చెక్‌ పడేదెప్పుడో...?

ABN , First Publish Date - 2020-12-05T05:43:24+05:30 IST

బద్వేలు కేంద్రంగా నకిలీ ఇంటి పట్టాల బాగోతం గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. నకలీ పట్టాదారులు ప్రభుత్వ స్థలాలతో పాటు, అమాయక ప్రజల ఇంటి స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు.

చెక్‌ పడేదెప్పుడో...?

బద్వేలు కేంద్రంగా నకిలీ పట్టాల రాకెట్‌

యథేచ్ఛగా ఇంటి స్థలాల ఆక్రమణ

అడ్డుకట్ట వేయలేకపోతున్న అధికారులు


బద్వేలు, డిసెంబరు 4: బద్వేలు కేంద్రంగా నకిలీ ఇంటి పట్టాల బాగోతం గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. నకలీ పట్టాదారులు ప్రభుత్వ స్థలాలతో పాటు, అమాయక ప్రజల ఇంటి స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. బద్వేలు పట్టణంలో నకిలీ ఇంటిపట్టాల తయారీ బాగోతం చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. బద్వేలు పట్టణంలో గోపవరం మండలం కూడా కలిసి ఉంది. బద్వేలు పట్టణం మున్సిపాలిటీ స్థాయికి పెరగడంతో ఈ ప్రాంతాలలో భూములకు విలువ పెరిగింది. అంతేకాకుండా పట్టణంలో చాలా వరకు రిజిస్టర్డ్‌ స్థలాలు లేకపోవడంతో ఇదే ఆసరాగా చేసుకుని కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ పట్టాలను సృష్టిస్తున్నారు. వీటితో విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, నిజమైన పట్టాలు కలిగిన వారిని బెదిరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.  ఈ తతంగం అంతా గతంలో విధులు నిర్వహించి బదిలీ అయిన తహసీల్దార్లు, రిటైర్డ్‌ అయిన తహసీల్దార్ల సీళ్లు తయారు చేయడంతో పాటు వారి సంతకాలు కూడా ఫోర్జరీ చేసి నడుపుతున్నట్లు సమాచారం. దీంతో బద్వేలు పట్టణంలో అసలు పట్టా ఏదో, నకిలీ పట్టా ఏదో తెలియని విధంగా ఉంది. ఇది అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. గత కొన్ని నెలల నుంచి  కొందరు సిద్ధహస్తులైనవారు ఈ నకిలీ ఇంటిపట్టాలు సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ నకిలీ పట్టాలు చూపి నిజమైన పట్టాలు కలిగిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అమాయకులైన కొందరికి మాయమాటలు చెప్పి నకిలీ పట్టాలు చూపించి లక్షలాది రూపాయలకు ఇంటిస్థలాలను అమ్ముతున్నారు. దీంతో ఒకే సర్వే నెంబరు కలిగిన ఒక ఇంటి పట్టాకు రెండు, మూడు పట్టాలు పుట్టుకొస్తుండడంతో భూవివాదాలకు దారితీస్తోంది. వీటిని కొనుగోలు చేసిన నిజమైన లబ్ధిదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నకిలీ పట్టాలతో పోలీసు, రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా బద్వేలు మండలంలో గతంలో గ్రీవెన్స విచారణలో 500కు పైగా నకిలీ పట్టాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ఇంటిపట్టాల విషయమై అప్పట్లో విజిలెన్స అధికారులు విచారణ జరిపి గోపవరం మండలంలో నకిలీ పట్టాలు ఉన్నట్లు గుర్తించి పైస్థాయి అధికారులకు నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ ఈ నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికైనా నకిలీ ఇంటిపట్టాల రాకెట్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటికి చెక్‌ పెట్టకపోతే మరింత మంది అమాయక ప్రజలు వారి చేతిలో మోసపోక తప్పదు. 


చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాం. బద్వేలు పట్టణంలోని 1755 సర్వే నెంబరులో అక్రమంగా కట్టడాలు చేస్తుంటే తొలగించాం. బద్వేలులో ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించేందుకు యత్నించినా, నకిలీ పట్టాలు సృష్టించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. 

-శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్‌, బద్వేలు  

Updated Date - 2020-12-05T05:43:24+05:30 IST