BJP: ఆయన కొనసాగుతారా.. కొత్తవారొస్తారా..?

ABN , First Publish Date - 2022-08-23T18:12:35+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(BJP state president)గా నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalin Kumar Kateel as BJP State President) మరికొన్ని నెలల పాటు

BJP: ఆయన కొనసాగుతారా.. కొత్తవారొస్తారా..?

                                   - ముగిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ కాలం


బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(BJP state president)గా నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalin Kumar Kateel as BJP State President) మరికొన్ని నెలల పాటు కొనసాగుతారా లేక కొత్తవారొస్తారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా బీజేపీ అధ్యక్షుడి అంశంపై పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చివరకు కటీల్‌ అధ్యక్ష పదవీ కాలం మూడేళ్లు ముగిసింది. దీంతో మరోసారి కమలం సారథి ఎవరనే కుతూహలం తీవ్రమైంది. 2019 ఆగస్టు 20న దక్షిణకన్నడ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్న నళిన్‌కుమార్‌కటీల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యకుడి పార్టీ అగ్రనేతలు ఖరారు చేశారు. మూడేళ్ల వ్యవధిలో ఎన్నో రాజకీయ మలుపులు, ఎన్నికలు జరిగాయి. ఇలా ఈనెల 20న నాటికి కటీల్‌ పదవీకాలం ముగిసింది. కొత్త అధ్యక్షుడి విషయమై అధిష్టానం గడువు ముగిసేలోగానే ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ అటువంటి నిర్ణయం ఏదీ ప్రకటించక పోవడంతో ఎదురు చూసే పరిస్థితి తలెత్తింది. ప్రత్యేకించి మరో ఎనిమిది నెలల్లోనే శాసనసభ ఎన్నికలు ఉండటంతో అధిష్టానం అన్ని వర్గాలను సంతృప్తి పరచే దిశగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కటీల్‌ అధికారం చేపట్టాక యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగారు. శాసనసభ ఉప ఎన్నికలతో పాటు రాజ్యసభ, విధానపరిషత్‌ ఎన్నికలు ఆయన వ్యవధిలోనే సాగాయి. అనంతరం యడియూరప్ప చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai)ను సీఎం చేశారు. అప్పట్లో కటీల్‌ రాజకీయ అంశాలపై ఆచితూచి వ్యవహరించారు. మూడేళ్లలో కటీల్‌ ఎవరినీ నొప్పించకుండానే కొనసాగారు. కానీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్షుడితో పోల్చితే దూసుకుపోయే తత్వం లేదని, అన్ని వర్గాలను కలుపుకుపోవడంలో కానీ కీలక నిర్ణయాలు తీసుకోవడంలోను పార్టీ పెద్దల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఎదుర్కొన్నారు. 


రేసులో పలువురు ప్రముఖులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి సునిల్‌కుమార్‌, మాజీ మంత్రి అరవింద లింబావళి(Former minister Aravinda Limbavali) ఉన్నారు. సునిల్‌కుమార్‌ మినహా ముగ్గురి పేర్లు కొన్నినెలలుగా కొనసాగుతున్నాయి. రేసులో ఉండే శోభాకరంద్లాజే లోక్‌సభ సభ్యురాలు కాగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారే. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలైన లింగాయత, ఒక్కలిగులకు సమానమైన హోదాలు ఉండాలనే ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తాయి. లింగాయత్(Lingayat) సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప ఉండటంతో అధ్యక్ష పదవిని ఒక్కలిగలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదే సాధ్యమైతే కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిలలో ఒకరు అధ్యక్షులయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రోజులలోనే అధిష్టానం పెద్దలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2022-08-23T18:12:35+05:30 IST