ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్

ABN , First Publish Date - 2022-05-28T06:11:26+05:30 IST

సమాజంలో కొన్నివర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుడి చెంతకుచేర్చే లక్ష్యంతో ‘సమాజమే దేవాలయం...

ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్

సమాజంలో కొన్నివర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుడి చెంతకుచేర్చే లక్ష్యంతో ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో నాలుగు దశాబ్దాల క్రితం నందమూరి తారకరామారావు అమృత హస్తాల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధ్రువతారగా నిలిపిన తెలుగుప్రజల రుణం తీర్చుకోవాలన్న తపన, ఆశయం నుంచి తెలుగుదేశం ఉద్భవించింది. పాలకులు పదవుల కోసం ఢిల్లీయాత్రలు చేస్తూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకులకు పాదాక్రాంతం చేసిన పరిస్థితుల్లో తనను ఆదరించి జీవితంలో ఇంతవాణ్ణి చేసిన రాష్ట్ర ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. రాజకీయ కురువృద్ధుల అంచనాలను తలకిందులు చేస్తూ వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తొమ్మిదినెలల పసిగుడ్డు కూకటి వేళ్ళతో పెకలించి భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రను పునర్లిఖించారు.


నలభైఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు అధికారపక్షంలో, 18ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కష్టసుఖాల్లో మమేకమవుతూ సేవలందిస్తూ వస్తోంది తెలుగుదేశం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్ళు మనగలగడం చిన్న విషయం కాదు. రాజకీయాల్లో జయాపజయాలు రేయింబవళ్ల లాంటివి. అవి ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. దుష్టశక్తుల గ్రహణం తొలగి తెలుగుతేజం దశ, దిశలా వ్యాప్తి చెందాలన్న లక్ష్యంతో కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా తెలుగుదేశం రూపుదిద్దుకొంది. తెలుగువారంతా పచ్చగా వుండాలని, అన్నిరంగాల్లో తెలుగువాడు ముందుండాలన్నది తెలుగుదేశం ఆకాంక్ష, లక్ష్యం. ఎవరు అవునన్నా, కాదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే సమాజంలోని అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. బడుగుల బతుకుల్లో పచ్చదనం నింపి, నిరుపేదల ఆకలి తీర్చి గూడులేని దీన జనులకు నీడనిచ్చింది తెలుగుదేశం పార్టీ. మహోజ్వలంగా మొదలయిన తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. ఈ నలభై ఏళ్లలో ఎన్నో ఎత్తు, పల్లాలు దాటుకొంటూ తన ఉనికిని బలంగా చాటుకొంటూనే వున్నది. ఎన్నడూ ఓటమి నిరాశతో వెనకడుగు వేయలేదు. సంక్షోభం ఎదురైనప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తూనే వుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి తెలుగుప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా రాజీలేని పోరాటం సాగిస్తోంది తెలుగుదేశం.


1982 మార్చి 29న ఆవిర్భావం నుంచి 2022 మార్చి 29నాటికి తెలుగుదేశం స్థాపించి నాలుగు దశాబ్దాలు. ఈ నలభై ఏళ్లలో ఎన్టీఆర్ 13 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడుగా ఉండగా, నారా చంద్రబాబునాయుడు 27 ఏళ్లుగా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 40 ఏళ్లలో 22 ఏళ్ళు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు తొమ్మిది నెలల్లోనే 200 స్థానాలు గెలుచుకొని అధికారపగ్గాలు చేపడుతుందని ఎవరూ ఊహించలేదు. తెలుగుదేశం ఏకపక్ష విజయం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొని తెలుగుప్రజల గళమై 40ఏళ్లుగా అప్రతిహతంగా వెలుగొందుతోంది తెలుగుదేశం. విలక్షణ రాజకీయపక్షంగా తెలుగుదేశాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు అహర్నిశలూ కృషిచేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటికీ ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి, ప్రజలకు తెలుగుదేశం చేసిన మేలు ఏమిటి? తెలుగు ప్రజలవల్ల తెలుగుదేశం లాభపడిందా? తెలుగుదేశం వల్ల తెలుగుప్రజలు లాభపడ్డారా వంటి ప్రశ్నలను పరిశీలిస్తే తెలుగు ప్రజలే ఎంతో ప్రయోజనం పొందారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి.



ఎన్టీఆర్ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఈ రోజు జనంలో ఇంత రాజకీయ చైతన్యం రావడానకి ఎన్టీఆర్ ప్రగతిశీల ఆలోచనలే కారణం. అసలు ప్రజలకు ఏమికావాలో ఆలోచించి దానినే పార్టీ మూల సిద్ధాంతంగా ఆవిష్కరింపజేశారు. పేదవాడికి, కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పాలనసాగించారు. కాలేకడుపుకు పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తనకు కమ్యూనిజం తెలియదని పేదోడి ఆకలితీర్చే హ్యూమనిజం మాత్రమే తెలుసని ఓ విలేఖరి ప్రశ్నకు ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం ఆయనలో మూర్తిభవించిన మానవత్వానికి అద్దంపడుతుంది. దేశంలోనే తొలిసారిగా పేదవాడికి కిలో 2 రూపాయలకే బియ్యం, పక్కాగృహాల నిర్మాణం, జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలుచేశారు ఎన్టీఆర్. దేవుడిచ్చిన భూమికి శిస్తు ఏమిటంటూ రైతులకు భూమిశిస్తు రద్దుచేసిన అసలుసిసలైన సంస్కరణల రూపశిల్పి ఎన్టీఆర్. కనుకనే ఇప్పటికీ పేదప్రజల హృదయాల్లో ఆయన రూపం చిరస్మరణీయంగా వెలుగొందుతోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో వున్నా గత 40ఏళ్లుగా ప్రజలతో మమేకమవుతూ చెక్కుచెదరని విశ్వసనీయతతో తెలుగుప్రజల అభిమానాన్ని చూరగొంటోంది తెలుగుదేశం.


తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల చరిత్రాత్మక ప్రస్థానాన్ని రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశంలో తొలిదశ ఎన్టీఆర్ శకమైతే మలిదశ నారా చంద్రబాబు నాయుడిది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కృషిచేస్తే చంద్రబాబునాయుడు తెలుగుప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు నిరంతరం శ్రమించారు. నలభై ఏళ్ల మజిలీలో 27 ఏళ్ళ అధ్యాయం చంద్రబాబునాయుడుదే. అందులో 14 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కించారు. ప్రపంచంలో ఐటి విప్లవం రాగానే దూరదృష్టితో చంద్రబాబు ఐటిని హైదరాబాద్‌కు తెచ్చి తెలుగుజాతికి ఐటిని పరిచయం చేసి సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దారు. దాని ఫలితంగానే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పేద రైతుల పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తూ సంపదను జన్మభూమికి చేరవేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. నేటిరోజుల్లో గాలి, నీరు తర్వాత విద్యుత్ రంగం అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించిన చంద్రబాబునాయుడు రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు కృషిచేశారు. 2014లో తాను అధికారం చేపట్టేనాటికి లోటు విద్యుత్‌తో చీకట్లు నిండిన విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికాబద్ధంగా విద్యుదుత్పత్తికి కృషిచేశారు. అయిదేళ్లలో 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి ఎపిని 24గంటల విద్యుత్ అందించే ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబునాయుడుదే.


దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడలేక దారి తెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేసి జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ సంకీర్ణాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా తెలుగుదేశానిదే. దేశ రాజకీయ చరిత్రలో పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం రికార్డు సృష్టించింది. అబ్దుల్ కలామ్, కెఆర్ నారాయణన్ వంటి వారిని రాష్ట్రపతులుగా, ఐకె గుజ్రాల్, దేవెగౌడలను ప్రధానులుగా ఎన్నిక కావడంలో కీలక భూమిక వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగింది. జాతీయ స్థాయిలో తమ పరపతిని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసి పలు ప్రాజెక్ట్‌లను రాబట్టగలిగింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో చంద్రబాబు నాటిన భారత్ బయోటెక్ అనే మొక్క ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఎదిగి యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికీ వ్యాక్సిన్ పరిచయం చేయడం యావత్ తెలుగుజాతికే గర్వకారణం.


వినూత్న ఆలోచనలు, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతరం శ్రమించింది తెలుగుదేశం పార్టీ. నలభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ తరుణంలో ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం అయితే కలలు కన్నారో వాటిని సాకారం చేయడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో నేడు నెలకొన్న అవాంఛనీయ, సంక్షోభ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఒక చారిత్రక అవసరం. ఈ నలభై ఏళ్ల వేడుకతో మరోసారి తెలుగోడి సత్తా చాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం మరో పోరాటానికి పసుపు సైనికులు కార్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది.


తొండపు దశరధ జనార్దన్

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

(నేటి నుంచీ తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభం)

Updated Date - 2022-05-28T06:11:26+05:30 IST