చిత్తూరు డివిజన్‌కు ఖాజీ నియామకం

ABN , First Publish Date - 2020-10-23T10:55:32+05:30 IST

చిత్తూరు డివిజన్‌లో ముస్లిం కుటుంబాల్లో పెళ్ళిళ్ళు నిర్వహించడానికి ప్రభుత్వ అధికారిక ఖాజీగా చిత్తూరు పట్టణానికి చెందిన ఎస్‌.ఎం.నయీముల్లా జూహారీని నియమిస్తూ ..

చిత్తూరు డివిజన్‌కు ఖాజీ నియామకం

కలికిరి, అక్టోబరు 22: చిత్తూరు డివిజన్‌లో ముస్లిం కుటుంబాల్లో పెళ్ళిళ్ళు నిర్వహించడానికి ప్రభుత్వ అధికారిక ఖాజీగా చిత్తూరు పట్టణానికి చెందిన ఎస్‌.ఎం.నయీముల్లా జూహారీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలోని కె.ఎన్‌.కాలనీకి చెందిన నయీముల్లా మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జిల్లా కలెక్టరు పంపిన ప్రతిపాదనల మేరకు ఖాజీగా నియామకానికి అన్ని అర్హతలు నిర్ధారించుకున్న తరువాత ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాకుండా చిత్తూరు ప్రభుత్వ ఖాజీతోపాటు చిత్తూరు, తవణంపల్లె, పెనుమూరు, ఎస్‌ఆర్‌ పురం, కార్వేటినగరం, యాదమరి, నిండ్ర, వడమాలపేట, బంగారుపాళెం, పూతలపట్టు, ఐరాల మండలాలకు చెందిన ముత్తవల్లీలు నయీముల్లా పేరును ప్రతిపాదించినట్లు కలెక్టరు ప్రతిపాదించారు. ఖాజీ  నియామకం అనంతరం నయీముల్లా తన సహాయకులుగా ముగ్గురు నయీబ్‌ ఖాజీలను నియమించుకోవచ్చు.


ఈ నియామకం విషయంలో ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. ముస్లిం పెళ్ళిళ్ళ విషయంలో ఖాజీ ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, మైనర్లకు వివాహం చేయవద్దని, ఇస్లాం నిషేధించిన లేక ఇస్లాం అంగీకరించని వాటిని నిర్వర్తించకూడదని, కాంటాక్టు పెళ్ళిళ్ళు జరపొద్దని, చిత్తూరు డివిజను పరిధికి లోబడి మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలని, పదవీ కాలం పూర్తి కాగానే పెళ్ళిళ్ళ రికార్డులను వక్ఫ్‌ బోర్డుకు స్వాఽధీనం చేయాలని షరతులు విధించారు. అంతేగాకుండా వరుసగా ఆరు నెలల కాలం అందుబాటులో లేకున్నా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహ్మద్‌ ఇలియాస్‌ రజ్వి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

Updated Date - 2020-10-23T10:55:32+05:30 IST