ఒక్క పాటతో చరితార్థుడైన కళాకారుడు రాచపల్లి ప్రభు

ABN , First Publish Date - 2020-06-26T08:30:33+05:30 IST

1970 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది వేదికలను ఉర్రూతలూగించిన గీతం ‘‘నాంపల్లి టేసను కాడి రాజాలింగో... రాజాలింగా’’...

ఒక్క పాటతో చరితార్థుడైన కళాకారుడు రాచపల్లి ప్రభు

రాచపల్లి ప్రభు వేములవాడ జాతరపాట బాణీలో అల్లిన గీతం ‘నాంపల్లి టేసను కాడి...’ విశేష జనాదరణ పొందింది. ప్రజానాట్య మండలి కళాకారుల ద్వారా విస్తృత ప్రచారాన్ని పొందిన ఈ గీతాన్ని రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో ఎస్‌.పి.శైలజతో పాడించారు. తెలుగు చలన చిత్ర గీతాల్లో వంద ఉత్తమ గీతాలను ఎంపిక చేయవలసి వస్తే, ఆ జాబితాలో తప్పకుండా ఈ పాటకు చోటు దక్కుతుంది.


నివాళి : రాచపల్లి ప్రభు

1970 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది వేదికలను ఉర్రూతలూగించిన గీతం ‘‘నాంపల్లి టేసను కాడి రాజాలింగో... రాజాలింగా’’. ఈ పాటను రాసిన ప్రజా కళాకారుడు రాచపల్లి ప్రభు వారంరోజుల క్రితం జూన్‌ 16న తెల్లవారుఝామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. అతను మౌలికంగా జానపద గాయకుడు, నటుడు. 1975 వేసవిలో ఖమ్మం పట్టణంలో రెండు వారాలపాటు జరిగిన ప్రజా నాట్యమండలి రచయితల, కళాకారుల శిక్షణాశిబిరంలో మాతోపాటు పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి చరిత్రలో ఖమ్మం శిక్షణా శిబిరం ఒక మైలు రాయి. సుప్రసిద్ధ సినీ నటీనటులు, సినీ సంగీత దర్శకులు, రంగ స్థల కళాకారులు, బుర్రకథకులు, జానపద గాయనీగాయకులు, కవులు, నాటక రచయితలు ఈ శిక్షణా శిబిరంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. ప్రముఖ అభ్యుదయ కవులు గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి కవులను పర్యవేక్షించారు. రక్తకన్నీరు నాగభూషణం, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి నటీనటులకు మార్గనిర్దేశం చేశారు. కోగంటి గోపాల కృష్ణయ్య బుర్రకథలకు శిక్షణ నిచ్చారు. సి. మోహన్‌దాస్‌ సంగీత దర్శకత్వం వహించారు.


ఆనాటి శిక్షణా శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు రాచపల్లి ప్రభు. వేములవాడ జాతరపాట బాణీలో అల్లిన గీతం ‘నాంపల్లి టేసనుకాడి...’ విశేష జనాదరణ పొందింది. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను ప్రజల భాషలో, ప్రజల బాణీలో వ్యక్తం చేసిన ఈ గీతం, ప్రజల ఆదరణతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, తమ్మారెడ్డి సత్యనారాయణ తదితరుల ప్రశంసలు పొందింది.


డెబ్భై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ పాతనగరంలోని శాలిబండలో శ్రీమతి శాంతాదేవి, శ్రీ రాచపల్లి బాలయ్య దంపతులకు పుట్టిన బాలుడు ప్రభు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లి సంరక్షణలోనే పెరిగాడు. ఆమె తిలక్‌రోడ్డులో ఉన్న మనోరంజితం బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ కొడుకును అల్లారుముద్దుగా పెంచింది. వారు చాలాకాలం పాటు శాలిబండలోనే నివసించారు. తల్లీ, కొడుకులిద్దరూ స్నేహితులుగా సరదాగా ఉండడాన్ని ప్రభు బాల్యమిత్రుడిగా నేను కళ్లారా చూశాను. హైదరాబాద్‌ పాతనగరంలోనే మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసిన ప్రభు, కేంద్ర సాంకేతిక శిక్షణా కళాశాల నుండి మోటార్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందాడు. హైదరాబాద్‌ పేట్ల బురుజులోని పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో మోటారు మెకానిక్‌గా ఉద్యోగం లభించింది. పోలీస్‌ శాఖలో వృత్తి, జానపద సంగీతం ప్రవృత్తిగా కొనసాగించాడు. నేను రాసిన ‘యాడికెల్లి దెత్తునే-యాభైరూపాయలు’, ‘అంబ రావే జగదంబ రావే’, ‘సూస్కో-బాయ్‌స్కోప్‌ బొమ్ముంది-సూస్కో’ పాటలకు బాణీలను సమకూర్చాడు. గజ్జెల మల్లారెడ్డి ప్రఖ్యాతగీతం ‘మారిపోతుందోయ్‌ కాలం, మారిపోతుంది’ గీతానికి బాణీని సమకూర్చడమే కాదు, పల్లవిని అందించింది కూడా ఆర్‌.ప్రభు. రాష్ట్ర వ్యాపితంగా ప్రజానాట్య మండలి కళాకారుల ద్వారా విస్తృత ప్రచారాన్ని పొందిన ‘నాంపల్లి టేసనుకాడి రాజాలింగో...’ గీతాన్ని రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో ఎస్‌.పి.శైలజతో పాడించారు. శైలజ సినీ జీవిత ప్రస్థానంలో ఇదే తొలిగీతం. అప్పటికే ప్రజల్లో ప్రఖ్యాతమైన ‘నాంపల్లి టేసన్‌’ గీతం ఈ చలన చిత్రం ద్వారా మరింత ప్రాచుర్యం పొందింది. తెలుగు చలన చిత్ర గీతాల్లో వంద ఉత్తమ గీతాలను ఎంపిక చేయవలసి వస్తే, ఆ జాబితాలో తప్పకుండా ఈ పాటకు చోటు దక్కుతుంది. 


ప్రభు ‘రెండురెళ్ళు ఆరు’, ‘ఊబి’ మొదలైన నాటకాల్లో ప్రముఖ పాత్రలను పోషించి, ‘శివా లయ్య’ నృత్యరూపకంలో నటించాడు. జానపద గాయకుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. ప్రజావేదికలపై బలమైన గళగర్జనలు వినిపిస్తున్న ఈ ప్రజాకారుడిని, ఎమర్జెన్సీ రోజుల్లో అతను పనిచేస్తున్న సంస్థ ఉన్నతాధికారి పిలిచి ‘పోలీస్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక గీతాలు పాడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇది కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కి విరుద్ధం కాబట్టి పని కావాలో? పాటకావాలో? నిర్ణయించుకొమ్మ’ని హెచ్చరించాడు. ఇంట్లో ఒక్కడే కొడుకు; ఉద్యోగం మానేసి, పాటను నమ్ముకుని బతకడం కష్టసాధ్యమని భావించిన ఒక గొప్ప కళాకారుడు అప్ప ట్నించి పాటను వదిలేసి, మోటారు మెకానిక్‌గా సీదా సాదా జీవితం గడిపాడు. పన్నెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. ఒకేఒక్క పాటతో చరితార్థుడైన ఆర్‌.ప్రభు మరణం పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నాను.

ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

Updated Date - 2020-06-26T08:30:33+05:30 IST