‘నమస్తే ట్రంప్’ కారణంగానే ఇన్ని మరణాలు: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-05-26T23:47:47+05:30 IST

గుజరాత్‌లో 800కు పైగా చావులకు బీజేపీనే కారణమని రాష్ట్ర కాంగ్రెస్ పలు

‘నమస్తే ట్రంప్’ కారణంగానే ఇన్ని మరణాలు: కాంగ్రెస్

అహ్మదాబాద్: గుజరాత్‌లో 800కు పైగా చావులకు బీజేపీనే కారణమని రాష్ట్ర కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, మరణాలు పెరిగిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో స్వతంత్ర దర్యాప్తును కోరనున్నట్టు ఆయన చెప్పారు. కొవిడ్-19కు సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ జనవరి 22న జిల్లా అధికారులకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. అయినప్పటికి ప్రభుత్వం పీపీఈ కిట్లను, వెంటిలేటర్లను సిద్దం చేయలేకపోయిందని అమిత్ మండిపడ్డారు. ఇక్కడే బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 


ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు. మార్చిలో తబ్లీఘీ జమాత్‌కు హాజరైన వారి ద్వారా కరోనా కేసులు పెరిగాయని మీడియా రిపోర్ట్‌లు చెబుతుంటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కరోనాతో దేశం సమస్యల్లో ఉందని.. ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్‌ను కోరారు. కాగా.. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో వేల మంది పాల్గొన్నారు. అనంతరం మొతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. మరోపక్క గుజరాత్‌లో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 20న నమోదైంది. రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తి సాంపిల్స్, సూరత్‌కు చెందిన మహిళ సాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక మే 25 నాటికి గుజరాత్‌లో కేసులు 14,468కి చేరుకోగా.. మరణాల సంఖ్య 888కి చేరుకుంది. అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిన అహ్మదాబాద్‌లో నమోదు చేసుకున్నాయి.

Updated Date - 2020-05-26T23:47:47+05:30 IST