పనుల పూర్తికి మార్చి30 గడువు

ABN , First Publish Date - 2020-10-30T11:34:37+05:30 IST

జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పూర్తిచేయాలని ఖమ్మం ఎంపీ, జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ సమన్వయ కమిటీ(దిశ) చైర్మన్‌ నామ ..

పనుల పూర్తికి మార్చి30 గడువు

నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు

ఇకపై క్రమం తప్పకుండా దిశ కమిటీ సమావేశాలు

దిశ కమిటీ చైర్మన్‌ ఎంపీ నామ నాగేశ్వరరావు

సమన్వయంతో పథకాలు అమలుచేయాలి

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పూర్తిచేయాలని ఖమ్మం ఎంపీ, జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ సమన్వయ కమిటీ(దిశ) చైర్మన్‌ నామ నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం ఖమ్మం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ నామ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో దిశ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్‌ కర్ణన్‌ పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎంజీఎస్‌వై, స్వచ్ఛభారత్‌, పీఎం గ్రామయోజన, పీఎం గ్రామ సడక్‌ యోజన పథకాలతోపాటు మొత్తం 42శాఖల పనుల పురోగతిపై చర్చించారు.


ఈసందర్భంగా నామ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు జరిపించాలని, వచ్చే మార్చి 30నాటికి అన్ని పనులు పూర్తికావాలని ఆదేశించారు. ఉపాధి హామీని వ్యవసాయరంగనికి అనుసంధానం చేసేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద జిల్లాకు రూ.కోటి 18లక్షల పనిదినాలకు గాను ఇప్పటి వరకు 59లక్షల పనిదినాలు పూర్తయ్యాయన్నారు. పీఎంజీఎస్‌వై కింద జిల్లాలో రూ.299కోట్ల మేర గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 


జిల్లాలో కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి పథకాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంతో పాటు, దిశ కమిటీ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన కింద జిల్లాకు రూ.కోటి 69లక్షలతో 49పనులు మంజూరైనా, పనులు నత్తనడకన సాగుతున్నాయని పంచాయతీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి జిల్లాలో పీఎంజీఎస్‌వై పనులకు శంకుస్థాపలను జరుగుతుంటే ఈజిల్లాలో మంజూరులేకపోవడం బాధాకరమన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ అథారిటీ శాఖల మధ్య సమన్వయంలేదని, ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


ఉపాధిహామీ కింద పనులు ప్రగతిలో ఉన్నాయని, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్‌ యార్డు, రైతువేదిలకల పనులు చేపట్టామని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ తెలిపారు. జిల్లాలో 584గ్రామ పంచాయతీల్లో నర్సరీలు పెంచామని, 129 వ్యవసాయ క్లస్టర్లలో రైతువేదికలు పూర్తి అయ్యాయని వివరించారు. లేబర్‌ కంపోనెంట్‌ కింద రూ.81కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.54కోట్లు ఖర్చుచేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు వివరించారు. స్వచ్ఛభారత్‌ అర్బన్‌ మిషన్‌ కింద ఖమ్మంకార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటికే 4300 మరుగుదొడ్లు పూర్తి చేయడంతోపాటు పట్టణప్రగతిలో భాగంగా మరో 34 మోడ్రన్‌ పబ్లిక్‌ టాయిలెట్‌లు ఏర్పాటు చేశామని నగర కమిషన్‌ అనురాగ జయంతి వివరించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో జిల్లా వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది సేవలను దిశకమిటీ సమావేశం అభినందించింది. ఈసమావేశంలో మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, జేసీ స్నేహలత, నగర పాలక కమిషనర్‌ అనురాగజయంతి, సీఈవోప్రియాంక, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:34:37+05:30 IST