‘TDPలో చేరికపై అన్నతో చర్చించే నిర్ణయం తీసుకున్నా..’

ABN , First Publish Date - 2022-02-11T12:35:59+05:30 IST

కార్యకర్తల భవిషత్తు కోసం తాను టీడీపీలో చేరక తప్పదని తన అన్నతో చర్చించే నిర్ణ యం తీసుకున్నానని నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు..

‘TDPలో చేరికపై అన్నతో చర్చించే నిర్ణయం తీసుకున్నా..’

చిత్తూరు జిల్లా/కలికిరి : కార్యకర్తల భవిషత్తు కోసం తాను టీడీపీలో చేరక తప్పదని తన అన్నతో చర్చించే నిర్ణ యం తీసుకున్నానని నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. కలికిరి మండలం నగరిపల్లెలో గురువారం జరిగిన టీడీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అన్న విలువలుగల రాజకీయాలు చేశారని ఎంపీ కి ఇప్పుడు గుర్తొచ్చిందన్నారు. విలువలున్న వారు కాబట్టే రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్న వారు ఒకే ఇంట్లో ఉండటం భావ్యం కాదని దూరంగా ఉన్నారన్నారన్నారు. తాను పెద్దిరెడ్డిని పల్లెత్తు మాట కూడా అనని రోజుల్లోనే చంద్రబాబు తనకు కీలక బాధ్యతలు అప్పగించారని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. తాను వివిధ సమస్యలపై స్పందించిన ప్రతిసారీ తాను హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నానని ఎత్తి చూపడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తాను ఎన్ని భూములు అమ్ముకుని ఇల్లు కట్టుకున్నానో తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా వున్నాయని గుర్తు చేశారు.


అయోమయంలో ‘ఆంధ్రా’ ప్రజలు

రాజధాని ఏదో తెలియక రాష్ట్ర  ప్రజలు.. తమ జిల్లా ఏదో తెలియక జిల్లా వాసులు, డివిజన్‌ ఏదో తేలక మరో వైపు అయోమయంలో ఉన్నా రని పీలేరు మాజీ ఇన్‌చార్జి మల్లారపు  రవిప్రకాష్‌ అన్నారు. తాము ఎలిమెంటరీ స్కూల్లో వున్నామా, హైస్కూల్లో వున్నామా, అంగన్‌వాడీలో వున్నామా అనేది తేలక విద్యార్థులు అయోమయంలో వున్నారు. తమకు అసలు జీతాలు పెరిగాయో తగ్గాయో తేలక ఉద్యోగులు మరో పక్క అయోమయంలో వున్నారు. ఇక మైనింగ్‌ చేస్తే  మేలా, భూ కబ్జాలు చేస్తే లాభమా, మందు అమ్ముకుంటే క్షేమమా అని వైసీపీ నాయకులు అయోమయంలో తర్జనభర్జనలు పడుతున్నారన్నారు.


బాహుదా నది మీ నాయన సంపాదించాడా..!

బాహుదా నదిలో గుండ్లూరు రీచ్‌ పేరుతో అక్రమంగా జరుగుతున్న ఇసుక దోపిడీనీ అడ్డుకోవడానికి ప్రయత్నించిన రైతులను అధికారులు ‘బాహుదా నది మీ నాయన సంపాదించాడా’ అంటూ బెదిరిస్తున్నారని మాజీ సర్పంచ్‌ భాస్కర్‌ రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. పీఎల్‌ఆర్‌, చింతల, సీఆర్‌ఆర్‌ పేర్లతో టిప్పర్ల పైన స్టిక్కర్లు అంటించుకుని ఇసుక తోలుతున్న ఫొటోలను ఆయన ప్రదర్శించి చూపా రు. టీడీపీ నాయకులు మద్దిపట్ల సూర్యప్రకాష్‌, కోటపల్లె బాబు రెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వర రావు, దద్దాల హరిప్రసాద్‌ నాయుడు, వలిగట్ల వెంకట్రమణ, రెడ్డిబాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-02-11T12:35:59+05:30 IST