కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి

ABN , First Publish Date - 2022-07-01T06:30:14+05:30 IST

పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామానికి చెందిన ముత్తమల్ల శంకరయ్య తొమ్మిది రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉండగా గురువారం బందీగా ఉన్న శంకరయ్య ఫొటోను కిడ్నాపర్లు అతని కుటుంబ సభ్యులకు పంపించారు

కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి
కిడ్నాపర్ల చెరలో ఉన్న శంకరయ్య

- ఫొటో విడుదల చేసిన కిడ్నాపర్లు

- రూ. 15 లక్షలు డిమాండ్‌

పెగడపల్లి, జూన్‌ 30: పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామానికి చెందిన ముత్తమల్ల శంకరయ్య తొమ్మిది రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉండగా గురువారం బందీగా ఉన్న శంకరయ్య ఫొటోను కిడ్నాపర్లు అతని కుటుంబ సభ్యులకు పంపించారు. బతుకుదెరువు కోసం దుబాయి వెల్లి స్వగ్రామానికి తిరిగివస్తూ ఈ నెల 22న ముంబాయి ఏయిర్‌పోర్టులో కిడ్నాప్‌నకు గురైన విషయం విదితమే. కాగా కిడ్నాప్‌ చేసిన నాలుగు రోజుల తర్వాత శంకరయ్య కిడ్నాపైన విషయం కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలవగా, శంకరయ్య కుమారుడు హరీష్‌ ముంబాయి వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.  అప్పటి నుంచి మూడు నాలుగు సార్లు ఫోన్‌ చేసి రూ. 15 లక్షలు ఇస్తేనే శంకరయ్య ఇంటికి చేరుతాడంటూ చెప్పిన కిడ్నాపర్లు గురువారం శంకరయ్యను బందించిన ఫొటోను సైతం అతని కుమారుడు హరీష్‌ ఫోన్‌కు పంపి త్వరగా రూ. 15 లక్షలు పంపించాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఫోన్‌ చేసి చెప్పినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.  తాము రూ. 15 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. కాగా కిడ్నాపర్లు తాళ్లతో బందించి ఉన్న శంకరయ్య ఫొటోను పంపించగా ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయం ఆయన కుటుంబ సభ్యుల ముఖాల్లో కనిపిస్తుంది. నిరుపేద కుటుంబానికి చెందిన తన భర్తను విడిపించి, ఇంటికి తెప్పించాలని బుదవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలసి మొరపెట్టుకున్నానని, ప్రభుత్వం తన భర్తను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని శంకరయ్య భార్య అంజవ్వ, కుమారుడు హరీష్‌, కూతురు గౌతమి వేడుకుంటున్నారు. 


Updated Date - 2022-07-01T06:30:14+05:30 IST