ఆగిన కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-04-09T11:38:44+05:30 IST

రైస్‌ మిల్లులు ఓవైపు సీఎంఆర్‌ రైస్‌, మరో వైపు వరి ధాన్యంతో కిటకిటలాడిపోతున్నాయి. క్రష్‌ చేసిన

ఆగిన  కొనుగోళ్లు

గోదాముల్లో పేరుకున్న ధాన్యం నిల్వలు

మిల్లుల్లో సీఎంఆర్‌ బియ్యం స్టాక్‌

స్థలాభావం వల్లే జరగని సేకరణ

రోడ్లపైనే రూ. 50 కోట్ల విలువైన వడ్డరాశులు 

వర్షం వస్తే నిలువునా మునగనున్న రైతులు

మంత్రులూ.. కాస్త పట్టించుకుంటారా ?


 నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఉన్న కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాము వద్ద 46 ట్రక్కులు..  వేదాయపాళెం గోదాము వద్ద 66 ట్రక్కులు.. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గోదాము వద్ద 76 ట్రక్కుల బియ్యం లోడ్లు దించుకునేవారు లేక వారం రోజులుగా ఎదురుచూస్తున్నాయి. కస్టమర్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కొనుగోళ్లలో ప్రభుత్వం చేతులెత్తేసిందనడా నికి ఇవే ఉదాహరణ. 


 జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కారణం మిల్లుల్లో ఖాళీ లేదు. వారి వద్ద సుమారు 10వేల టన్నుల సీఎంఆర్‌ బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ఓ లోడ్‌ బియ్యం పంపితే అది అన్‌లోడ్‌ కావడానికి వారం పడుతోంది. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఎక్కడ చూసినా రోడ్ల మీద ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి.  సుమారు రూ. 50 కోట్ల విలువైన ధాన్యం ఇలా రోడ్లు పాలయ్యింది.  రెండు రోజులుగా మబ్బులు దోబూచులాడుతున్నాయి. ఒకవేళ వర్షం రైతులు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది. ధాన్యం సేకరణ మొదలైన రోజు నుంచి అధికారులు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు కాని కోనుగోళ్లలో మాత్రం ప్రగతి సాధించలేకపోయారు. సాధారణంగా ప్రతి ఏటా 2లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారు. ఈసారి ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామన్నారు. కాని ఇప్పటికి 1.30 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ మాత్రానికే  వారు ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన ధాన్యం  సంగతేమిటో  అంతుబట్టడం లేదు.


నెల్లూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైస్‌ మిల్లులు ఓవైపు సీఎంఆర్‌ రైస్‌, మరో వైపు వరి ధాన్యంతో కిటకిటలాడిపోతున్నాయి. క్రష్‌ చేసిన సీఎంఆర్‌ రైస్‌ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడమే దీనికి కారణం. ప్రస్తుతం 150 లోడ్ల బియ్యం (4500 టన్నుల) గోదాముల బయట ఉన్నాయి. బుఽధవారం సాయంత్రానికి సీడబ్ల్యూఎస్‌ గోదాము వద్ద 47 ట్రక్కులు, చంద్రశేఖరపురం గోదాము వద్ద 76 ట్రక్కులు, వేదాయపాళెం గోదాము వద్ద 66 ట్రక్కుల బియ్యం అన్‌ లోడింగ్‌ కోసం వారం రోజులుగా పడి ఉన్నాయి.  ఒక లోడ్‌ అన్‌ లోడ్‌ చేయడానికి వారం సమయం తీసుకొంటున్నారు. గోదాములు ఖాళీ లేని కారణంగా ఈ పరిస్థితి ఎదురయ్యిందని రైస్‌మిల్లర్స్‌ అంటున్నారు. గతంలో ఎప్పడూ లేని విధంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి 50వేల టన్నుల బియ్యం దిగుమతి చేసుకొని రేషన్‌ బియ్యం కింద పంపిణీ చేస్తున్నారు. గోదాముల్లో ఖాళీ లేకపోవడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు. అన్‌లోడ్‌ కావడానికి వారంపైగా సమయం తీసుకోవడంతో లారీ అద్దెల రూపంలో తమపై లక్షల రూపాయల భారం పడుతోందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోదాముల వద్ద నిల్వ ఉన్న లోడ్లకు సంబంధించి మాత్రం సుమారు  రూ.3 లక్షల అదనపు అద్దె మిల్లర్లపై పడిందన్నారు.


ఫ మిల్లులు కిటకిట


 ఇది కాక మిల్లుల్లో మరో 10వేల టన్నుల సీఎంఆర్‌ బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం మిల్లుల్లో, లారీల్లో నిల్వ ఉన్న బియ్యం విలువ సుమారు రూ. 20 కోట్లు.  ఇవి కాక రైతుల నుంచి కొనుగోలు 10,500 టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉండిపోయాయి. వీటి విలువ సుమారు రూ. 25 కోట్లు. క్రష్‌ చేసిన సీఎంఆర్‌ రైస్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మిల్లర్లు ధాన్యం క్రస్‌ చేయడం మానేశారు. దీంతో ఒకవైపు బియ్యం బస్తాలు, మరొవైపు ధాన్యం బస్తాలతో మిల్లులు కిటకిటలాడుతున్నాయి. ఽమిల్లు లోపలా బయటా ధాన్యం బస్తాలు గుట్టలుగుట్టలుగా కనిపిస్తున్నాయి. 


ఫ రైతుల పరిస్థితి కటకట


 జిల్లా వ్యాప్తంగా రైతుల వద్ద ఇంకా సుమారు 35వేల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ. 50 కోట్లు. సీఎంఆర్‌ బియ్యం కొనుగోలు చేయడంలో జాప్యం కావడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లను ఆపేశారు. దీంతో రైతులు 35వేల టన్నుల ధాన్యాలను రోడ్లమీద రాశులుగా పోసుకొని కాచుకుకూర్చున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. జిల్లాకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడు గనుక వర్షాలు పడితే 35వేల టన్నుల్లో కనీస పక్షంలో 50 శాతం ధాన్యం తడిసి ముద్దవుతుంది. రైతులు నిలువునా మునిగిపోతారు. అధికారులు శ్రద్ధ చూపి ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే రైతులకు అన్యాయం చేసినవారవుతారు. జిల్లా మంత్రి వర్యులు కరోనాపైనే కాదు.. కర్షకులపై కూడా కాస్త దృష్టి సారించాలి. 


Updated Date - 2020-04-09T11:38:44+05:30 IST