పేరుకే.. 24 గంటలు అందని సేవలు

ABN , First Publish Date - 2022-08-18T06:25:47+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ప్రసూతి సేవలు అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు.

పేరుకే.. 24 గంటలు అందని సేవలు

 - అన్ని ఆసుపత్రుల్లోనూ డాక్టర్ల కొరత

- ప్రసవాల కోసం జిల్లా కేంద్రానికి..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ప్రసూతి సేవలు అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. డాక్టర్లు, నర్సుల కొరత, స్థానికంగా నివాసం ఉండని సిబ్బంది కారణంగా మహిళలకు ఆశించిన వైద్య సేవలు అందడం లేదు. దీంతో మహిళలు ప్రసవాల కోసం జిల్లా కేంద్రానికి, పట్టణాలకు వెళ్లాల్సి వస్తున్నది. జిల్లాలో 18 పీహెచ్‌సీలు, ఆరు అర్బన్‌ పీహెచ్‌సీలు, హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల మహిళలు ప్రసవం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రైనా వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు 24 గంటలపాటు పనిచేసే ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. 


 ఏడు పీహెచ్‌సీల్లో..


జిల్లాలోని  గంగాధర, శంకరపట్నం, వీణవంక మండలం చల్లూరు, వీణవంక, రామడుగు మండలం గుండి, మానకొండూర్‌ మండలం వెల్ది, జమ్మికుంట మండలం వావిలాల పీహెచ్‌సీల్లో 24 గంటలపాటు ప్రసూతి వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. మొదట ఈ పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులను అందుబాటులో ఉంచాలని, ఒక డాక్టర్‌ డ్యూటీలో ఉంటూ మరో డాక్టరు ఆన్‌కాల్‌పై అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. ముగ్గురు స్టాఫ్‌ నర్సుల్లో ఒక నర్సు, ఒక వాచ్‌మన్‌ నైట్‌ డ్యూటీలో ఉండేలా జాబ్‌ చార్ట్‌ ఏర్పాటు చేశారు. 


 స్థానికంగా ఉండని వైద్యులు


ఈ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఎవరైనా పీహెచ్‌సీకి ఏడు కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండేందుకు వీలు కల్పించారు. రాత్రిపూటగాని, ఇతర సమయాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే 10 నిమిషాల్లో డాక్టర్‌, నర్సు ప్రసవాల కోసం వచ్చిన వారికి సేవలందించేందుకు ఆసుపత్రికి చేరేలా ఈ నిబంధనను విధించారు. చాలామంది డాక్టర్లు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ ఆసుపత్రులకు వెళ్లి డ్యూటీలు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు వారు ప్రయత్నించాల్సి ఉండగా రాత్రిపూట సేవలందించడం కష్టమవుతుందనే కారణంతో సాధారణ ప్రసవాలను అంతగా ప్రోత్సహించడం లేదు. ఆపరేషన్లతో డెలివరీ అయ్యే కేసులను మాతా శిశు సంరక్షణ కేంద్రానికి సిఫారసు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 


 పీహెచ్‌సీల్లో ఇదీ పరిస్థితి


అన్ని పీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. మొదట ఇద్దరు డాక్టర్లను నియమించాలనుకున్నా ఆ తర్వాత ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక ఫార్మసిస్టు, వాచ్‌మెన్‌ను నియమించాలని నిర్ణయించారు. అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. ఇటీవల పీజీ చేసిన డాక్టర్లందరినీ జిల్లా ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రులకు తీసుకోవడంతో పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత ఏర్పడింది.

- వీణవంక మండలం చల్లూరు పీహెచ్‌సీలో ముగ్గురు డాక్టర్లకుగాను ఒక డాక్టర్‌, నలుగురు స్టాఫ్‌ నర్సులకుగాను ఒక నర్సు మాత్రమే అందుబాటులో ఉన్నారు. 

- జమ్మికుంట మండలం వావిలాల పీహెచ్‌సీలో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు పనిచేస్తున్నారు. 

- శంకరపట్నం పీహెచ్‌సీలో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు మాత్రమే పనిచేస్తూ రాత్రివేళల్లో ఫోన్‌కాల్‌ ద్వారా వచ్చి సేవలందిస్తున్నారు. 

- గంగాధర పీహెచ్‌సీలో ఒక డాక్టరే సేవలందిస్తున్నాడు. మరొకరు ఉన్నా నెల రోజులుగా సెలవుపై వెళ్లారు. 

- మానకొండూర్‌ మండలం వెల్ది పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు పనిచేస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడం లేదు. 

- వీణవంక పీహెచ్‌సీలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సమయంలో ముగ్గురు డాక్టర్లను డిప్యూటేషన్‌పై వేసి సేవలందించారు. అనంతరం ఆ డాక్టర్ల డిప్యూటేషన్‌ రద్దు కావడంతో ప్రస్తుతం ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 

- రామడుగు మండలం గుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే డాక్టర్‌ ఉన్నారు. 


రాత్రి పూట ఇబ్బందులు


అన్ని ఆసుపత్రుల్లోనూ ఒక డాక్టర్‌, ఒకే నర్సు పనిచేస్తున్న కారణంగా రాత్రిపూట డ్యూటీలో ఉండే పరిస్థితి లేదు. రాత్రిపూట మహిళలు ఎవరైనా ప్రసవ వేదన పడితే ఫోన్‌కాల్‌తో వచ్చి సేవలందించడానికి కూడా వీలు లేని పరిస్థితులున్నాయి. డాక్టర్లందరు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కారణంగా వైద్య సేవలు అందక 24 గంటలపాటు పనిచేసే పీహెచ్‌సీల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. పూర్తిస్థాయిలో డాక్టర్లను, స్టాఫ్‌ నర్సులను, ఇతర సిబ్బందిని నియమించి గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రసూతి సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-18T06:25:47+05:30 IST