నామినేషన్లు స్వీకరించాలా వద్దా!

ABN , First Publish Date - 2021-01-25T07:11:50+05:30 IST

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ ప్రక్రియను వేగ వంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఆచితూచి అడుగేస్తోంది. అంతిమంగా సుప్రీం ఉత్తర్వుల కోసం ఎదురు చూపులు చూస్తోంది.

నామినేషన్లు స్వీకరించాలా వద్దా!
బండారులంక గ్రామ సచివాలయం వద్ద ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి జగన్‌ ముఖచిత్రం కనిపించకుండా పేపర్లు అతికించిన దృశ్యం

నేటి నుంచి తొలి విడత పంచాయతీ నామినేషన్లు

273 పంచాయతీలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు

అయోమయంలో అభ్యర్థులు.. ఉద్యోగులు

ఎన్నికల కమిషన్‌ విడుదలచేసిన నోటిఫికేషన్‌ దృష్ట్యా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. అయితే పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు వెలువరించే నిర్ణయం కోసం అటు ప్రభుత్వం, ఇటు రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. సోమవారం నామినేషన్లు స్వీకరించాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్న డివిజన్‌ పరిధిలోని స్టేజ్‌-1 అధికారులు కలెక్టర్‌ నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఏ పంచాయతీలకు ఎక్కడ నామినేషన్లు స్వీకరిస్తారనే అంశం తెలియక సర్పంచ్‌, వార్డు  సభ్యుల పదవుల కోసం నామినేషన్లు వేసే అభ్యర్థులు అయోమయానికి గురికావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు అన్ని పార్టీలు సర్పంచ్‌ అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యాయి. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ ప్రక్రియను వేగ వంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఆచితూచి అడుగేస్తోంది. అంతిమంగా సుప్రీం ఉత్తర్వుల కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఫలితంగా తొలి విడత ఎన్నికలు జరిగే అమలాపురం డివిజన్‌లోని ఉద్యోగులు, రాజకీయ పార్టీల్లో కింత అయోమయ పరిస్థితి నెలకొంది. డివిజన్‌ పరిధిలోని పదహారు మండలాల్లో 273 పంచాయతీల్లో 3,142 మంది వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలకు సంబంధించి సోమ వారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. ఉద యం 10 గంటల నుంచి నామినేషన్లను ఆయా పంచాయ తీలకు నియమితులైన స్టేజ్‌-1 అధికారులు స్వీకరించాల్సి ఉంది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న స్టేజ్‌-1 అధికారులు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమ ఏర్పాట్లను సిద్ధం చేసుకుని ఉన్నప్పటికీ కొన్నిచోట్ల ఉద్యోగులు పట్టీపట్టనట్టు సుప్రీం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నామి నేషన్లు స్వీకరించాలో లేదో అనే అంశం జిల్లా కలెక్టర్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని వివిధ మండలాలకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ని కలు వస్తున్నాయంటే రేయింబవళ్లు పనిచేయాల్సిన మండల పరిషత్‌, పంచాయతీ కార్యాలయాలు ఆదివారం రోజున ఎక్కడా తాళాలు తీసిన దాఖ లాలు లేవంటే ఎన్నికల విధుల పట్ల అధికారులు అనుసరిస్తున్న వ్యూహం అనేక అను మానాలకు తావిస్తోంది. ఇంతవరకు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎక్కడ ఏఏ పంచాయతీల్లో స్వీకరిస్తారు. ఏ అధికారికి నామినేషన్లు అందజేయాలనే స్పష్టత కూడా లేక పోవడంతో ఏర్పాట్లు చేయలేదు. వాస్తవానికి ఎన్నికల అధికారులు నామినేషన్ల స్వీకరణ కు ముందురోజే ట్రయిల్‌రన్‌ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉన్నప్పటికీ అమలా పురం డివిజన్‌లో ఆ పరిస్థితి ఎక్కడా కానరాలేదు. ఉన్నతాధికారులు సైతం ఏర్పాట్లపై మౌనం వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా సచివాలయాలు, పంచాయతీల్లో ప్రచార బోర్డులపై ఉన్న ముఖ్యమంత్రి చిత్రపటాలపై పేపర్లు అతికించి కోడ్‌ అమలుచేస్తున్నారు. కోడ్‌ అమలుచేస్తున్న అధికారుల్లో కూడా ఆందోళన లేకపోలేదు. 

రాజకీయ పార్టీలు సన్నద్ధం..

పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టానికి కోనసీమలోని వివిధ రాజకీయపార్టీలు సన్నద్ధమ వుతున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇస్తే అప్పటికప్పుడు హడా వుడిగా అభ్యర్థులను ఎంపిక చేయడం ఇబ్బందికరంగా మారే పరిస్థితుల నేపథ్యంలో అధికార వైసీపీ సహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్టీల నాయకులు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రాతినిధ్యం వహించే అమలాపురం నియోజకవర్గంలో సర్పంచ్‌ అభ్యర్థులపై వైసీపీ నాయకులు దృష్టి పెట్టారు. గ్రామానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులు పేర్లను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల అన్వేషణలో ఉన్నారు. 




Updated Date - 2021-01-25T07:11:50+05:30 IST