నరకం చూస్తున్న నాన్‌ కొవిడ్‌ రోగులు

ABN , First Publish Date - 2020-08-09T11:43:09+05:30 IST

వానలు పడుతున్నాయి. నీళ్ళు నిలుస్తున్నాయి. దోమలు పెరుగుతున్నాయి.

నరకం చూస్తున్న నాన్‌ కొవిడ్‌ రోగులు

 వైద్యం అందక అకాల మరణాలు

అంత్యక్రియలకూ గోవిందధామంలో నో ఎంట్రీ


 తిరుపతి నగరంలో టీడీపీలో క్రియాశీలంగా ఉండే గోవిందకృష్ణయ్య (74)కు శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే సీమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. వెంటిలేటర్‌ ఉండే ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పారు. ఆ తర్వాత తిరుపతిలో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న దాదాపు అన్ని ఆసుపత్రులకూ కారులో తిరిగారు. పోయినచోటల్లా రిపోర్టులు అటూఇటూ తిప్పి వెంటిలేటర్‌ లేదని చెప్పి పంపించేశారు.


ఒక దగ్గర మాత్రం చెస్ట్‌ సిటీ స్కాన్‌ తీసి నిమోనియా ఎక్కువగా ఉందని, తమ దగ్గర అందరూ కొవిడ్‌ బాధితులే ఉన్నందున వేరే ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు.  స్విమ్స్‌, రుయా లకు పరుగులు తీశారు. వెంటిలేటర్లు, పడకలు ఖాళీలేవని చెప్పారు. ఈ తిరుగుడులోనే అర్థరాత్రి దాటింది. 1.30గంటలు ప్రాంతంలో కారులోనే నీరసంగా వాలిపోయిన గోవిందయ్య కన్నుమూశారు. ఆయన కోవిడ్‌ బాధితుడు కాదు. కోవిడ్‌ సోకనివారు అనారోగ్యానికి గురైతే పరిస్థితి ఏమిటో ఈ సంఘటన అద్దం పడుతోంది. 


తిరుపతి-ఆంధ్రజ్యోతి :వానలు పడుతున్నాయి. నీళ్ళు నిలుస్తున్నాయి. దోమలు పెరుగుతున్నాయి. జలుబులు, జ్వరాలూ విపరీతంగా వచ్చే కాలం ఇది. ఏది కరోనానో ఏది సాధారణ జలుబో తెలియని పరిస్తితి. విరేచినాలో, కడుపునొప్పో, ఒళ్ళు నొప్పులో అనిపిస్తే చూసే ఆసుపత్రే తిరుపతి నగరంలో కరువైంది. స్విమ్స్‌, రుయా ఓపీలు కూడా రద్దు చేసేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు ప్రయివేటు డాక్టర్లూ చూడక, అటు ప్రభుత్వాసుపత్రులూ పట్టించుకోకపోతే చిన్న సమస్యలు కూడా మరణాలకు దారితీస్తాయనే ఆందోళన పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారబోతోంది. ప్రయివేటు వైద్యులందరూ కూడా ఇక ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందించాలని అధికారులు ఆదేశించారు. వీరు 15 రోజులు కొవిడ్‌ వైద్యసేవలు అందించి, 15 రోజులు క్వారంటైన్‌ లో ఉండాలని శనివారం జరిగిన సమావేశంలో అఽధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ఇప్పటి వరకు కన్ను, పంటి వైద్యం, చెవి ముక్కు వైద్య, న్యూరాలజీ వంటి వాటికి ప్రయివేటు ఓ.పిలో అయినా సేవలు అందుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇక ఆ ఓ.పిలు కూడా మూతబడే ప్రమాదం ఉంది.  గుండె పోటు వచ్చినా, పక్షవాతం వచ్చినా, కిడ్నీ సమస్యలు తీవ్రమైనా, లివర్‌ సమస్యలు, గ్యాస్ర్టో ఎంట్రాలజీ సమస్యలు  వచ్చినా  ఆదుకునేవారే లేకుండా అయిపోతారు. స్విమ్స్‌, రుయా క్యాజువాలిటీ విభాగాలు తెరిచే ఉంటున్నా వాటి మీద విపరీతమైన ఒత్తిడి ఉంది.  తక్షణం సిమ్స్‌, రుయా ఓపీలు ప్రారంభించకపోతే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కోవిడ్‌ బాధితులైతే తప్ప ప్రయివేటు ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు. కోవిడ్‌ నెగటివ్‌ అని సర్టిఫికేట్‌ పట్టుకెళ్తే తప్ప ప్రయివేటు ఆసుపత్రులు గడప తొక్కనివ్వవు. టెస్ట్‌ చేసుకున్నా రిపోర్టు రావడానికి చాలా రోజులే పడుతున్న కాలంలో సాధారణ అనారోగ్యంతో వచ్చే వారి పరిస్థితే అయోమయంగా ఉంది. సమన్వయకమిటీ ఈ అంశాన్ని కూడా పరిశీలించి తగిన సూచనలు చేయాల్సి ఉంది. 


 గోవిందధామంలోనూ నో ఎంట్రీ

బతికి ఉన్నపుడు అనారోగ్యమే కాదు, సాధారణ సమస్యలతో మరణించినవారి పరిస్థితి కూడా దిక్కుతోచని స్థితిలోనే ఉంది. కొవిడ్‌ మృతులు పెరుగుతన్న నేపథ్యంలో గోవిందధామంలో సాధారణ మృతుల భౌతికకాయాలకు అనుమతి లేకుండాపోయింది. ఆ దిశగా అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో నగరంలోని పలు స్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు పూర్తిచేసేస్తున్నారు. 

Updated Date - 2020-08-09T11:43:09+05:30 IST