నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం

ABN , First Publish Date - 2022-05-23T06:30:48+05:30 IST

ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణం హత్య నేపథ్యంలో ఆదివారం పోలీసులు రామవరంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధం చేశారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం

అనపర్తి, మే 22: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణం హత్య నేపథ్యంలో ఆదివారం పోలీసులు రామవరంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధం చేశారు. పోస్టుమార్టం అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వగ్రామమైన పెదపూడి మండలం గొల్లల మామిడాడకు తరలించారు. నివాళులర్పించేందుకు రామకృష్ణారెడ్డి అక్కడకు వెళ్లకుండా పోలీసులు ముందుగా గృహ నిర్బంధం చేశారు. చివరకు మామిడాడలో అంత్యక్రియలు పూర్తవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లారు. తాను రామచంద్రపురంలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని జిల్లా ఎస్పీకి తెలపడంతో ఆయన మామిడాడ వెళ్లకూడదని నిబంధన విధించి రామచంద్రపురం వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అనంతరం ఆయన వెంట ఎస్కార్ట్‌ వాహనం ద్వారా పోలీసులు అనుసరిస్తూ రామచంద్రపురం వరకు వెళ్లారు.
రూ.5 లక్షల ఆర్థిక సాయం
సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించి రూ.5లక్షల ఆర్థిక సహాయం ప్రకటించినట్టు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రామవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నివాళులర్పించేందుకు తనను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులే భక్షిస్తుంటే ఇక ప్రజలకు దిక్కెవరని అన్నారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిరసపల్లి నాగేశ్వరరావు, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పులగం అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:30:48+05:30 IST