని గులాం రసూల్‌ఖాన్‌కు వర్తమానం పంపించాడు. అయితే గులాం రసూల్‌ఖాన్‌ బ్రిటీషు వారికి వెన్ను చూపకుండా ఉన్న కొద్దిపాటి సైన్యంతో బ్రిటీషు వారిపై తలపడ్డాడు. ఈ పోరు ఆరురోజులు కొనసాగి 1839 అక్టోబరు 18న ముగిసింది. తన సైన్యమంతా హతం కాగా, రసూల్‌ఖాన్‌ను చుట్టుముట్టి బ్రిటీషు సైన్యం ఆయన్ను నిర్భందించింది. విచారణ ఖైదీగా ఆయన్ను తిరుచునాపల్లి కారాగారానికి తరలించింది. తిరుచునాపల్లి కారాగారంలో ఉన్న రసూల్‌ఖాన్‌ను వెంటనే చంపేస్తే కర్నూలు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని భావించిన బ్రిటీషు వారు విచారణ పేరుతో కొన్నాళ్లు కారాగారంలోనే ఆయన్ను ఖైదీగా ఉంచారు. నవాబు వ్యక్తిగత సహాయకుడ్ని లోబర్చుకొని ఆయనకు విషాహారం పెట్టించగా 1840 జూలై 12న రసూల్‌ఖాన్‌ కన్ను మూశారు.

ఆస్తులను త్యజించి.. గాంధీ వెంట నడిచి..

ఆత్మకూరు, ఆగస్టు 13: నందికొట్కూరు తాలుకాలోని మిడ్తూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన జంగం తిప్పయ్య జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఆకర్షితులయ్యారు. అప్పట్లో గాంధిజీ చేపట్టిన ఉప్పు సత్రాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్‌ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు కారాగారా శిక్ష కూడా విధించింది. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు రాజ్యాంగ పరిషత్‌ సభ్యులైన సర్దార్‌ నాగప్ప నేతృత్వంలో తిమ్మయ్య ఉద్యమంలో ముందుండి నడిచారు. స్వాతంత్య్ర పోరులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఆయన తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్న ఆస్తి పాస్తులను ఉద్యమాలకు ఖర్చు చేశారు.

గాంధేయవాది ఆర్‌కే రామ్‌

చాగలమర్రి, ఆగస్టు 13: చాగలమర్రికి చెందిన ఆర్‌కే రామ్‌ పూర్తి పేరు ఆర్‌కే రామలింగారెడ్డి. 1941లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని నాలుగు నెలలు కారగార వాసాన్ని అనుభవించాడు. విడుదలయ్యాక నేరుగా మహాత్మగాంఽధీ సేవాగ్రామ్‌ చేరుకున్నాడు. ఆర్‌కే రామ్‌ సేవలను గురించిన గాంధీ ఎక్కడకు వెళ్లినా రామ్‌ను ఆయన వెంట తీసుకొని వెళ్లేవారు. స్వాతంత్య్ర అనంతరం 1947లో ఆర్‌కే రామ్‌ను ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొని సముచిత గౌరవం ఇచ్చారు.

తిరగబడ్డ తెలుగు బిడ్డ

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్లు (నాటి పేరు తెరణికంటి)కు చెందిన ముత్తుకూరు గౌడప్ప బ్రిటీష్‌ పాలకులపై తిరగబడ్డారు. యుద్ధం చేసి చివరకు పట్టుబడి ఊరి వాకిలికి ఉరి తీయబడ్డారు. రాయలసీమ జిల్లాలో బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చాక ఆదోని (ఆదవేణి) కేంద్రంగా మన్రో పాలన సాగించారు. ఆయన కాలంలో భూమిసిస్తు పెంచారు. దీనిపై చర్చించేందుకు జమాబందీకి రావాలని బ్రిటీష్‌ పాలన గుమాస్తా శ్రీనివాసరావుతో తెర్నేకల్లు రెడ్డి, కరణంకు సమాచారాన్ని పంపారు. ఆదోని కేంద్రంగా పని చేస్తున్న తెల్లదొరల జోక్యాన్ని తెర్నేకల్‌ ప్రజలు జీర్ణించుకోలేదు. ఆ గ్రామ ప్రముఖ పెద్ద ముత్తుకూరు గౌడప్ప బ్రిటీష్‌ పాలకుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. రెడ్డి, కరణంలతో కలిసి గౌడప్ప శ్రీనివాసరావు వద్దకు వెళ్లారు. పన్ను పెంచేది లేదనీ.. పెంచిన పన్ను చెల్లించేదీ కూడా లేదని తెగేసి చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గంజిహల్లె సుంకిరెడ్డి, పెసలిదిన్నె నారప్ప, బైలుప్పల రామిరెడ్డిలు పన్ను చెల్లించాల్సిందే అంటూ ముత్తుకూరు గౌడప్పను ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. దీంతో గౌడప్ప ఆ ముగ్గురిని హతమారుస్తారు. ఈ ఘటనతో బ్రిటీష్‌ సైన్యం కడివెళ్ల దగ్గర మాటు వేసి.. తెర్నేకల్‌ గ్రామంపైకి దాడికి దిగుతుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న గౌడప్ప అనుచరులు, గ్రామస్థులు వడిసెలు, రాళ్లు, వ్యవసాయ పనిముట్లే ఆయుధాలుగా తిరగబడి పోరాటం సాగిస్తారు. చివరకు మందుగుండుతో కోటగోడలు ధ్వంసం చేసి గౌడప్పతో పాటు రెడ్డి, కరణంలను బంధించి ఊరివాకిలికి ఉరి తీశారు.

Updated Date - 2022-08-14T05:37:13+05:30 IST