రాజ్యసభకు నమస్తే దామోదర్‌రావు

ABN , First Publish Date - 2022-05-19T09:09:04+05:30 IST

మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు.

రాజ్యసభకు నమస్తే  దామోదర్‌రావు

  • హెటిరో డ్రగ్స్‌ అధినేత పార్థసారథిరెడ్డి కూడా.. 
  • ఇద్దరికీ పెద్దల సభలో ‘ఆరేళ్ల’ సీట్లు
  • రెండేళ్ల’ బెర్త్‌ గాయత్రి రవికి.. 
  • అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌
  • ఇద్దరు ఓసీలు.. ఒక బీసీకి అవకాశం.. 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2, కరీంనగర్‌కు 1
  • ముగ్గురికి పార్టీ బీ ఫారాల అందజేత.. 
  • జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘హెటిరో’!


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే అధికార టీఆర్‌ఎస్‌ దినపత్రిక ‘నమస్తే తెలంగాణ’ ఎండీ దీవకొండ దామోదర్‌రావుకు రాజ్యసభ సీటు దక్కింది. అలాగే హెటిరో డ్రగ్స్‌ అధినేత డాక్టర్‌ బండి పార్థసారథిరెడ్డికీ బెర్తు లభించింది. వీరిద్దరికీ ఆరేళ్ల పూర్తి పదవీ కాలం కలిగిన పెద్దలసభ సీట్లు లభించాయి. ఇక రెండేళ్ల పదవీ కాలం ఉన్న మరో స్థానానికి గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఎంపికయ్యారు. వీరిలో దామోదర్‌రావు (వెలమ), పార్థసారథిరెడ్డి ఓసీలు. రవిచంద్ర బీసీ. ఈసారి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ తరఫున రెండు రాజ్యసభ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కగా, మరొకటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు దక్కింది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.


అందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక కాగా, మిగిలిన రెండూ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగం. ఏప్రిల్‌ 2, 2024 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండా ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. దీని నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ కాగా, గురువారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఇక పార్టీ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీ కాలం జూన్‌ 21న ముగియనుంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఈ రెండు స్థానాల భర్తీకి ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెల్చుకోనుంది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ అధిష్ఠానం తొందరపడకపోవడంతో ఆశావహులు ఉత్కంఠకు గురయ్యారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఎట్టకేలకు బుధవారం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడం, అనంతర పరిణామాల నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగానే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇ చ్చింది.


ఆయన్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ను చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రిటైర్‌ కా నున్న ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్‌ బీసీ (ము న్నూరు కాపు), కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఓసీ (బ్రాహ్మణ). అం టే, ఇద్దరు బీసీలు, ఒక ఓసీ స్థానంలో ఇప్పుడు ఇద్దరు ఓసీ లు, ఒక బీసీని సర్దుబాటు చేశారు. ఉప ఎన్నిక స్థానం తిరిగి బీసీతో భర్తీ అవుతున్నప్పటికీ మిగిలిన రెండు స్థానాలు ఓసీలకు దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీసీలకు ఒక సీటు తగ్గినట్లు అయింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు నిరాశ తప్పలేదు. 


ముగ్గురి ప్రస్థానమిదీ..

టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ బెర్త్‌లు ఖరారైన ముగ్గురిలో హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారథిరెడ్డి పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. పార్థసారథిరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వై ఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడనే పేరుంది. అలాగే ఇప్పు డు ఏపీ సీఎం జగన్‌తోనూ సాన్నిహిత్యం ఉంది. జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితుల్లో హెటిరో సంస్థ కూడా ఉంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌తోనూ పార్థసారథిరెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అంతేగాక పార్థసారథిరెడ్డి టీఆర్‌ఎ్‌సకి ఆర్థికంగా అండదండలు అందించారనే ప్రచారం ఉంది. ఇక మరో అభ్యర్థి దీవకొండ దామోదర్‌రావుకు రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం కేసీఆర్‌ చాలా కాలం క్రితమే హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నెరవేర్చారు. సీఎం కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఆర్థిక వ్యవహారాలను దామోదర్‌రావు చూస్తున్నారు. పార్టీలోనూ వివిధ స్థాయిల్లో పనిచేశారు. మరో అభ్యర్థి గాయత్రి రవి టీఆర్‌ఎ్‌సలో చే రిన అనతికాలంలోనే బీసీ-మున్నూరు కాపు కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. వాస్తవానికి ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ చొరవతో 2019 ఏప్రిల్‌లో టీఆర్‌ఎ్‌సలోకి వచ్చారు. టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత ఆయన పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే పేరుంది.  టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ముగ్గురూ బుధవారం రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. వారికి పార్టీ బీ ఫారాలను అందజేశారు. 


అభ్యర్థుల ప్రొఫైల్స్‌...


వద్దిరాజు రవిచంద్ర..

వద్దిరాజు రవిచంద్ర స్వస్థలం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తి. గ్రానైట్‌ వ్యాపారంతో ఖమ్మంలో స్థిరపడ్డారు. గాయత్రి గ్రూప్‌ కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, తెలంగాణ మున్నూరుకాపు ఆల్‌ అసోసియేషన్‌ జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.


బండి పార్థసారథిరెడ్డి

డాక్టర్‌ బండి పార్థసారఽథిరెడ్డి స్వస్థలం ఉమ్మడి ఖమ్మం జిల్లా కందుకూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఎంఎస్సీతో పాటు సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. అనంతరం వివిధ సంస్థల్లో సైంటిస్టుగా పనిచేశారు. ఆ అనుభవంతో హెటిరో ఫార్మా సంస్థను స్థాపించారు. ప్రస్తుతం డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 


దీవకొండ దామోదర్‌రావు

దీవకొండ దామోదర్‌రావు స్వస్థలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ సొంత టీవీ చానల్‌ టీ న్యూస్‌ తొలి ఎండీగా వ్యవహరించారు. ప్రస్తుతం చానల్‌ డైరెక్టర్‌గానేగాక, టీఆర్‌ఎస్‌ పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సీఎండీగా కొనసాగుతున్నారు.


Updated Date - 2022-05-19T09:09:04+05:30 IST