నామ్‌కేవాస్తేగా.!

ABN , First Publish Date - 2021-08-04T04:15:12+05:30 IST

మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన జిల్లా పరిషత్‌ సమావేశం ఈ సారి నామమాత్రంగానే ముగిసింది. మంగళవారం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం 1.30 వరకు మాత్రమే కొనసాగింది. రెండున్నర గంటల్లోనే జడ్పీ భేటీని ముగించేశారు.

నామ్‌కేవాస్తేగా.!

రెండున్నర గంటల్లోనే ముగిసిన జడ్పీ సర్వసభ్య సమావేశం

ఏడు శాఖలపై తూతూ మంత్రంగా చర్చ

హాజరైన ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి గైర్హాజరు


సిద్దిపేట అర్బన్‌, ఆగస్టు 3 : మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన జిల్లా పరిషత్‌ సమావేశం ఈ సారి నామమాత్రంగానే ముగిసింది. మంగళవారం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం 1.30 వరకు మాత్రమే కొనసాగింది. రెండున్నర గంటల్లోనే జడ్పీ భేటీని ముగించేశారు. ఒక్క దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీ్‌షకుమార్‌, ముత్తిరెడ్డి, రసమయి బాలకిషన్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ తదితరులు గైర్హాజరయ్యారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర సభ్యులు, ఆయా శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


44 అంశాల్లో ఏడింటిపైనే చర్చ

జడ్పీ సమావేశం అజెండాలో 44 అంశాలను పొందుపర్చగా అందులో ఏడింటిపై మాత్రమే  తూతూ మంత్రంగా చర్చను నిర్వహించారు. వ్యవసాయ, వైద్య, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, గ్రామీణ అభివృద్ధి, ఉపాధిహామీ, హార్టికల్చర్‌ శాఖలపై చర్చ కొనసాగింది. సమావేశం జరిగిన ప్రతిసారీ అవే శాఖలపై సమీక్షను నిర్వహిస్తున్నారని, ఇతర శాఖలను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖకు సంబంధించి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు గౌరవ వృత్తిలో ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కచ్చితంగా ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అన్న ప్రజాప్రతినిధుల డిమాండ్‌కు కలెక్టర్‌ కలగజేసుకుని అలాంటి నిబంధన ప్రభుత్వంలో ఏమి లేదని  తెలిపారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేం అని చెప్పారు. మద్దూరు కాంగ్రెస్‌ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ తన మండలంలో ఉన్న హాస్టల్‌ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, కొత్తగా ఒక పాఠశాల గదిని కూడా నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


అధికారుల తీరుపై రఘునందన్‌రావు ఆగ్రహం

జిల్లా అధికారుల తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. దుబ్బాక అభివృద్ధి విషయంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఇంతవరకు ఒక్క డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా ప్రారంభించలేదని ఇది చాలా దురదృష్టకర విషయమని అన్నారు. ప్రభుత్వ టీచర్లకు బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కొంతమంది అధికారుల తీరు విసుగు తెప్పిస్తుందని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్షా సమావేశాలు నిర్వహించి మంత్రి ఆదేశించినా కూడా అధికారులు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కొంతమంది అధికారులు అయితే ఏకంగా తమ పనులతో స్థానిక మంత్రిని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. మంత్రి చెప్పినా వినకుండా కొంతమంది అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ జడ్పీటీసీ, ఎంపీపీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.


సమన్వయంతో ముందుకెళ్లాలి : కలెక్టర్‌ 

అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సమన్వయంతో ముందుకెళ్లి అభివృద్ధి వైపు పయనించాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సూచించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఆధీనంలో ఉన్న పనులను తప్పకుండా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ ఉద్యోగి ఆ శాఖకు న్యాయం చేసేలా పనిచేయాలని సూచించారు. 


ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

జిల్లాలో 50 వేల ఎకరాల ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి అనుమతులు వచ్చాయని ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకుని రైతులకు అవగాహన కల్పించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ సూచించారు. ప్రజాప్రతినిధులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దకు వెళ్లి వాటి లాభాలు గురించి రైతులకు వివరించాలని సూచించారు. జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-08-04T04:15:12+05:30 IST