నంది చెరువును నమిలేస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-07T07:16:33+05:30 IST

అధికార పార్టీ నాయకులు చెరువులనూ వదలట్లేదు. మండల పరిధిలోని శోభనాపురం గ్రామంలో ఉన్న నంది చెరువులో అక్రమ మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు.

నంది చెరువును నమిలేస్తున్నారు

ఆగిరిపల్లి : అధికార పార్టీ నాయకులు చెరువులనూ వదలట్లేదు. మండల పరిధిలోని శోభనాపురం గ్రామంలో ఉన్న నంది చెరువులో అక్రమ మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఎక్స్‌కవేటర్‌తో భారీ ఎత్తున తవ్వకాలు చేసి మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. రాత్రివేళల్లోనే తవ్వకాలు ఎక్కువగా సాగిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 150కి పైగా ట్రక్కుల మట్టిని తరలించారని ఆరోపిస్తున్నారు.


నంది చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అధికార పార్టీకి చెందినవారు ఈ దందాలో సూత్రధారులుగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అయితే, స్థానికులు పదేపదే ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు సంఘటనాస్థలానికి వెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. ‘మీ అధికారులే మట్టి తోలుకోడానికి అనుమతినిచ్చారు. మేము ఆపేది లేదు.’ అంటూ అక్రమార్కులు బదులిస్తున్నారు. ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


తవ్వకాలు ఆపేశారు : ఆగిరిపల్లి తహసీల్దార్‌

ఆగిరిపల్లి తహసీల్దార్‌ వీవీ భరత్‌రెడ్డి వివరణ ఇస్తూ.. ఫిర్యాదు మేరకు సిబ్బందిని పంపగా, వారు వెంటనే తవ్వకాలు ఆపేశారని చెప్పారు. ఎటువంటి తవ్వకాలు చేయకుండా గస్తీ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2020-06-07T07:16:33+05:30 IST