నందివెలుగురోడ్డు ఆర్‌వోబీకి..మోక్షమెప్పుడు?

ABN , First Publish Date - 2021-08-04T05:37:23+05:30 IST

నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎంతో కీలకమైన నందివెలుగు రోడ్డు ఫ్లైవోవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయి సంవత్సరాలు గడుస్తున్నాయి.

నందివెలుగురోడ్డు ఆర్‌వోబీకి..మోక్షమెప్పుడు?
నిలిచిపోయిన నందివెలుగురోడ్డు ఆర్‌వోబీ

పిల్లర్ల వరకు నిర్మాణం జరిగి నిలిచిపోయిన పనులు

రైల్వే భాగం వరకు బ్రిడ్జీని పూర్తిచేసిన రైల్వే శాఖ

రోడ్డు విస్తరణ, పెండింగ్‌ పని ఎప్పటికి పూర్తయ్యేను?

గుంటూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎంతో కీలకమైన నందివెలుగు రోడ్డు ఫ్లైవోవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయి సంవత్సరాలు గడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా బిల్లులు చెల్లింపులు చేయకపోతుండటంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పిల్లర్ల నిర్మాణం వరకు జరిగి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు నగరాభివృద్ధి ఏ రీతిన కొనసాగుతోందో కళ్లకు కడుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే సమయంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా వేసిన సర్వీసు రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఎక్కడికక్కడ గుంతలతో వాహనదారులు సర్కర్‌ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడేళ్లకు అయినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

గుంటూరు - తెనాలి రైలుమార్గం రెండు వరుసలు కావడంతో రైళ్ల రాకపోకలు ఈ మార్గంలో పెరిగాయి. దాంతో తరచుగా నందివెలుగురోడ్డులో రైల్వేగేటుని మూసేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఇరువైపులా ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమౌతోంది. దీంతో 2017కి ముందే ఇక్కడ ఆర్‌వోబీని రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాలని నిర్ణయించాయి. 120 అడుగులుగా ఇక్కడ రోడ్డు విస్తరణ జరగాల్సి ఉంది. నగరపాలకసంస్థ తన భాగం వరకు ఇరువైపులా డ్రెయిన్లు నిర్మాణం పూర్తి చేసింది. రైల్వేశాఖ కూడా తన పరిధి వరకు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఎటొచ్చి రోడ్లు, భవనాల శాఖ ఆర్‌వోబీ నిర్మాణాన్ని కేవలం పిల్లర్ల వరకే పూర్తి చేసింది. సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇంచుమించు రూ.50 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ ఆర్‌వోబీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు సవరించిన అంచనాలు దాదాపుగా రెట్టింపు అవుతున్నాయి. కాగా బ్రిడ్జి పనులు పునరుద్ధరించకుండా గత వారం, పది రోజుల నుంచి తక్కెళ్లపాడు వైపు నుంచి రోడ్డు విస్తరణ పనిని ఆర్‌ అండ్‌ బీ నిర్వహిస్తోంది. ఎవరైనా తొలుత జనావాసాలు ఉన్న ప్రదేశంలో రోడ్డుని అభివృద్ధి చేసి ఆ తర్వాత నిర్జన ప్రదేశం వైపు దృష్టి సారిస్తారు. ఇక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో ఆర్‌ అండ్‌ బీ శాఖ పనిని చేయిస్తోంది. పనులు జరుగుతున్న తీరు చూస్తే ఈ ఆర్‌వోబీ ఇప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 

 

Updated Date - 2021-08-04T05:37:23+05:30 IST