పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా..?.. మాజీ మహిళా ఎమ్మెల్యేను లాక్కెళ్లిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-05-31T12:04:26+05:30 IST

పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా..?.. మాజీ మహిళా ఎమ్మెల్యేను లాక్కెళ్లిన పోలీసులు..!

పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా..?.. మాజీ మహిళా ఎమ్మెల్యేను లాక్కెళ్లిన పోలీసులు..!

  • న్యాయం కోసం రోడ్డెక్కిన బాధిత కౌన్సిలర్‌పై విరుచుకుపడిన పోలీసులు
  • కౌన్సిలర్‌ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానులో పడేసిన వైనం
  • మాజీ ఎమ్మెల్యే సౌమ్యను లాక్కెళ్లిన పోలీసులు

నందిగామ : తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన టీడీపీ కౌన్సిలర్లపై (Telugudesam) పోలీసులు ప్రతాపం చూపారు. బాధిత కౌన్సిలర్‌ను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వ్యానులో కుక్కారు. ఇదేమని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే సౌమ్యనూ పోలీసు వ్యానులో పడేశారు. ‘మీరు పోలీసులా.. వైసీపీ (YSRCP) కార్యకర్తలా?’ అని సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


నందిగామ కౌన్సిల్‌ సమావేశంలో తనకు అవమానం జరిగిందంటూ కౌన్సిలర్‌ శాఖమూరి స్వర్ణలత చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కో- ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జాఫర్‌ తన ముక్కు, కళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్వర్ణలత తీవ్రంగా స్పందించారు. తనకు క్షమాపణ చెప్పించి జాఫర్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యతో పాటు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. 


సౌమ్యను చూసి ఉద్వేగానికి లోనైన స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. స్వర్ణలతను ఓదార్చిన సౌమ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపైనా, కమిషనర్‌పైనా మండిపడ్డారు. ‘కోఆప్షన్‌ సభ్యుడు అంత బరితెగించి మాట్లాడుతుంటే ఏం చేశారు? మహిళా కౌన్సిలర్లను అవమానించి ఆనందం పొందుతున్నారా?’ సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటుతో కంగుతిన్న ఎమ్మెల్యే తన అసహనాన్ని ఇతరులపై రుద్దతారా? మీరు చేస్తున్న అక్రమాలకు విసిగిపోయి మీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. స్వర్ణలతను అవమానించిన కోఆప్షన్‌ సభ్యుడు తక్షణమే క్షమాపణ చెప్పాలి’ అని సౌమ్య డిమాండ్‌ చేశారు. సిబ్బందిని బయటకు రానివ్వకుండా గేటుమందు పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు మోహరించడంతో కమిషనర్‌ జయరామ్‌ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. 


సీఐ కనకారావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు చేరకున్నారు. టీడీపీ కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి ఆటోల్లో పడేశారు. మహిళా పోలీసులు సౌమ్యతో సహా కౌన్సిలర్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి లోనైనా సౌమ్య.. సీఐ కనకారావుతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు... వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా ఎత్తుకొని వ్యాన్‌లో పడేశారు. ఆ సమయంలోనే స్వర్ణలతను మహిళా పోలీసులు బలవంతంగా ఊడ్చుకురావడాన్ని  చూసిన సౌమ్య తీవ్రంగా ప్రతిఘటించారు. 


బాధితురాలైన ఓ కౌన్సిలర్‌ను అలా తీసుకురావడం ఏమిటని పోలీసులను నిలదీశారు. పోలీసులు సైతం తమ శైలిని మార్చుకోలేదు. మరో మహిళా నాయకురాలు యరగాని కోటేశ్వరమ్మ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించారు.  ఆమె కిందపడినా వదిలిపెట్టకుండా వ్యాన్‌లో పడేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కౌన్సిలర్‌ స్వర్ణలతలతో పాటు పలువురు టీడీపీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసిన సమాచారం తెలుసుకున్న ఉమా హుటాహుటిన నందిగామ చేరుకున్నారు. వారిని పరామర్శించారు.

Updated Date - 2022-05-31T12:04:26+05:30 IST