నల్లగొండలో కోమటిరెడ్డికి ఎసరు పెడుతున్న ఆ ఇద్దరు..!

ABN , First Publish Date - 2020-10-21T15:55:42+05:30 IST

ఆ నియోజకవర్గంలో కాకలు తీరిన ఓ నాయకుడికి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా చక్రం తిప్పిన ఆ లీడర్‌ను ఢీకొట్టేందుకు యత్నిస్తున్నది ఎవరు? తనకు రాజకీయ భవిష్యత్‌ ఇచ్చిన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడానికి....

నల్లగొండలో కోమటిరెడ్డికి ఎసరు పెడుతున్న ఆ ఇద్దరు..!

ఆ నియోజకవర్గంలో కాకలు తీరిన ఓ నాయకుడికి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా చక్రం తిప్పిన ఆ లీడర్‌ను ఢీకొట్టేందుకు యత్నిస్తున్నది ఎవరు? తనకు రాజకీయ భవిష్యత్‌ ఇచ్చిన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడానికి కారణం ఏమిటి? ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు తెరవెనక పావులు కదుపుతున్నది ఎవరు? హస్తం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలేంటి...? గ్రూప్‌ రాజకీయాలకు తెరలేపింది ఎవరు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏమిటా కథ? ప్రత్యేక కథనం మీకోసం...


ఈయన సైలెంట్.. ఆయన దూకుడు..

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నల్లగొండ నియోజకవర్గంలో కాకలు తీరిన రాజకీయ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్‌ పెట్టేందుకు సొంత పార్టీ నేతలు ప్రయత్నిస్తుండటం కలకలం రేపుతోంది. నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టికి కంచుకోట. 1999 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండడం కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి దూకుడు పెంచడంతో ఇప్పుడు పార్టీ రెండుగా చీలింది.


ఆయనే కారణమని...

గతంలో కాంగ్రెస్‌, పీఆర్పీ, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తుందని ఆశించి భంగపడ్డారు. అసంతృప్తితో ఉన్న ఆయన్ని బుజ్జగించి తన గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఆయనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా కోమటిరెడ్డి విజయాన్ని సాధించలేకపోయారు. కోమటిరెడ్డి ఓటమికి దుబ్బాక నర్సింహారెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కారణమైందనే ప్రచారం అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత నుంచి నర్సింహారెడ్డిపై కోమటిరెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. వాస్తవానికి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచాక..నల్లగొండ నియోజకవర్గానికి అడపాదడపా మాత్రమే వచ్చిపోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండి కొత్త వివాదాలకు పోకూడదనే ఆలోచనతో నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు దుబ్బాక నర్సింహారెడ్డి స్పీడ్‌ పెంచినట్లు చర్చ సాగుతోంది. 


ఎవరు పై చేయి సాధిస్తారో...

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడిగా పేరొందిన దుబ్బాక నర్సింహారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆయనకు ప్రాధాన్యం ఇస్తుండటం కోమటిరెడ్డి అనుచరులకు మింగుడుపడటం లేదట. దీంతో పార్టీ క్యాడర్‌ కూడా వర్గాలుగా విడిపోయింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్నారు. వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ముందు నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిస్థాయిలో యాక్టీవ్‌ అవుతారన్న మరో చర్చ సాగుతోంది. మరోవైపు ఉత్తమ్‌ కుమార్‌, దుబ్బాక నర్సింహారెడ్డి కలిసి చాపకింద నీరులా కోమటిరెడ్డికి చెక్‌పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నల్లగొండలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డికి..స్థానికంగా తన హవాను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనలో అసహనం రేపుతున్నాయట. మరి ఆధిపత్యపోరులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేయి సాధిస్తారా? లేక దుబ్బాక నర్సింహారెడ్డినా అనేది చూడాలి.

Updated Date - 2020-10-21T15:55:42+05:30 IST