నామవరం పీఏసీఎస్‌ భవనంలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-18T05:57:54+05:30 IST

మండలంలోని నామవరం పీఏసీఎస్‌ భవనంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పరుపులు, దిండ్లు తయారీకి ఉపయోగించే దూది (కాటన్‌) మొత్తం కాలి బూడిదైంది.

నామవరం పీఏసీఎస్‌ భవనంలో అగ్ని ప్రమాదం
అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన దూది

  పరుపులు, దిండ్లు తయారీకి ఉపయోగించే దూది దగ్ధం  

  సుమారు రూ.రెండు లక్షల ఆస్తి నష్టం

పాయకరావుపేట రూరల్‌, జనవరి17 : మండలంలోని నామవరం పీఏసీఎస్‌ భవనంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పరుపులు, దిండ్లు తయారీకి ఉపయోగించే దూది (కాటన్‌) మొత్తం కాలి బూడిదైంది.  భవనం లోని ఒక గదిని రైతు భరోసా కేంద్రానికి, మరో గది, వరండాను పరుపులు, దిండ్లు తయారీ షాపుకు అద్దెకు ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భవనంలోని వెనుక భాగాన ఉన్న దూది గోడౌన్‌లో మంటలు చెలరేగగా స్థానిక యువకులు చూసి షాపు నిర్వాహకుడు షేక్‌ చందూలాల్‌కు, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో తుని, నక్కపల్లి అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో సోమవారం తెలవారుజామున మంటలను అదుపు చేశారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడి భవనం అంతా వ్యాపించడంతో వేడికి భవనం గోడలు పగుళ్ళు ఏర్పడి పెచ్చులు ఊడి పడ్డాయి.  ఎస్‌ఐ పి.ప్రసాదరావు, అగ్నిమాపక కేంద్రం అధికారి డి.రాంబాబులు మాట్లాడుతూ భవనం శ్లాబు ఎత్తుకు పరుపులు, దిండ్లు తయారీకి ఉపయోగించే దూదిని నిల్వ చేయడంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని తెలిపారు.  ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందన్నారు. బాధితులు షేక్‌ చందూలాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-01-18T05:57:54+05:30 IST