హిందూపురంలో యువకుడిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

ABN , First Publish Date - 2021-03-06T20:58:22+05:30 IST

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

హిందూపురంలో యువకుడిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురంలోని శ్రీకంఠపురంలో 9వ వార్డు అభ్యర్థితో ఎన్నికల ప్రచారం గురించి బాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. అది గమనించిన బాలకృష్ణ ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు వినకుండా వీడియో తీస్తూ ఉండడంతో బాలకృష్ణ కోపోద్రిక్తుడై ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలు ఈ వీడియోను ట్రోల్ చేస్తూ బాలకృష్ణ గతంలో కూడా ఒకట్రెండు సార్లు అభిమానులపై చేయి చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.


పురంలో ముమ్మర ప్రచారం

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజులుగా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో ఇంటింటికీ తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ పాలనలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని, పురానికి తాగు నీళ్లు తీసుకొచ్చింది తమ పార్టీయేనని చెబుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Updated Date - 2021-03-06T20:58:22+05:30 IST